చేతల్లేవ్.. సూచనలే..!
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:55 PM
చేయాల్సిన పనులు చేయించరు... కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు, హితవులు... రెండేళ్ల క్రితం వరదలొస్తే కొన్ని కాలనీల ప్రజలు అల్లాడిపోయారు.

అనంతపురం క్రైం, జూన 7: చేయాల్సిన పనులు చేయించరు... కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు, హితవులు... రెండేళ్ల క్రితం వరదలొస్తే కొన్ని కాలనీల ప్రజలు అల్లాడిపోయారు. కాస్త వర్షం వస్తే చాలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు మునిగిపోతాయి. తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు బాగా పనిచేయాలంటూ హితబోధ చేస్తూ నగర కమిషనర్ మేఘస్వరూప్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉన్న వారు మరో ప్రాంతానికి వెళ్లాలన్నారు. ఇక మేయర్ వసీం డిప్యూటీ మేయర్లు, కొందరు కార్పొరేటర్లు, అధికారులతో కలిసి తన ఛాంబర్‌లో సమావేశమయ్యారు. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని, కాలువల్లో పూడిక తీయాలని, చెట్లు కూలితే త్వరగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక్కడ కార్పొరేటర్లను సమావేశానికి పిలవలేదంటూ టీడీపీ కార్పొరేటర్ బాబా ఫకృద్దీన మండిపడ్డారు. కొందరికే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు.
ముందస్తు చర్యలుండవా...?
వర్షాల సీజన జూనలో మొదలవుతుందని తెలుసు. కానీ ముందస్తు చర్యలు తీసుకోలేకపోయారు. కాలువల్లో పూడికలు తీయించరు. పెద్ద కాలువలైన మరువవంక, నడిమివంకల్లో పూడికతీత పనులు చేపట్టలేదు. వరదలు వచ్చిన నడిమివంకకు ప్రహరీ నిర్మించలేకపోయారు. పారిశుఽధ్యం విభాగం అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రోడ్లలో నీరు నిలబడటానికి ప్రధాన కారణం ఇంజనీర్లు చేసిన తప్పులే. పారిశుధ్య విభాగం అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఇటు ఉన్నతా ధికారులు... అటు పాలకవర్గం ఏమీ పట్టనట్లు వ్యవహ రించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.