Share News

నిండా నిర్లక్ష్యం!

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:07 AM

వర్షాభావం, అకాల వర్షాలతో పంటనష్టపోయిన రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. పంటనష్టం జరిగిన సమయంలో కనీసం పొలాలకు వెళ్లి పరిశీలించాలన్న ఆలోచన చేయలేదు. ఐదేళ్లలో రైతులకు భరోసానిచ్చిన దాఖలాలే లేవు. నష్టం జరిగిన ప్రతిసారీ అరకొరగా పరిహారం అందించి చేతులు దులుపుకున్నారు. టీడీపీ హయాంలో పంటనష్టపోయిన రైతులకు ఇనపుట్‌ సబ్సిడీ అందించి ఆదుకున్నారు.

నిండా నిర్లక్ష్యం!
రాప్తాడు మండలం రామినేపల్లి, హంపాపురం వద్ద ఎండిన వేరుశనగ(ఫైల్‌

రైతుల గోడు పట్టని వైసీపీ ప్రభుత్వం

పంట నష్టపోతే పరామర్శ కూడా కరువే

టీడీపీ హయాంలో కొండంత అండగా చంద్రబాబు

నాటి పాలనలో రైతులకు రూ.1,628 కోట్ల ఇనపుట్‌ సబ్సిడీ

వైసీపీ ఐదేళ్లలో అందించిన పరిహారం రూ.233.74 కోట్లు

సీఎం బటన నొక్కినా.. నేటికీ అందని ఖరీఫ్‌ పరిహారం

వైసీపీ అధికారం చేపట్టాక రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. సబ్సిడీ పథకాలను దూరం చేశారు. తీవ్రంగా నష్టపోయిన సందర్భాలలో చేయూత నివ్వలేదు. తీవ్ర వర్షాభావం, అకాల వర్షాలు రైతుల జీవితాలను అతలాకుతలం చేసినా.. ప్రభుత్వం బాధితులకు భరోసా కల్పించలేదు. అరకొర పెట్టుబడి సాయం మినహా.. తమకు ఒరిగింది లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన సందర్భాలలో టీడీపీ ప్రభుత్వం తమను ఆదుకుని అండగా నిలిచిందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక తమ కష్టాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నదాతలు మండిపడుతున్నారు.

అనంతపురం అర్బన, ఏప్రిల్‌ 6: వర్షాభావం, అకాల వర్షాలతో పంటనష్టపోయిన రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. పంటనష్టం జరిగిన సమయంలో కనీసం పొలాలకు వెళ్లి పరిశీలించాలన్న ఆలోచన చేయలేదు. ఐదేళ్లలో రైతులకు భరోసానిచ్చిన దాఖలాలే లేవు. నష్టం జరిగిన ప్రతిసారీ అరకొరగా పరిహారం అందించి చేతులు దులుపుకున్నారు. టీడీపీ హయాంలో పంటనష్టపోయిన రైతులకు ఇనపుట్‌ సబ్సిడీ అందించి ఆదుకున్నారు. అప్పట్లో జిల్లా రైతాంగానికి ఏకంగా రూ.1628 కోట్ల ఇనపుట్‌ సబ్సిడీ అందింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లా రైతులకు కేవలం రూ.234.74 కోట్ల ఇనపుట్‌ సబ్సిడీ మంజూరు చేశారు. పంటనష్టపోయి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమను ఆదుకోవడంలో సీఎం జగన విఫలమయ్యారని బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బటన నొక్కినా..

