Share News

collector జిల్లా ఆఫీసర్లు ఎట్లయ్యారు?

ABN , Publish Date - Dec 17 , 2024 | 12:08 AM

‘మీరందరూ జిల్లా ఆఫీసర్లు. మీరు ఈ-ఫైౖల్‌ద్వారా పంపే ఫైళ్లను ఓసారి చూసుకున్నారా? దానినిండా తప్పులే. ప్రతిదానికి ఓ పద్ధతి ఉంటుంది. మీరుపంపే ఫైళ్లలో ఎక్కడా ఏపద్ధతి ఉండటం లేదు. పైగా స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌. జిల్లా ఆఫీసర్లు ఎట్లా అయ్యారు’ అని కలెక్టరు వినోద్‌కుమార్‌ సోమవారం తీవ్రంగా మండిపడ్డారు.

collector జిల్లా ఆఫీసర్లు ఎట్లయ్యారు?
బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టరు వినోద్‌కుమార్‌, జేసీ ఇతర అధికారులు

ఫైళ్ల నిండా తప్పులే

సచివాలయానికి ఆపైళ్లు పంపితే నవ్వుతారు

జిల్లా అధికారులపై మండిపడ్డ కలెక్టరు

అనంతపురం టౌన, డిసెంబరు16(ఆంధ్రజ్యోతి): ‘మీరందరూ జిల్లా ఆఫీసర్లు. మీరు ఈ-ఫైౖల్‌ద్వారా పంపే ఫైళ్లను ఓసారి చూసుకున్నారా? దానినిండా తప్పులే. ప్రతిదానికి ఓ పద్ధతి ఉంటుంది. మీరుపంపే ఫైళ్లలో ఎక్కడా ఏపద్ధతి ఉండటం లేదు. పైగా స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌. జిల్లా ఆఫీసర్లు ఎట్లా అయ్యారు’ అని కలెక్టరు వినోద్‌కుమార్‌ సోమవారం తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(గ్రీవెన్స) అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులపై ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లా అధికా రులు బాగానే పనిచేస్తున్నారని, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు మనమే ముందుంటున్నట్లు రాష్ట్ర అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి కితాబు వస్తోంద న్నారు. అయితే ఇక్కడ ఫైౖళ్లు రాయడంలో మాత్రం మీతీరు సరిగా లేదని పేర్కొన్నారు. ఆఫైళ్లను అలాగే సచివాలయానికి పంపిస్తే ఉన్నతాధికారులు నవ్వుకుంటారన్నారు. అందుకే మీరు పంపిన ఫైళ్లను నేను సరిదిద్ది పంపుతున్నా అని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫైళ్లు రాయడంపై జిల్లా అధికారులకు శిక్షణ ఇవ్వాలని జేసీ, డీఆర్‌ఓ, సీపీఓలను కలెక్టర్‌ ఆదేశించారు. ఈశిక్షణలో అందరు అధికారులు రిజిస్టర్‌ కావాలన్నారు. భూసమస్యలు అధికంగా వస్తున్నాయని, రెవెన్యూలో ఎక్కువ అర్జీలు పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు. ప్రతిశుక్రవారం దీనిపై ప్రత్యేకంగా సమావేశం పెట్టుకొని పరిశీలించాలని,ఆతర్వాత సమాచారం తనకు తెలపాలని జేసీ, డీఆర్‌ఓలను కలెక్టరు ఆదేశించారు.

స్వర్ణ అనంతకు కృషి చేయండి

స్వర్ణాంధ్ర-విజన 2047కి సంబంధించి అబివృద్ధి ప్రణాళికలను శాఖల వారీగా సిద్ధం చేయాలని అధికారులను కలెక్టరు ఆదేశించారు. ఇటీవల కలెక్టర్లతో సమీక్ష సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలులో అనంత జిల్లా ఎప్పుడూ తొలి ఆరు స్థానాల్లో ఉంటోందని సీఎం చంద్రబాబు అభినందించినట్లు వెల్లడించారు. క్రైమ్‌ రిపోర్టు, మహిళాశిశు సంక్షేమశాఖలో అంగనవాడీల నిర్వహణ విషయంలో వెనుకబడి ఉన్నట్లు వారు పేర్కొన్నట్లు వివరించారు. హార్టికల్చర్‌ హబ్‌గా జిల్లాను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, స్వర్ణ అనంత సాధనకు జిల్లా అధికారులందరూ మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టరు ఆదేశించారు. చౌక ధరల డిపోలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని సివిల్‌సప్లై, తహసీల్దార్లను కలెక్టరు ఆదేశించారు. అర్హులకు మాత్రమే పింఛన్లు అందేలా చూడాలన్నారు. ప్రతి జిల్లా అధికారి టూర్‌ డైరీలను కలెక్టరేట్‌కు పంపాలన్నారు. డీఎస్సీ నోటిఫికేషన వస్తుందని, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించారు. రెవెన్యూ సదస్సులలో ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన గ్రామాలకు తానే విజిట్‌కు వెళతానన్నారు. ప్రభుత్వ పథకాలను పెద్దఎత్తున ప్రచారం చేయాలని అదికారులకు ఆదేశించారు.

గ్రీవెన్సకు 355 ఫిర్యాదులు

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కొనసాగింది, జిల్లా నలుమూలల నుంచి 355మంది బాధితులు వివిధసమస్యలతో వచ్చి వినతులు ఇచ్చారు. కలెక్టరు వినోద్‌కుమార్‌, జేసీ శివనారాయణశర్మ, అసిస్టెంట్‌ కలెక్టరు వినూత్న, డీఆర్‌ఓ మలోల, వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ తదితరులు బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులకు తెలిపి వాటిని పరిష్కరించాలని కలెక్టరు ఆదేశించారు.

Updated Date - Dec 17 , 2024 | 12:08 AM