Share News

అంతటా ఉత్కంఠ..!

ABN , Publish Date - May 15 , 2024 | 12:44 AM

‘అన్నా.. నియోజకవర్గంలో పరిస్థితి ఏంది? ఎవరు గెలుస్తారు? ఏ మండలంలో ఎవరికి మెజార్టీ వస్తుంది? పోలింగ్‌ శాతం భారీగా పెరగడం ఎవరికి మేలు చూకూరుస్తుందంటావ్‌? రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది?’ సర్వత్రా ప్రస్తుతం ఇవే చర్చలు. అంతటా ఒకటే ఉత్కంఠ.

అంతటా ఉత్కంఠ..!

పుట్టపర్తి, మే 14 (ఆంధ్రజ్యోతి): ‘అన్నా.. నియోజకవర్గంలో పరిస్థితి ఏంది? ఎవరు గెలుస్తారు? ఏ మండలంలో ఎవరికి మెజార్టీ వస్తుంది? పోలింగ్‌ శాతం భారీగా పెరగడం ఎవరికి మేలు చూకూరుస్తుందంటావ్‌? రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది?’ సర్వత్రా ప్రస్తుతం ఇవే చర్చలు. అంతటా ఒకటే ఉత్కంఠ. ఎవరు ఫోన చేసినా.. ఎక్కడు ఇద్దరు కలిసినా ఇవే చర్చోపచర్చలు వినిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సోమవారం ముగియడంతో గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపోటములపై అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. ఏ గ్రామంలో, ఏ పోలింగ్‌ బూతలో ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎక్కడ మెజార్టీ ఉంది, ఎక్కడ తక్కువగా వస్తుందన్న అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్‌ కొనసాగిన సంగతి తెలిసిందే. పోలింగ్‌ ముగియడంతో మంగళవారం ఆయా నియోజకవర్గాల్లో కూటమి, వైసీపీ అభ్యర్థులు పోలింగ్‌ బూతలవారీగా నాయకులను పిలిపించుకుని, పోలింగ్‌ సరళిని ఆరా తీశారు. జిల్లావ్యాప్తంగా 84.82శాతం పోలింగ్‌ నమోదు కాగా.. అత్యధికంగా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో 88.82 శాతం, అత్యల్పంగా హిందూపురంలో 77.81 శాతం నమోదైంది. రాప్తాడు, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో 80 శాతంపైగా పోలింగ్‌ నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్‌ సరళిపై అభ్యర్ధులు సమీక్షలు జరిపారు. పంపిణీ చేసిన నోటు, మద్యం, తాయిలాలు ఓటరుకు ఎలా చేరాయి? వారి మనోగతం ఎలా ఉంది? ఏ పార్టీకి ఓటేశారు అనే అంశాలపై సామాజిక వర్గాలుగా లెక్కలేశారు. గత ఎన్నికల కంటే భిన్నంగా ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ పరిణామం కూటమికి అనుకూలమన్న చర్చ సాగుతోంది. మహిళలు, యువత ఓటెత్తడం చర్చనీయాంశమైంది.

అన్నా.. ఎవరు గెలుస్తారు..?

ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయాలపై మంగళవారం జిల్లా అంతటా చర్చలు సాగాయి. ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ వినిపించింది. ఎన్నికల్లో అధికార పార్టీ నోటు, మద్యం వెదజల్లింది. ఒక్కో అభ్యర్థికి రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి పోలింగ్‌ రోజు వరకు ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ఇంత ఖర్చు చేసినా.. పోలింగ్‌ సరళి అధికార పార్టీ వర్గాల్లో కలవరం రేపుతోంది. భారీగా పోలింగ్‌ నమోదవడం ప్రభుత్వ వ్యతిరేకతేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ, ఉపాధి కల్పనలో ప్రభుత్వ వైఫల్యం పట్ల ఆగ్రహంగా ఉన్న యువత ఓటుకు పోటెత్తారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహిళలు భారీగా తరలిరావడం ఎవరికి లాభదాయకమన్న చర్చలు సాగుతున్నాయి. ఏదిఏమైనా ఓటరు నాడి పట్టేందుకు పోలింగ్‌ కేంద్రాల వారీగా ఆయా గ్రామాల నాయకుల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నారు. గెలుపుపై ఎవరి ధీమా వారిదే అన్నట్లు కనిపిస్తోంది.

Updated Date - May 15 , 2024 | 12:44 AM