దాడులు చేసిన ఏ ఒక్కరినీ వదలం
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:36 AM
బీసీలపై దాడులు చేసి.. ఇబ్బందులకు గురిచేసిన ఏ ఒక్కరినీ తాము అఽధికారంలోకి వచ్చాక వదిలిపెట్టే ప్రసక్తేలేదని మాజీ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీనేనని స్పష్టం చేశారు. రామగిరిలో ఆదివారం తెలుగుదేశం పార్టీ బీసీ విభాగంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కుంటిమద్దిరంగయ్య ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సును నిర్వహించారు.
మాజీ మంత్రి పరిటాల సునీత హెచ్చరిక
రామగిరి, జనవరి 28: బీసీలపై దాడులు చేసి.. ఇబ్బందులకు గురిచేసిన ఏ ఒక్కరినీ తాము అఽధికారంలోకి వచ్చాక వదిలిపెట్టే ప్రసక్తేలేదని మాజీ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీనేనని స్పష్టం చేశారు. రామగిరిలో ఆదివారం తెలుగుదేశం పార్టీ బీసీ విభాగంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కుంటిమద్దిరంగయ్య ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి పరిటాల సునీతకు బీసీ నాయకులు, మండల టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. బడుగు బలహీన వర్గాలు పడుతున్న అవమానాలను అడ్డుకోవడానికే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. ఈ ప్రాంతంలో పేద వర్గాలు ముఖ్యంగా బీసీలు పడుతున్న ఇబ్బందులను చూసి ఆ రోజుల్లో పరిటాల రవీంద్రను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకువచ్చారన్నారు. బీసీలకు అండగా నిలబడి వారిని ముందుండి నడిపించిన నాయకుడు పరిటాల రవి అన్నారు. ఆ తరువాత బీసీలకు ప్రాధాన్యం ఇచ్చి ఎంతో మందిని చట్టసభలకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు, నారాలోకేశకే దక్కుతుందన్నారు. ఈ ఐదేళ్లకాలంలో వైసీపీ బీసీలకు ఏమి చేసిందని ప్రశ్నించారు. కొందరు నాయకులకు మాత్రమే పదవులు ఇచ్చి... వారికి అధికారాలు లేకుండా ఓ సామాజిక వర్గం నేతలు గుప్పెట్లో పెట్టుకున్నారన్నారు. మంత్రులైనా.. ఎమ్మెల్యేలైనా... వారికి అధికారాలు లేకుండా చేశారన్నారు. బీసీలను తెరముందు ఉంచి వెనుక కథ నడిపించేదంతా జగనరెడ్డి వర్గీయులేనని ఆరోపించారు. బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పారే కానీ... వాటికి ఒక్క పైసా కూడా ఇచ్చారా? అని నిలదీశారు. రాప్తాడు నియోజకవర్గంలో బీసీలపై చాలా దాడులు చేశారని, అక్ర మ కేసులు బనాయించారని అన్నారు. పోలీసుస్టేషన, తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లితే రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు లంచాలు తీసుకుంటున్నారన్నారు. చెన్నేకొత్తపల్లి మండల సాక్షి విలేకరి మద్యం బాటిళ్లు తీసుకువస్తూ పోలీసులకు పట్టుబడ్డాడని, అయితే ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడికట్లు పూజారి ఇంటి వద్ద మద్యం బాటిళ్లు ఉంచి ఆయనపై కేసుపెట్టాలని ప్రయత్నించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అదే అధికార పార్టీకి చెందిన విలేకరి దొరికితే మీరు స్పందించరా? అంటూ నిలదీశారు. ప్రకాశరెడ్డి సోదరులు వారి స్వార్థం కోసం తగదాలను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు వస్తున్న జనాన్ని చూస్తుంటే చంద్రన్న విజయం ఖాయమైందన్నారు. ఓటరు జాబితాపై పూర్తీగా దృష్టి పెట్టి దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు, స్థానికేతరులకు ఓట్లు ఉంటే వెంటనే అఽధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్ సుధాకర్, ప్రధాన కార్యదర్శి మారుతీ ప్రసాద్, కురుబసంఘం సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు గంగులకుంట రమణ, వడ్డెర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రవి, యాదవ సంఘం నాయకుడు పరందామ యాదవ్, రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షుడు పోతలయ్య, సర్పంచలు గంగమ్మ, లలితమ్మ, మాజీ సర్పంచ శ్రీనివాసులు, మండల టీడీపీ ఉపాఽధ్యక్షుడు ఆంజనేయులు, పేపర్ శీన, మాదాపురం శంకర్, అక్కులప్ప, శ్రీరాములు నాయక్, సుబ్బరాయుడు, గుర్రం శీన, మురళి, శివ కుమార్, గంగిరెడ్డి, సుకన్య పాల్గొన్నారు.