Share News

అసమ్మతి అనంతం

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:07 AM

వైసీపీలో అభ్యర్థులు ఖరారైనా అసమ్మతి సెగ మాత్రం తగ్గడం లేదు. అనంతపురం అర్బనలోనూ పరిస్థితి అలాగే ఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికే వైసీపీ అధిష్టానం టిక్కెట్‌ కేటాయించింది. ఆయన ప్రచారం ప్రారంభించారు. కానీ నియోజకవర్గంలో కీలక నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.

అసమ్మతి అనంతం

అర్బనలో వైసీపీ అభ్యర్థికి సెగ

ప్రచారానికి దూరంగా కీలక నాయకులు

కత్తులు నూరుతున్న కార్పొరేటర్లు, మాజీలు

అనంతపురం క్రైం, మార్చి 27: వైసీపీలో అభ్యర్థులు ఖరారైనా అసమ్మతి సెగ మాత్రం తగ్గడం లేదు. అనంతపురం అర్బనలోనూ పరిస్థితి అలాగే ఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికే వైసీపీ అధిష్టానం టిక్కెట్‌ కేటాయించింది. ఆయన ప్రచారం ప్రారంభించారు. కానీ నియోజకవర్గంలో కీలక నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే మొదలు చోటా నాయకుల వరకు ఈ జాబితాలో ఉన్నారు. వారిని కలుపుకుని పోవాలని అనంత ప్రయత్నిస్తున్నా.. సానుకూల స్పందన రావడం లేదు. ఏప్రిల్‌ 18న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన వెలువడనుంది. ఆలోగా సర్దుబాటు చేసుకోవాలని అనంత ఆరాటపడుతున్నా.. అసమ్మతి నాయకులు సహకరించే సూచనలు కనిపించడం లేదు.

దీర్ఘకాల వైరం

అనంత వెంకటరామిరెడ్డికి అర్బనలో దీర్ఘకాలంగా కొందరు నాయకులతో రాజకీయ వైరం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి కుటుంబానికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కుటుంబానికి మధ్య కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పటి నుంచే ఆధిపత్యపోరు నడుస్తోంది. అనంత ఎంపీగానూ, బీఎనఆర్‌ ఎమ్మెల్యేగానూ పోటీ చేస్తున్నా.. దూరం మాత్రం తగ్గింది లేదు. వైసీపీ ఆవిర్భావం తరువాత కూడా ఆ దూరం కొనసాగుతోంది. బీఎనఆర్‌ సోదరులకు, అనంత వెంకటరామిరెడ్డికి మధ్య పొసగడం లేదు. పార్టీ ముఖ్య నాయకులు, సీఎం జగన వచ్చిన సందర్భాలలో మాత్రమే అనంత, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఒకేచోట కనిపించారు. కొన్ని సందర్భాల్లో గురునాథరెడ్డి సోదరుడు ఎర్రిస్వామిరెడ్డి మాత్రమే వచ్చేవారు. ఒకే పార్టీలో ఉన్నా రెండు వర్గాలవారు అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.

- మైనార్టీ నాయకుడు నదీం అహ్మద్‌ వైసీసీ అధికారంలోకి రాకముందు అనంతపురం అర్బన నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. ఆ తరువాత మార్పు జరిగింది. టిక్కెట్‌ రాలేదని తేలిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉర్దూ అకాడమీ చైర్మనగా నామినేటెడ్‌ పదవి దక్కించుకున్నారు. ఎమ్మెల్యేకి ఆయన దూరంగానే ఉంటున్నారు.

- మాజీ మేయర్‌ రాగే పరశురాం గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అనంతకు సన్నిహితంగా ఉన్నారు. నగరపాలిక ఎన్నికల్లో మేయర్‌ పదవి ఆశించారు. ఆయన భార్య నాగమణి కార్పొరేటర్‌గా ఉన్నారు. మేయర్‌ పదవి దక్కకపోవడంతో రాగే పరశురాంకు, ఎమ్మెల్యే అనంతకు దూరం పెరుగుతూ వచ్చింది. చివరకు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడమే మానేశారు.

మహాలక్ష్మీ దూరంగానే..

