Share News

తారస్థాయికి వర్గవిభేదాలు

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:56 PM

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల బదిలీల ఆట ఆడిస్తోంది. గ

తారస్థాయికి వర్గవిభేదాలు

కలిసిరాని నేతలు

పెనుకొండలో ఎమ్మెల్యే వర్గం దూరం

పురంలో సొంత సామాజికవర్గం

నేతలు ఎక్కడ

నాడు సమ్మతి నేడు అసమ్మతి

బదిలీలు చేసినా ఫలితం ఏది

హిందూపురం, జనవరి 6: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల బదిలీల ఆట ఆడిస్తోంది. గత నాలుగున్నరేళ్లుగా సిట్టింగులపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలో జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి చేటు తెప్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన తీరు మార్చుకోకపోగా సిట్టింగ్‌లపై మోపడంతో సర్వేల పేరుతో సిట్టింగులను కొన్నిచోట్ల మార్చారు, మరికొన్నిచోట్ల బదిలీచేశారు. దీనికితోడు అధికార పార్టీలో అన్ని నియోజకవర్గాల్లోనూ అసమ్మతి సెగలు వర్గవిబేధాలు తారస్థాయికి చేరాయి. ఈ పరిస్థితుల్లో ఇనచార్జ్‌లను మార్చినా ఫలితం లేకుండా పోతోందని సొంత పార్టీ నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు.

పెనుకొండ లో ఎమ్మెల్యే వర్గం దూరం

పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన శంకర్‌నారాయణకు మూడేళ్లకుపైగా అసమ్మతి సెగ మొదలైంది. అధికార పార్టీకి ఓ బలమైన సామాజిక వర్గం నేతలపై శంకర్‌నారాయణ అక్రమ కేసులు పెట్టించారని ఆ సామాజిక వర్గం నాయకులు ఆయనపై, అతని సోదరులపై గుర్రుగా ఉన్నారు. ఎలాగైనా శంకర్‌నారాయణను తప్పించాలని అధిష్ఠానం వద్ద ఆయన వ్యతిరేక వర్గీయులు గత మూడు సంవత్సరాలుగా పావులు కదిపారు. దీంతో ఆయనకు మంత్రి పదవి తప్పించారు. అయినా వర్గపోరు తగ్గలేదు. దీనిపై అధిష్ఠానానికి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు పలుసార్లు ఫిర్యాదు చేశారు. ఆఖరికి శంకర్‌నారాయణను అనంతపురం ఎంపీ అభ్యర్థిగా పంపుతూ పెనుకొండకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి అయిన ఉషశ్రీ చరణ్‌ను పంపారు. రెండు రోజుల క్రితం మంత్రి భర్త శంకర్‌నారాయణవద్దకు వెళ్లగా తీవ్రంగా మందలించినట్లు సమాచారం. నేను ఆఖరి వరకు పెనుకొండ ఎమ్మెల్యే టికెట్‌కు పోరాడతానని నన్ను అడగకుండా నా వద్దకు ఎలా వచ్చారంటూ ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే ఎమ్మెల్యే వర్గీయులు శంకర్‌నారాయణ ఇక్కడే ఉండాలని నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి ఉషశ్రీ చరణ్‌ పెనుకొండకు రాగా ఎమ్మెల్యే వర్గీయులు ఎవరూ స్వాగతం పలకడానికి, కలవడానికి వెళ్లలేదని సమాచారం. మొదటిరోజు ఆమె వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులే అధికంగా పాల్గొన్నట్లు అందులో కూడా ఓ సామాజిక వర్గం నేతలే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ మొన్నటి వరకు అసమ్మతి వర్గీయులుగా ఉన్నవారు ప్రస్తుతం ఉషశ్రీకి మద్దతు పలుకుతుండగా నిన్నటి వరకు ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న వారంతా ఉషశ్రీ వ్యతిరేక వర్గంలో చేరారు.

పురంలో సొంత సామాజికవర్గం

నేతలు ఎక్కడ ?

ఇదిలా ఉంటే హిందూపురం పార్లమెంట్‌ వైసీపీ ఇనచార్జ్‌గా నియమితులైన జే.శాంత శనివారం మొదటిసారిగా హిందూపురానికి విచ్చేశారు. అయితే మూడు రోజులుగా ఆమె రాకపై తీవ్ర చర్చ జరిగింది. ఎట్టకేలకు ఆమె హిందూపురానికి రాగా కేవలం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దీపిక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు మాత్రమే ఆమెకు స్వాగతం పలికి కలిసిన వారిలో ఉన్నారు. మరో రెండు వర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అటుగా వెళ్లలేదు. అంతేకాక శాంత సొంత సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులుండగా అధిక శాతం మంది సొంత సామాజికవర్గం నేతలు ఆమెకు స్వాగతం పలకడానికి వెళ్లలేదు. ఆమెపై ఇటీవల సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టు కారణంగా మైనార్టీ నాయకులు కూడా కలవడానికి వెళ్లలేదని సమాచారం. కర్ణాటకలో బీజేపీలో ఉంటూ ఇక్కడ వైసీపీ తరుపున పోటీలో ఉండటంపై ఆ సామాజికవర్గం నేతలు ఆమె వద్దకు వెళ్లడానికి సైతం ఇష్టపడటం లేదని తెలుస్తోంది.దీంతో సమన్వయకర్త వర్గీయులు కొంతమంది మాత్రం ఆమెను స్వాగతించినట్లు తెలిసింది. మరో రెండు వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆమె రాక సందర్భంగా ఎంతమంది వచ్చారన్నదానిపై చర్చ ప్రారంభించారు. ఏది ఏమైనా ఇనచార్జ్‌లను మార్చినా ఆ పార్టీకి చేకూరే ప్రయోజనం శూన్యమని సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు.

Updated Date - Jan 06 , 2024 | 11:56 PM