Share News

RAINS: మడకశిరలో భారీవర్షం

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:43 PM

మండలవ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో వంకలు,వాగులు పొంగిపొర్లాయి. చెక్‌డ్యాంలు నిండిపోయాయి. రైతులు, ప్రజలు హర్షం వ్యక్తంచేవారు.

RAINS: మడకశిరలో భారీవర్షం
Madakasira Mandal is a hot flowing bend at Govindapuram

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ఇళ్ల మధ్యలో నిలిచిన వర్షపు నీరు

ఇబ్బందిపడ్డ ప్రజలు

మడకశిర రూరల్‌, జూన 7: మండలవ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో వంకలు,వాగులు పొంగిపొర్లాయి. చెక్‌డ్యాంలు నిండిపోయాయి. రైతులు, ప్రజలు హర్షం వ్యక్తంచేవారు. గోవిందాపురం, నీలకంఠాపురం, గుద్దిలపల్లి, జీవీ పాళ్యం, గుండుమల తదితర గ్రామాల్లోని వంకలు, వాగులు జోరుగా పారుతున్నాయి ఆ నీరు అంతా చెరువులకు చేరుతున్నాయి.

మడకశిర టౌన: నియోజకవర్గ వ్యాప్తంగా వారం రోజుల నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకుపైగా వర్షం పడింది. దీంతో రహదారులపైకి నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్ల మధ్యకు నీరు చేరాయి. వర్షం కురుస్తుండడంతో పట్టణంలో విద్యుత సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 5 గంటలకు పైగా సరఫరా నిలిచిపోయింది. ఉరుములు మెరుపులతో కూ డిన వర్షం కురవడంతో చిన్న చిన్న వంకలు, వాగులు పొంగిపొర్లాయి. గు రువారం రాత్రి అమరాపురం మండలంలో 48.4 మి.మీ వర్షం నమోదు అయింది. మడకశిరలో 9.6, గుడిబండలో 6.4, అగళిలో 10.2, రొళ్ళలో 2.2మి.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.


పెనుకొండ రూరల్‌: మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లడంతో చెక్‌డ్యామ్‌లు, కుంటలకు నీరు చేరాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెనుకొండ మండలంలో పలు గ్రామాల్లో రోడ్లపై వర్షపునీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

గుడిబండ: మండలంలోని మందలపల్లి, కొంకల్లు, ఎస్‌.రాయాపురం, పూజారిపల్లి, మేకలగట్ట, ఎస్‌ఎస్‌ గుండ్లు, సీసీగిరి, తదితర గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వంకలు, వాగులు పొంగిపొర్లి కొంకల్లు చెరువుకు భారీగా నీరు చేరాయి. బోరుబావుల్లో నీటిమట్టం పెరిగిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.


హిందూపురం అర్బన: పట్టణంలో మూడు రోజులుగా సాయంత్రం అయిందంటే వర్షం కురుస్తోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి వర్షం ఏకధాటిగా కురిసింది. జనవరి నుంచి జూన నెల ప్రారంభం వరకూ ఎండ వేడిమికి విలవిల్లాడిన ప్రజలు ప్రస్తుతం కురుసున్న వర్షాలకు ఊరట లభించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. చిన్న కుంటలు నీటితో నిండిపోయాయి. కాలువలు శుభ్రం చేయకపోవడంతో పలు చోట్ల మురుగు నీరు రోడ్లపైకి చేరాయి.

పెనుకొండ టౌన: రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం రావడంతో సోమందేపల్లి మండలంలోని వెలిదడకల సమీపంలోని చెరువుకు భారీ నీరు చేరింది.

Updated Date - Jun 07 , 2024 | 11:44 PM