ఏ సీజనలో పంటనష్టం జరిగితే ఆ సీజ్‌ ముగిసిన వెంటనే ఇనపుట్‌ సబ్సిడీ అందించి ఆదుకుంటామని సీఎం జగన పలుమార్లు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఆచరణలో ఘోరంగా విఫలమయ్యారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగలోగా ఇనపుట్‌ సబ్సిడీ డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. కానీ సొమ్ము విడుదల చేయలేదు. తీరా ఎన్నికల కోడ్‌ వచ్చేముందు, మార్చి 6వ తేదీన 2023-24 ఖరీఫ్‌ సీజనలో జరిగిన పంట నష్టానికి పరిహారం ప్రకటించారు. జిల్లాలోని 28 మండలాల్లో 1.69 లక్షల మంది రైతులకు రూ.251.2 కోట్ల పరిహారాన్ని విడుదల చేస్తున్నామని ప్రకటించారు. తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన ఆ రోజు బటన నొక్కినా.. ఇప్పటి దాకా ఒక్క రైతు ఖాతాలోనూ ఇనపుట్‌ సబ్సిడీ సొమ్ము జమ కాలేదు. ఎన్నికల సమయంలో రైతులను మభ్యపెట్టేందుకే జగన బటన నొక్కారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వెంటాడిన వర్షాభావం

2023 ఖరీఫ్‌ సీజనను వర్షాభావం వెంటాడింది. వేరుశనగ, ఆముదం, పత్తి, కంది, జొన్న తదితర పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. వేరుశనగ పంట ఊడదశలో చుక్క వర్షం కురవలేదు. ఆ సమయంలో భూమిలో తగినంత తేమ ఉండాలి. అప్పుడే ఊడలు భూమిలోకి దిగి, పిందెలు ఏర్పడుతాయి. కానీ వానలేక పంట దెబ్బతింది. కొన్నిచోట్ల చెట్టుకు రెండు, మూడు కాయలు మాత్రమే కాశాయి. మరికొన్నిచోట్ల కాయల ఆనవాళ్లే లేకుండాపోయాయి. చాలా పంటలు పొలాల్లోనే ఎండిపోయాయి. ఆ పరిస్థితి చూడలేక రైతులు పంటలను దున్నేశారు. పెట్టుబడులను కోల్పోయి.. అప్పుల ఊబిలో మరింత కూరుకుపోయారు.

దెబ్బతిన్న ఉద్యాన పంటలు

2022 ఆగస్టులో అకాల వర్షాలకు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 823.46 హెక్టార్లల్లో రూ.5.95 కోట్లకుపైగా విలువైన అరటి, బీన్స, అనప, చీనీ, కర్బూజ, కళింగర, జామ, మిరప, ఉల్లి, దానిమ్మ, బొప్పాయి, టమోటా తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. డి.హిరేహాళ్‌, రాయదుర్గం, ఉరవకొండ, గార్లదిన్నె, కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, కూడేరు, పామిడి, కళ్యాణదుర్గం, ఆత్మకూరు, గుంతకల్లు మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

డబ్బులు పడలేదు..

ఖరీ్‌ఫలో 2.30 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాను. వర్షాలు పడకపోవడంతో పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం ఇనపుట్‌ సబ్సిడీ ప్రకటించడంతో అంతో ఇంతో ఆసరా అవుతుందని భావించాము. కానీ సీఎం జగన బటన నొక్కి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ నా ఖాతాలో డబ్బులు జమకాలేదు.

- మీనాక్షమ్మ, మోపిడి, ఉరవకొండ మండలం

$రైతులకు తీరని అన్యాయం

వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతులకు తీరని అన్యాయం చేశారు. పంటనష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ ఐదేళ్లలో ఇనపుట్‌ సబ్సిడీ అరకొరగా అందించి చేతులు దులుపుకున్నారు. 2023-24 ఖరీప్‌ ఇనపుట్‌ సబ్సిడీని ముందుగా ఇవ్వకుండా జాప్యం చేశారు. తీరా ఎన్నికల కోడ్‌ వచ్చే ముందు హడావుడిగా సీఎం జగన బటన నొక్కారు. ఇనపుట్‌ సబ్సిడీ విడుదల చేసినట్లు గొప్పలు పోయారు. అయినా ఇప్పటి దాకా ఏ ఒక్క రైతుకూ ఇనపుట్‌ సబ్సిడీ అందలేదు.

- విరూపాక్షి, గూళ్యపాల్యం, వజ్రకరూరు మండలం

Updated Date - Apr 07 , 2024 | 12:07 AM