Share News

corruption: దోపిడీకి తెర !

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:50 PM

మండలకేంద్రంలో ప్రతి వారం నిర్వహించే గొర్రెల సంతలో అక్రమ దందాకు మార్కెట్‌యార్డు అధికారులు సోమవారం చెక్‌ పెట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చొరవతో సంతను వ్యవసాయ మార్కెట్‌యార్డులో నిర్వహించేవారు. మొదట సంతలో క్రయ, విక్రయాలు ఉచితంగా నిర్వహించుకొనేవారు. తర్వాత మార్కెట్‌యార్డు నిర్వహణ కోసం అధికారులు ఒక్కొక్క గొర్రెపై నామమాత్రపు రుసుం రూ.5 వసూలు చేసేవారు.

corruption: దోపిడీకి తెర !
A scene of a sheep market in the market yard

గొర్రెల సంతపై వైసీపీ నాయకుల అక్రమ దందాకు చెక్‌

అధికారుల చొరవతో మార్కెట్‌యార్డులో సంత నిర్వహణ

యాడికి, జూన17:మండలకేంద్రంలో ప్రతి వారం నిర్వహించే గొర్రెల సంతలో అక్రమ దందాకు మార్కెట్‌యార్డు అధికారులు సోమవారం చెక్‌ పెట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చొరవతో సంతను వ్యవసాయ మార్కెట్‌యార్డులో నిర్వహించేవారు. మొదట సంతలో క్రయ, విక్రయాలు ఉచితంగా నిర్వహించుకొనేవారు. తర్వాత మార్కెట్‌యార్డు నిర్వహణ కోసం అధికారులు ఒక్కొక్క గొర్రెపై నామమాత్రపు రుసుం రూ.5 వసూలు చేసేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు కొత్తరకం దందాకు తెరలేపారు.


గత ఎనిమిది నెలలుగా యాడికిలో గొర్రెల సంత నిర్వహణను వైసీపీ నాయకులు వారికి సంబంధించిన స్థలంలో నిర్వహించుకుంటూ అక్రమ వసూళ్లు చేసేవారు. గొర్రెల సంతలో క్రయ, విక్రయాలకు వచ్చే గొర్రెలపై ఒక్కొక్క దానికి రూ.30నుంచి రూ.50 వరకు వసూలు చేసేవారు. ప్రతి సోమవారం ఐదు వేల నుంచి ఏడు వేల దాకా గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు విక్రయాలకు వచ్చేవి. ఈ లెక్కన ప్రతి సోమవారం వైసీపీ నాయకులు రూ.2లక్షల వరకు జేబులు నింపుకొనే వారని స్థానికులు తెలిపారు. దీనిపై అప్పట్లో అభ్యంతరాలు వచ్చినా, మార్కెట్‌యార్డు అధికారులకు ఫిర్యాదు చేసినా వైసీపీ నాయకులను ఏమి చేయలేకపోయారు. ఇటీవల టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ నాయకుల స్థలంలో గొర్రెల సంత నిర్వహణ, అక్రమ వసూళ్లపై ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో సోమవారం మార్కెట్‌యార్డు సెక్రటరీ ఆనంద ఆదేశాలతో సిబ్బంది యాడికికి వచ్చి గొర్రెల సంతను వైసీపీ నాయకుల స్థలంలో నుంచి మార్కెట్‌యార్డుకు తరలించారు. సోమవారం ఉచితంగానే క్రయవిక్రయాలు జరిగాయి. దీనిపై సంతకు వచ్చిన గొర్రెల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. దోపిడీకి తెరపడిందని తెలిపారు.

Updated Date - Jun 17 , 2024 | 11:51 PM