రా.. కదలిరాకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:13 AM
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రా కదిలిరా సభ సోమవారం పెనుకొండ సమీపంలోని కియ పరిశ్రమవద్ద ఏర్పా టు చేశారు.
హిందూపురం/పెనుకొండ రూరల్, మార్చి 3: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రా కదిలిరా సభ సోమవారం పెనుకొండ సమీపంలోని కియ పరిశ్రమవద్ద ఏర్పా టు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలు, దౌర్జన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఆయన టీడీపీ నేతలు, కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయనున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఏం చేస్తారో వివరించను న్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు నిర్వహిస్తున్న భారీ బహిరంగసభ కావడంతో ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనసమీకరణ చేస్తున్నారు. పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవితతోపాటు ఉమ్మడి జిల్లా నేతలు సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
తరలి రానున్న కార్యకర్తలు
రా.. కదిలిరా సభకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు తరలి రానున్నారు. ఇందుకు సంబంధించి నియోజకవర్గ బాధ్యులు, ముఖ్యనేతలు జనసమీకరణలో నిమగ్నమయ్యారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలతోపాటు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుని పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ఈ సభ ద్వారా శ్రీకారం చుడతామని నాయకులు పేర్కొన్నారు. వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి చంద్రబాబుకు అండగా నిలుస్తారని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన పొత్తు ఖరారై, సీట్లు ప్రకటించిన తర్వాత జిల్లాకు మొదటిసారిగా చంద్రబాబు విచ్చేయనున్నారు. దీంతో ఈసభకు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా హాజరు కానున్నారు. ఈసభ ఇరుపార్టీల కార్యకర్తల్లో జోష్ నింపుతుం దని నేతలు అభిప్రాయపడుతున్నారు.
లక్ష మందితో సభ
కియ వద్ద జరగనున్న రా కదిలిరా ముగింపు సభకు లక్షమందిని తరలించేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు నిర్వహించే ఈ కార్యక్రమం ఎన్నికల సభగా ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సభ ఏర్పాట్లను ఆదివారం ఉమ్మడిజిల్లాల పార్టీ అధ్యక్షులు బీకే పార్థసారథి, కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవిత, శింగనమల అభ్యర్థి శ్రావణి, జిల్లా పరిశీలకులు కోవెలముడి రవీంద్ర, పెనుకొండ పరిశీలకులు నరసింహారావు, టీడీపీ నాయకులు దేవళ్ల మురళి, సామకోటి ఆదినారా యణ, ఎల్.నారాయణ చౌదరి, రంగయ్య, తదితరులు పరి శీలించారు. కాగా బహిరంగ సభకు విచ్చేసే వారందరికీ సవిత ఆధ్వర్యంలో భోజన, తాగునీటి వసతి ఏర్పాటు చేసినట్లు స్థానిక నాయకులు తెలిపారు.