Share News

ఇల్లు..సొల్లు..!

ABN , Publish Date - May 31 , 2024 | 11:45 PM

జగనన్న కాలనీ పేరుతో ఇళ్లు కాదు..ఊళ్లు నిర్మిస్తాం..ప్రతి పేదవారి సొంతింటి కల నెరవేరుస్తాం..అన్న సీఎం జగన మాటలు ఉత్తిత్తివే అని తేలిపోయాయి. జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణంలో అటు వైసీపీ ప్రభుత్వం..ఇటు అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు పడకేశాయి.

ఇల్లు..సొల్లు..!

ఫ సీఎం జగనవి అన్నీ ఉత్త మాటలే

ఫ ఇళ్ల లబ్ధిదారుల ఆగ్రహం

ఫ బిల్లుల జాప్యంతో పడకేసిన నిర్మాణాలు

అనంతపురం, సిటీ, మే31: జగనన్న కాలనీ పేరుతో ఇళ్లు కాదు..ఊళ్లు నిర్మిస్తాం..ప్రతి పేదవారి సొంతింటి కల నెరవేరుస్తాం..అన్న సీఎం జగన మాటలు ఉత్తిత్తివే అని తేలిపోయాయి. జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణంలో అటు వైసీపీ ప్రభుత్వం..ఇటు అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు పడకేశాయి. మొండి గోడలు, అరకొర నిర్మాణాలతో కాలనీలు బోసిగా దర్శనమిస్తున్నాయి. ఐదేళ్లుగా అరకొరగా సాగిన నిర్మాణాలు ఎన్నికల పక్రియ ప్రారంభం కావడంతో మరింత దయనీయంగా మారాయి. పైగా ప్రభుత్వం ఇసుక, సిమెంట్‌ తదితర సామగ్రి సకాలంలో సరఫరా చేయకపోవడం.. బిల్లుల జాప్యంతో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం పెనుభారంగా మారింది. సొంతింటి నిర్మాణంపై కోటి ఆశలు పెట్టుకున్న తాము నేడు నిలువ నీడ లేకుండా పోయామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దెలు కట్టలేక అప్పులపాలయ్యామంటున్నారు. ఏది ఏమైనా జిల్లావ్యాప్తంగా జగనన్న ఇళ్ల నిర్మాణాల పరిస్థితి దయనీయంగా మారింది.


లబ్ధిదారులకు తప్పని అవస్థలు

జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగలేదు. ఇసుక, సిమెంట్‌ సరైన సమయానికి సరఫరా చేయకపోవడం, బిల్లులు సకాలంలో ఇవ్వక పోవడంతో లబ్ధిదారులు అప్పులపాలు కావాల్సి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు పథకం తీరు జిల్లా వ్యాప్తంగా అభాసుపాలయ్యిందనే విమర్శలు లేకపోలేదు. ఏళ్ల తరబడి ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో బాధిత లబ్ధిదారులకు సొంతింటి కల మరింత జాప్యమైంది. సొంతింటి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు చూడాల్సిన దుస్థితి నెలకొంది.


ఇసుక, సిమెంట్‌ సరఫరా అంతంతే

జిల్లాలో ప్రధానంగా అనంతపురం, రాప్తాడు, తాడిపత్రి, కళ్యాణదుర్గం, ఉరవకొండ ప్రాంతాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణ పరిస్థితి దయనీయంగా మారింది. వీటికితోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రూ. 1.80లక్షలు ఇంటి నిర్మాణానికి ఏమాత్రం సరిపోకపోయినా.. సొంతింటి కల కోసం చాలా మంది లబ్ధిదారులు నానా అవస్థలు పడి నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వం లబ్ధిదారులు ఎంచుకున్న ఆప్షన ప్రకారం ఇసుక, సిమెంట్‌ సరఫరా చేయాల్సి ఉంది. ప్రభుత్వం అరకొరగా అందించడంతో అవి సరిపోక నిర్మాణాలు ఆగిపోయాయి. కొందరు లబ్ధిదారులు అప్పులు చేసి మరీ ఇళ్లు కట్టించుకున్నామని వాపోతున్నారు.


బిల్లుల మంజూరులో జాప్యం

జగనన్న కాలనీల్లో అప్పులు చేసి నిర్మించుకున్న ఇళ్లకు సైతం బిల్లులు సకాలంలో రాకపోవడంతో లబ్ధిదారులకు మరింత ఆవేదన తప్పడం లేదు. బిల్లుల జాప్యంతోనే చాలా మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి జంకుతున్నారు. ఇప్పటికే జిల్లాలో రూ. 50 కోట్లకు పైగానే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. ఏదీ ఏమైనా జగనన్న ఇళ్ల పరంగా సీఎం జగన చెప్పిన మాటలకు.. జిల్లాలో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన లేకుండా పోయింది. ఇళ్లు కాదు కాలనీల పేరుతో ఊళ్లకు ఊళ్లు నిర్మించి ఇస్తామని మాట ఇచ్చిన జగన తమను అప్పుల పాలు చేశారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల కాలంలో జగనన్న కాలనీలు చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

Updated Date - May 31 , 2024 | 11:45 PM