Share News

దోపిడీ తోపులు

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:05 AM

సీఎం జగన రాష్టానికి సైకో అని, రాప్తాడులో కూడా పిల్ల సైకో తయారయ్యాడని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.

దోపిడీ తోపులు

రాప్తాడు, మార్చి 28: సీఎం జగన రాష్టానికి సైకో అని, రాప్తాడులో కూడా పిల్ల సైకో తయారయ్యాడని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి దోపిడీలో తోపుగా మారాడని అన్నారు. రాప్తాడులో గురువారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. తోపుదుర్తి సోదరులు కమీషన్ల పేరిట దోపిడీ చేస్తున్నారని అన్నారు. టీడీపీ హయాంలో జాకీ పరిశ్రమ తీసుకొస్తే.. తోపు రూ.15 కోట్లు కమీషన డిమాండ్‌ చేశారని, దీంతో జాకీ తెలంగాణకు తరలిపోయిందని అన్నారు. రాప్తాడులో జాకీ పరిశ్రమ ఏర్పాటై ఉంటే వందల మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు లభించేవని అన్నారు. రాప్తాడు సమీపంలోని ఆటో నగర్‌ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పాల డెయిరీ పేరుతో రూ.కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గం ఒకప్పుడు అభివృద్ధిలో ముందుండేదని, వైసీపీ అధికారంలోకి వచ్చాక అవినీతి, భూ దందాలు, ఇసుక, మట్టి మాఫియాతో కుతకుతలాడిపోతోందని అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్‌ అవతారం ఎత్తిన ఎమ్మెల్యే.. పనులు చేయకుండా రూ.కోట్లు కొల్లగొడుతున్నాడని విమర్శించారు. వైసీపీ పాలనలో టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టారని, బొక్కిన వాడిని ఎవరినీ వదిలి పెట్టనని చంద్రబాబు అన్నారు. ‘మా తమ్ముళ్లు పడిన కష్టాలకు వడ్డీతో చెల్లించే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది’ అని భరోసా ఇచ్చారు. అన్నింటిపై విచారణ జరిపించి, దోషులను శిక్షించే బాధ్యత తనదేనని అన్నారు.

శింగనమలను దోచేశారు.

బుక్కరాయసముద్రం, మార్చి 28: శింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి అవినీతికి అడ్డు అదుపు లేకుండాపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేని కాదని, వారి ఇసుక టిప్పర్‌ డ్రైవర్‌కు టిక్కెట్‌ ఇచ్చారని, అలా అయితే నియోజవర్గం అంతటా దోచుకోవచ్చని వారి అలోచన అని విమర్శించారు. బుక్కరాయసముద్రంలో గురువారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఎమ్మెల్యే, ఆమె భర్త నియోజకవర్గంలో 500 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. రెండన్నర ఎకరాల ఎస్సీల శ్మశ్మాన భూమిని కూడా కబ్జా చేశారంటే.. పరిస్థితి ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములను ఆక్రమించారని, సోలార్‌, విండ్‌ పవర్‌ కంపెనీ యాజమానులను బెదిరించి, నెలవారీ మాముళ్లు తీసుకుంటాన్నారని ఆరోపించారు. సీఎం జగన, సాంబశివారెడ్డి పథకం ప్రకారం వైసీపీ అభ్యర్థిని ఎంపిక చేశారని అన్నారు. ఆగ్రవర్ణాలవారి కాళ్ల వద్ద పడి ఉంటారని టిప్పర్‌ డ్రైవర్‌ను అభ్యర్థిగా పెట్టారని, వారి తెలివికి జోహర్లు అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో పెత్తందారీ వ్యవస్థ కొనసాగుతోందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో శింగనమలలో చరిత్ర తిరగరాస్తామని అన్నారు.

ఏం చేశావో చెప్పు జగన..

శింగనమల నియోజకవర్గానికి గడిచిన ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని సీఎం జగనను చంద్రబాబు నిలదీశారు. ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక అనేక హామీలు ఇచ్చారని,ఈ ఏ ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు. ‘శింగనమల మండలంలోని ఉల్లికల్లు గ్రామానికి అర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద రూ.162 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు, కానీ ప్రారంభించలేదు. శింగనమలలో అంబేడ్కర్‌ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. మిడ్‌ పెన్నార్‌ డ్యాంకు గేట్లు మరమ్మతులు, లీకేజీ నివారణకోసం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేశారు. కానీ పనులు చేయలేదు. కోల్డ్‌ సోరేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంత వరుకు ఏర్పాటు చేయలేదు. గార్లదిన్నె, శింగనమలలో టీడీపీ హయంలో 95 శాతం నిర్మించిన షాదీఖానాలు ఇప్పటి వరుకు పూర్తి చేయలేదు. ఇలాంటి ముఖ్యమంత్రి రాజధానిని కడతారా? ప్రజలు ఆలోచించాలి’ అని చంద్రబాబు అన్నారు.

సాగునీటితోనే అనంత అభివృద్ధి

కదిరి, మార్చి 28: సాగునీటితోనే ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధి సాధ్యమని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్య క్షుడు నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పట్టణంలో గురువారం ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. ఫూలే సర్కిల్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాకు నీరు వస్తే పంటలు పండుతాయన్నారు. నీరు వస్తే పరిశ్రమలు కూడా వస్తాయనీ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పంటలు, పరిశ్రమలతో జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. కియ లాంటి పరిశ్రమలు మరెన్నో జిల్లాకు తీసుకొస్తామన్నారు. యువతకు ఇంటి వద్దే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మండల కేంద్రాల్లో వర్కు స్టేషన్లు ఏర్పాటు చేసి, తల్లిదండ్రుల వద్దే ఉద్యోగాలు చేసుకునే సౌకర్యం కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నియోజకవర్గం పులివెందుల పక్కనే ఉన్న కదిరిని అభివృద్ధి చేయకుండా, బాబాయిని చంపడానికి ఓ గొడ్డలి తయారీకి ఉపయోగించారని ఎద్దేవా చేశారు.

Updated Date - Mar 29 , 2024 | 12:05 AM