Share News

Hospital: సూపర్‌స్పెషాలిటీలో అరుదైన శస్త్రచికిత్స

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:05 AM

ఓ ట్రాన్సజెండర్‌కు అరుదైన శస్త్ర చికిత్స చేసి సూపర్‌స్పెసాలిటీ ఆస్పత్రి వైద్యులు ప్రాణాలు నిలిపారు. వివరాలను సూపర్‌ స్పెషాలిటీ న్యూరో సర్జరీ విభాగం అధిపతి డాక్టర్‌ భాస్కర్‌ మంగళవారం వెల్లడించారు. ఈనెల 25న అనంత సర్వజన ఆస్పత్రిలో ట్రాన్సజెండర్ల ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Hospital: సూపర్‌స్పెషాలిటీలో అరుదైన శస్త్రచికిత్స
A medical team with a recovered transgender

అనంతపురం టౌన, జూలై 30: ఓ ట్రాన్సజెండర్‌కు అరుదైన శస్త్ర చికిత్స చేసి సూపర్‌స్పెసాలిటీ ఆస్పత్రి వైద్యులు ప్రాణాలు నిలిపారు. వివరాలను సూపర్‌ స్పెషాలిటీ న్యూరో సర్జరీ విభాగం అధిపతి డాక్టర్‌ భాస్కర్‌ మంగళవారం వెల్లడించారు. ఈనెల 25న అనంత సర్వజన ఆస్పత్రిలో ట్రాన్సజెండర్ల ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఉరవకొండకు చెందిన స్వాతి అనే 40ఏళ్ల ట్రాన్సజెండర్‌ తనకు ఆరోగ్యం సరిగా లేదని, ఇటీవల కిందకు పడ్డానని అప్పటినుంచి కళ్లు తిరగడం తలతిరగడం, భరించలేక తలనొప్పితో ఇబ్బందు పడుతున్నానని సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎంఓ డాక్టర్‌ హేమలతకు తెలిపారు. దీంతో వారు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి పంపించి న్యూరోసర్జరీ డాక్టర్లతో పరీక్షలు చేయించారు. తలకు తగిలిన గాయం వల్ల మెదడులో ఇరువైపులా రక్తస్రావం జరిగి ఒత్తిడి పెరగడంతో తలతిరగడం, తలనొప్పి వస్తున్నాయని గుర్తించారు. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంటుందని, శస్త్ర చికిత్స చేయాలని, లేదంటే ప్రాణానికి ముప్పు ఉంటుందని, బయట చేయించుకుంటే రూ.ఆరు లక్షలు అవుతుందని డాక్టర్లు తెలిపారు. అంతఖర్చు భరించలేనని ట్రాన్సజెండర్‌ చెప్పడంతో సూపర్‌స్పెషాలిటీ న్యూరోసర్జరీ హెచఓడీ డాక్టర్‌ భాస్కర్‌, డాక్టర్‌ రవితేజ, డాక్టర్‌ భాస్కరబాబు, డాక్టర్‌ అచ్యుత అనస్తీషియా డాక్టర్లు రీనా, మధు తదితరులు ఈనెల 27న శస్త్ర చికిత్స చేశారు. అది విజయవంతం కావడంతో ఆమె ఆరోగ్యంగా కోలుకున్నారు. అరుదైన ఆపరేషన చేసి ఓట్రాన్స జెండర్‌ ప్రాణం కాపాడినందుకు సూపర్‌స్పెషాలిటీ న్యూరో సర్జరీ విభాగం డాక్టర్లను సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంఓలు అభినందించారు.

Updated Date - Jul 31 , 2024 | 12:05 AM