Share News

ఉపాధి సొమ్ము స్వాహా

ABN , Publish Date - May 25 , 2024 | 12:56 AM

మండలంలో ఉపాధి పథకం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వారి సానుభూతిపరుల పాలిట కల్పతరువుగా మారింది. మేట్లు, ఫీల్ట్‌ అసిస్టెంట్లు, వైసీపీ వారు ఏకమై ఈ దోపిడీకి పాల్పడుతున్నారు.

ఉపాధి సొమ్ము స్వాహా
శింగనమల వద్ద నాసిరకంగా చేసిన ఉపాధి పనులు

శింగనమల, మే 24 : మండలంలో ఉపాధి పథకం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వారి సానుభూతిపరుల పాలిట కల్పతరువుగా మారింది. మేట్లు, ఫీల్ట్‌ అసిస్టెంట్లు, వైసీపీ వారు ఏకమై ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. ఉపాధి నిధులను దండుకోవడమే లక్ష్యంగా వారు ఈ అవినీతికి పాల్పడు తున్నారు. శింగనమలలో 56 గ్రూపులకు గాను 532 మంది కూలీలు పనులకు వెళ్తున్నట్లు మాస్టర్‌లో ఉంది. అయితే కేవలం 200 మంది కూలీలు మాత్రమే పనులకు వెళ్తుండగా.. మిగిలిన వారు వెళ్లడం లేదు. వారిలో వైసీపీ సానుభూతిపరులైన వారి జాబ్‌ కార్డు నెంబర్లు వేసి.. వారు పనులకు వెళ్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ మేట్లు తన గ్రూపులో 20 మంది పనులకు వెళ్లగా 40 నుంచి 50 పేర్లు మాస్టర్‌లో నమోదు చేసుకుంటున్నారు.


ఇందులో ఫీల్డ్‌ అసిస్టెంట్లు కూడా వైసీపీ నాయకులకు సహకరిస్తున్నారు. దీంతో వైసీపీ సానుభూతి కూలీలు పనులకు రాకున్నా.. వారు పనులకు వచ్చినట్లు నమోదు చేసుకొంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఏదో తూ..తూ.. మంత్రంగా పనులు చేసినా.. పూర్తి బిల్లులు మంజూరు చేస్తున్నారు. తమ సానుభూతిపరులు పనులకు రాకున్నా... వచ్చినట్లు నమోదు చేయాలని.. పూర్తిగా బిల్లులు చెల్లించాలని ఉపాధి సిబ్బందిపై వైసీపీ మండల నాయకుడి ఒకరు ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెల్సింది. ఏమైనా తేడాలు వస్తే తాను చూసుకుంటామని భరోసా ఇస్తుండటంతో కొందరు ఉద్యోగులు వారికి సహకరిస్తూ... అవినీతిలో వాటాలు పంచుకొంటున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఆ నాయకుడు కొత్తగా ఇంటిని నిర్మించుకోగా... రూ. లక్షల విలువలైన ఉడ్‌ వర్క్‌కు మండలంలోని ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌, ఉపాధి సిబ్బంది నిధులు అందజేసినట్లు సమాచారం


పనికి రానున్నా కూలి...

ప్రతి శనివారం ఉపాధి సిబ్బంది కూలీలు డబ్బులు అందజేస్తుంది. సోమవారం నుంచి శనివారం వరకు పనులు వచ్చిన వారితో పాటు పనులకు రాని వారికి (వైసీపీ సానుభూతిపరులు) కూలి చెల్లిస్తున్నారు. వైసీపీ సానుభూతి గ్రూపులు మేట్లు శనివారం సాయంత్రం వరకు కార్యాలయంలో ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. అంతేకాకుండా సాధారణ ఉపాధి కూలీల నుంచి కొంత మొత్తాన్ని ఉపాధి సిబ్బంది వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలా వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకొంటున్నట్లు విమర్శలున్నాయి.

Updated Date - May 25 , 2024 | 12:56 AM