పడకేసిన హంద్రీనీవా పనులు
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:48 PM
వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా అటకెక్కించింది. ఒక్క ప్రాజెక్టు గానీ, చెరువు పనులు గానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో ఎంతో అవకాశం ఉన్నా నీట వనరులను ఉపయోగించుకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది.

ఫ డిసి్ట్రబ్యూటరీల నిర్మాణం ప్రశ్నార్థకం
ఫ 3.45 లక్షల ఎకరాల
ఆయకట్టుకు సాగునీరు అందేనా..?
ఫ కలగానే మడకశిర బైపాస్ కాలువ
ఫ మూలనపడిన సామూహిక బిందు సేద్యం
ఫ కూటమి గెలుపుతో చిగురించిన ఆశలు
అనంతపురం క్లాక్‌టవర్, జూన 7: వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా అటకెక్కించింది. ఒక్క ప్రాజెక్టు గానీ, చెరువు పనులు గానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో ఎంతో అవకాశం ఉన్నా నీట వనరులను ఉపయోగించుకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. గడిచిన ఐదేళ్లుగా హంద్రీనీవాకు సంబంధించి ఏ ఒక్క పనీ ముందుకు సాగలేదు. కరువు జిల్లాలో హంద్రీనీవా ద్వారా వచ్చే కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకుని సస్యశ్యామలం చేసే అవకాశం ఉన్నప్పటికీ...ఐదేళ్లుగా నిర్వీర్యం చేశారు. హంద్రీనీవాకు శ్రీశైలం డ్యాం నుంచి 42 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సుమారు 30టీఎంసీల నీటిని వాడుకునే వెసులుబాటు ఉంది. అందుకు తగ్గట్టుగా రిజర్వాయర్లు, డిసి్ట్రబ్యూటరీ వ్యవస్థలు లేవు. దీనిపై ఇప్పటికే అనేకమార్లు హంద్రీనీవా ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపినా...వైసీపీ ప్రభుత్వం బుట్టలోకి వేస్తూ వచ్చింది. వీటితో పాటు మడకశిర బైపాస్ కెనాల్, పుట్టపర్తి నియోజవకర్గంలో 195 ఎంఐ చెరువులకు నీరు అందించే ప్రాజెక్ట్, గుంతకల్లు నియోజకవర్గంలో 12 చెరువులకు నీరిచ్చే పనులను పక్కన పడేశారు. ఉరవకొండ ప్రాంతంలో సుమారు 50వేల ఎకరాలకు సామూహిక బిందు సేద్యం ద్వారా సాగునీరు అందించేందుకు గత టీడీపీ ప్రభుత్వం 2018లో తీసుకువచ్చింది. వైసీపీ ప్రభుత్వం మూలనపడేసింది. రాప్తాడు నియోజకవర్గంలో మూడు జలాశయాలను ఇచ్చిన హామీని వైసీపీ బుట్టలో పడేసింది. హంద్రీనీవా పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తే...ఉమ్మడి జిల్లాకు 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇచ్చి సమస్యశ్యామలం చేయడంపై కొత్త ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. రూ.1200 కోట్లతో డిసి్ట్రబ్యూటరీల నిర్మాణాలకు పంపిన ప్రతిపాదనలు అలాగే ఉండిపోయాయి.
మూలనపడిన
సామూహిక బిందు సేద్యం
హంద్రీనీవా ద్వారా సాగునీరు అందని పొలాలకు నీటి సదుపాయం కల్పించడానికి గతంలో టీడీపీ ప్రభుత్వం సామూహిక బిందు సేద్యం (సీఎల్‌డీఐ) పథకాన్ని తీసుకు వచ్చింది. రూ.840 కోట్లతో 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం సీఎల్‌డీఐ పథకాన్ని రద్దు చేసింది. తక్కువ నీటితో అధిక పంటల దిగుబడి సాధించే విధంగా రైతులను ప్రోత్సాహించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన సంరక్షణయోజనా పథకం కింద సుమారు రూ.271కోట్లు నిధులు చెల్లిస్తామని అప్పట్లో చెప్పారు. బెళుగుప్ప, కూడేరు, ఉరవకొండ మండలాల్లో సుమారు 50వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎల్‌డీఐ తీసుకువచ్చారు. వైసీపీ ప్రభుత్వం 2019లో పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఇందుకు సంబంధించి పరికరాలను మూలన పడేశారు.