వైసీపీ అర్బన టిక్కెట్‌ను ఆ పార్టీ నాయకుడు మహాలక్ష్మి శ్రీనివాస్‌ ఆశించారు. 2019 ఎన్నికల్లో చివరి వరకు రేసులో నిలిచారు. టిక్కెట్‌ దక్కకపోవడంతో అసంతృప్తితోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతర పరిణామాల నేపథ్యంలో తొలిసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. మేయర్‌ పదవి ఆశించారు. ఆ సమయంలో మైనార్టీలకే మేయర్‌ పీఠం అని ప్రకటించడంతో మరోసారి అసంతృప్తికి గురయ్యారు. డిప్యూటీ మేయర్‌ పదవికి నో చెప్పి, అహుడా చైర్మనగా బాధ్యతలు స్వీకరించారు. ఆ హోదాలో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. అనంత, మహాలక్ష్మి కలిసిపోయింది లేదు. వారి వర్గాల మధ్య వైరం కొనసాగుతోంది.

పాపం.. చవ్వా..

కాంగ్రెస్‌ పార్టీలో ఉండగా చవ్వా రాజశేఖర్‌రెడ్డి ఎన్నోమార్లు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించారు. ప్రతిసారీ రేసులో ఉంటూ వచ్చారు. ఆ క్రమంలోనే అనంత వెంకటరామిరెడ్డితో వైరం ఏర్పడింది. వైసీపీ ఆవిర్భావం తరువాత కూడా చవ్వాకు అవకాశం దక్కలేదు. పలుమార్లు టిక్కెట్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. కార్పొరేటర్‌గా ఎన్నికై మేయర్‌ పదవి ఆశించినా ఫలితం దక్కలేదు. ఈ ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యే టికెట్‌ అడిగినా పార్టీ అధిష్టానం కనికరించలేదు. దీంతో చవ్వా సైతం అసమ్మతి వర్గంలో భాగమయ్యారు.

చాలామందే...

అనంత వెంకటరామిరెడ్డి వైరివర్గం చాలానే ఉంది. రెండు వారాల క్రితం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, అహుడా చైర్మన మహాలక్ష్మి శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ చవ్వారాజశేఖర్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన నదీమ్‌ అహ్మద్‌, వైటీ శివారెడ్డి తదితరులు పార్టీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. తమలో ఒకరికి టిక్కెట్‌ ఇవ్వాలని అడిగారు. ఆ తరువాత కొన్ని రోజులకే ఎమ్మెల్యే అనంతకు టిక్కెట్‌ కేటాయించారు.

- అనంత వెంకటరామిరెడ్డిని వైసీపీ నాయకుడు వైటీ శివారెడ్డి మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసం ప్రయత్నాలు సాగించారు. ఫలించకపోవడంతో నగరపాలిక ఎన్నికల బరిలో తన కుమారుడు మణికంఠారెడ్డిని బరిలో దింపి.. గెలిపించుకున్నారు. వైటీ కుటుంబం అనంత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది.

మోహరించిన ద్వితీయ శ్రేణి

అర్బనలో వైసీపీ అభ్యర్థి అనంతకు ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి కాక తగులుతోంది. కొందరు కార్పొరేటర్లు, చోటామోటా నాయకులు ఆయన వైరివర్గంలో చాలామంది ఉన్నారు. కార్పొరేటర్లు మణికంఠారెడ్డి, నాగమణి, ప్రకా్‌షరెడ్డి, బాబా ఫకృద్దీన, మాజీ కౌన్సిలర్‌ జయరాం నాయుడు, ఆయన భార్య, కార్పొరేటర్‌ హరిత, రుద్రంపేట ఉప సర్పంచ నరేంద్రరెడ్డి అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. రజక ఫెడరేషన చైర్మన మీసాల రంగన్న, మాజీ కౌన్సిలర్‌ మునిశంకర్‌, వెంకట సుబ్బయ్య తదిరులు ప్రచారంలో పాల్గొనడంలేదు. కొందరు కార్పొరేటర్లు టీడీపీలోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - Mar 28 , 2024 | 01:07 AM