Share News

ప్రధాన రహదారిపై భారీ గుంతలు

ABN , Publish Date - May 15 , 2024 | 11:23 PM

ధర్మవరం నుంచి ఎనఎస్‌ గేటుకు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై అక్కడక్కడ పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి.

ప్రధాన రహదారిపై భారీ గుంతలు
A huge pothole on the road at Chandamuru village

చెన్నేకొత్తపల్లి, మే 15: ధర్మవరం నుంచి ఎనఎస్‌ గేటుకు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై అక్కడక్కడ పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. మండలంలోని నాగసముద్రం క్రాస్‌ చందమూరు, ప్యాదిండి గ్రామాల సమీపంలో ప్రధాన రహదారిపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డు వెంట అనునిత్యం పెద్దఎత్తున రాకపోకలు సాగుతుండటంతో చాలా మంది ప్రమాదాలకు గురవుతుండటంతో పాటు మృత్యువాత కూడా పడ్డారు. ఇటీవల నాగసముద్రం క్రాస్‌ వద్ద ఏర్పడిన గుంత వద్ద ప్రమాదానికి గురై సీకేపల్లికి చెందిన హాస్టల్‌ వార్డెన మృతిచెందాడు. అదే విధంగా చందమూరు వద్ద ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి అనేక మంది గాయపడ్డారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రోడ్డుపై గుంతలతో ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. వాహనాలు అదుపు తప్పి రోడ్డుపక్కకు బోల్తాపడిన సంఘటనలున్నాయి. ప్రజలు మృత్యువాత పడుతున్నా... ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకున్న పాపానపోలేదని ప్రజలు, వాహనచోదకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - May 15 , 2024 | 11:23 PM