నిధుల్లేవ్..విధుల్లేవ్..!
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:42 PM
గ్రామీణ ప్రజలకు ప్రజా సేవ చేయాలన్న కోరికతో పదవులు చేపట్టిన ప్రజా ప్రతినిధులకు వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిరాశే మిగిలింది. ఎన్నికై మూడేళ్ల కాలం కావస్తున్నా తమ సెగ్మెంట్లను అభివృద్ధి చేసుకునేందుకు నిధులు..విధులూ కల్పించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఫ వైసీపీ పాలనలో ఉత్సవ విగ్రహాలుగా ఎంపీటీసీలు ఫ మూడేళ్లు గడుస్తున్నా చిల్లిగవ్వ రాకపాయె..
ఫ టీడీపీతోనే న్యాయం జరుగుతుందంటున్న ప్రజాప్రతినిధులు ఫ అభివృద్ధి కోసమే టీడీపీ వైపు..
చిలమత్తూరు, జూలై 28: గ్రామీణ ప్రజలకు ప్రజా సేవ చేయాలన్న కోరికతో పదవులు చేపట్టిన ప్రజా ప్రతినిధులకు వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిరాశే మిగిలింది. ఎన్నికై మూడేళ్ల కాలం కావస్తున్నా తమ సెగ్మెంట్లను అభివృద్ధి చేసుకునేందుకు నిధులు..విధులూ కల్పించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కనీసం ప్రభుత్వ కార్యాలయాల్లో గౌరవమైనా దక్కుతుందనుకుంటే అదీకూడా అడియాశగానే మారింది. 2021 ఏప్రిల్ 8న ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మండలంలోని 15 ఎంపిటీసీ స్థానాల్లో 15 స్థానాలను వైసీపీ కైవశం చేసుకుంది.
మూడేళ్లు గడిచినా..
ఎంపీటీసీలుగా గెలిచి మూడేళ్లు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేచ్చలేదని ఎంపీటీసీలు లోలోపల మధనపడుతున్నారు. ప్రత్యేకంగా నిధులు లేవు...విధులు లేవు. గ్రామ పంచాయతీల్లో కూర్చొందామంటే కనీసం ఎంపీటీసీలకు ప్రత్యేకంగా కుర్చీలు లేకుండా పోయాయి. గ్రామాల్లో చిన్న చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి నెలకొనడంతో ఎంపీటీసీలు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిషత సమావేశాల్లో ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లినా వాటిని పరిష్కరించిన దాఖలాలు లేవు.
పదవి ఉన్నా.. లేనట్టే..
ఎంపీటీసీల పదవీ కాలం ఇప్పటికే మూడేళ్ల కాలం గడిచిపోయింది. మండల పరిషతకు గతంలో బీఆర్‌జీఎఫ్ తలసరి గ్రాంట్ జనరల్ ఫండ్, స్టేట్ ఫైనాన్స కార్పోరేషన, 14వ ఆర్థిక సంఘం నిధులు సమకూరేవి. దీంతో గ్రామాల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, అంతర్గత రహదారుల నిర్మాణాలు చేపట్టేవారు. ప్రస్తుతం ఆ నిధులన్నీ ఎంపీటీసీల ప్రమేయం లేకుండా నేరుగా గ్రామ పంచాయతీలకు ఇస్తుండటంతో వారికి గౌరవం కూడా లేకుండా పోయింది. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 20 శాతం ఎంపీటీసీలకు ఇవ్వాల్సిందిగా కేంద్రం సూచించినా అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎంపీటీసీలకు నిఽధుల వాటా 25 శాతం పెంచాలన్న విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ప్రత్యేక నిధులు కెటాయిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ అదీ కార్యాచరణ దాల్చలేదు. ఎంపీటీసీ పదవి ఉన్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతున్నామని ఎంపీటీసీలు వాపోతున్నారు.
నిధుల కోసం వినతులు
ఏదోరకంగా తమ హామీలను నిలబెట్టుకొని ప్రజల్లో గౌరవం పొందాలనుకున్న ఎంపీటీసీకు అడుగడుగునా నిరాశే ఎదురైంది. గ్రామాల్లో వారికి ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని వినతులు ఇస్తున్నా వాటికి స్పంధన రావడం లేదు. కనీసం సిసి రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటుచేద్దామన్నా నిధులులేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మండల పరిషతకి పెద్దగా నిధులు మంజూరు కాకపోవడంతో, సాధారణ నిధులు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో వారు ఏ పని చేయలేకపోయారు. గత ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీలకు ఒక్క పైసా కూడా విదల్చకపోవడంతో వారు ఆవేదనకు గురవుతున్నారు.
టీడీపీతోనే న్యాయం జరుగుతుందని..
స్థానిక సంస్థలను బలోపేతం చేసిన ఘనత టీడీపీదే అని ఏ నాయకుడికైనా బలమైన నమ్మకం. స్థానిక ప్రజాప్రతినిధులకు అవసరమైన నిధులు కేటాయించిన ఘనత చంద్రబాబుదే. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో గెలిచిన ప్రజాప్రతినిధులు అప్పుల పాలవడంతో పాటు వారి చుట్టూ ఉన్న ప్రజలకు చెప్పుకోవడానికి ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేకుండా పోయాయి. దాంతో తీవ్ర నిరాశకు గురైన సర్పంచులు, ఎంపీటీసీలు తమ గ్రామాలను అభివృద్ది చేసుకోవడానికి అధికార పార్టీ పక్షాన చేరుతున్నారు. టీడీపీతో జత కలిసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునేందుకు వైసీపీలో ఉన్న ఎంపీటీసీలు టీడీపీలో చేరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ సహకారంతో వారు తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి సిద్దపడుతున్నారు.