Share News

సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీపై సందిగ్ధం

ABN , Publish Date - May 17 , 2024 | 12:03 AM

కరువు రైతులకు సకాలంలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీపై సందిగ్ధం నెలకొంది. ఎన్నికల పోలింగ్‌ ముగిసి నాలుగు రోజులు కావస్తున్నా... జిల్లాకు విత్తన కేటాయింపు... సబ్సిడీ ధరల ఖరారుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం విస్మయం కలిగిస్తోంది.

సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీపై సందిగ్ధం

అనంతపురం అర్బన, మే 16: కరువు రైతులకు సకాలంలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీపై సందిగ్ధం నెలకొంది. ఎన్నికల పోలింగ్‌ ముగిసి నాలుగు రోజులు కావస్తున్నా... జిల్లాకు విత్తన కేటాయింపు... సబ్సిడీ ధరల ఖరారుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం విస్మయం కలిగిస్తోంది. ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే జిల్లాకు కావాల్సిన విత్తన వేరుశనగ, ఇతర రకాల అంతర పంటల విత్తనాలపై జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రతిపాదనలు పంపించి రెండు మాసాలు గడుస్తున్నా.. ఇప్పటి దాకా అతీగతీ లేకుండా పోయింది. పోలింగ్‌ తర్వాత విత్తనాల కేటాయింపుతోపాటు సబ్సిడీ ధరలు ఒకే సారి ఖరారు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ ఉన్నతాఽధికారులు భావించినట్లు తెలుస్తోంది. అయితే ఖరీఫ్‌ సీజన సమీపిస్తున్నా ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా జూన నుంచి ఖరీఫ్‌ సీజన ఆరంభమవుతుంది. ఇందుకు మరో పక్షం రోజేలే సమయం ఉంది. అయితే ఇప్పటి దాకా జిల్లాకు విత్తన కేటాయింపుతోపాటు సబ్సిడీ ధరలు ఖరారు చేయకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విత్తనాల

కేటాయింపు... సబ్సిడీ ధరలపై నిర్లక్ష్యం

జిల్లాకు సబ్సిడీ విత్తనాల కేటాయింపుతో పాటు సబ్సిడీ ధరలు ఖరారు చేయడంపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ ఏడాది మార్చిలోనే ఖరీఫ్‌ సీజనలో విత్తన వేశనగతోపాటు ఇతర రకాల విత్తనాల కేటాయింపులకు సంబంధించి ప్రతిపాదనలు పంపారు. ఈ సారి జిల్లాకు వేరుశనగ 1.25 లక్షల క్వింటాళ్లు, కంది 2500 క్వింటాళ్లు, గ్రీన పచ్చి రెట్టె ఎరువులు 600, కొర్ర 100, పెసలు 100, అలసందలు 150, రాగి 50 క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి దాకా జిల్లాకు విత్తనాలు కేటాయించి, సంబంధించిన గైడ్‌లైన్సను జారీ చేయడంలో ప్రభుత్వం జాప్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది జిల్లాకు 78,245 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించారు. ఇందులో 8వేల క్వింటాళ్లు కదిరి లేపాక్షి రకం, మిగతాది కే-6 రకం విత్తన వేరుశనగను కేటాయించారు. ఈ సారి ఎప్పటిలోగా విత్తన కాయలు కేటాయిస్తారు..? ఎప్పటిలోగా ఆర్బీకేలకు విత్తన కాయలు సరఫరా చేసి రైతులకు అందిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సకాలంలో విత్తన పంపిణీ జరిగేనా..?

గతేడాది మే మొదటి వారంలోగానే విత్తన వేరుశనగతోపాటు ఇతర రకాల విత్తనాల సబ్సిడీ ధలు ఖరారు చేశారు. గత ఏడాది మే 16 నుంచి ఆర్బీకేల్లో రైతుల పేర్లు రిజిస్ర్టేషన మొదలు పెట్టారు. మే 29 నుంచి విత్తన పంపిణీ ఆరంభించారు. ఈ సారి ఇప్పటి దాకా విత్తన పంపిణీకి సంబంధించిన ఎలాంటి గైడ్‌ లైన్స జారీ కాలేదు. సబ్సిడీ విత్తన సరఫరాకు టెండర్లు ఖరారు చేయడంతో జిల్లాలోని ఎనిమిది ప్రాసెసింగ్‌ యూనిట్లల్లో ఎట్టకేలకు ప్రాసెసింగ్‌ మొదలుపెట్టారు. ఇప్పటి దాకా తొమ్మిది వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ ప్రాసెసింగ్‌ చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. విత్తన వేరుశనగను ప్రాసెసింగ్‌ను మరింత వేగవంతం చేయడంతోపాటు నాణ్యత ప్రమాణాలు పాటించేలా జిల్లా వ్యవసాయ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకపోతే ఈ సారి సకాలంలో విత్తన పంపిణీ నిర్వహించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏ మేరకు అధికారులు చొరవ చూపుతారో వేచిచూడాల్సిందే.

Updated Date - May 17 , 2024 | 12:03 AM