Share News

డ్రైనేజీలో మగ్గుతున్న ఆ కాలనీలు కనబడలేదా..?

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:02 AM

దశాబ్దకాలానికిపైగా డ్రైనేజీలో మగ్గుతున్న 2వ డివిజనలోని కల్పనాజోష్‌, భాగ్యనగర్‌, బిందెల కాలనీలు మీకు కనబడలేదా అని జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ ఎమ్మెల్యే అనంత వెంకరామిరెడ్డి, మేయర్‌, మున్సిపల్‌ అధికారులపై ఫైర్‌ అయ్యారు.

డ్రైనేజీలో మగ్గుతున్న ఆ కాలనీలు కనబడలేదా..?
కలెక్టరేట్‌లోని కాలనీవాసులతో కలిసి మాట్లాడుతున్న జనసేన నాయకులు

ఎమ్మెల్యేపై టీసీ వరుణ్‌ ఫైర్‌

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జనవరి 31: దశాబ్దకాలానికిపైగా డ్రైనేజీలో మగ్గుతున్న 2వ డివిజనలోని కల్పనాజోష్‌, భాగ్యనగర్‌, బిందెల కాలనీలు మీకు కనబడలేదా అని జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ ఎమ్మెల్యే అనంత వెంకరామిరెడ్డి, మేయర్‌, మున్సిపల్‌ అధికారులపై ఫైర్‌ అయ్యారు. బుధవారం టీసీ వరుణ్‌ ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు కాయగూరల లక్ష్మిపతి, నాయకులు, కార్యకర్తలతో కలిసి 2వ డివిజనలోని డ్రైనేజీ సమస్యపై జిల్లా కలెక్టర్‌ను కలిశారు. సత్వరమే చర్యలు తీసుకొని కాలనీల మధ్యనున్న డ్రైనేజీని తరలించాలని వినతి పత్రం అందేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లడుతూ... పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా అనంత నగరాభివృద్ధి తయారైందన్నారు. నగరంలో రూ.800 కోట్లతో అభివృద్ధి చేశానని చెబుతున్న ఎమ్మెల్యే ఎక్కడ చేశారో చూపాలని డిమాండ్‌ చేశారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటో కల్పనాజోష్‌, భాగ్యనగర్‌, బిందెలకాలనీల్లోని డ్రైనేజీ మడుగును చూస్తుంటేనే అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. 50 డివిజన్లలో కార్పొరేటర్లను గెలిపిస్తే... వారు సమస్యల పరిష్కారంపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే, మేయర్‌, మున్సిపల్‌ కమిషనర్ల దృష్టికి సమస్యను ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని కాలనీలోని సమస్యలను పరిష్కరించాలన్నారు. నగర అధ్యక్షుడు పొదిలి బాబురావు, జిల్లా ప్రధానకార్యదర్శి కుమ్మర నాగేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు జయరాంరెడ్డి, జిల్లా కార్యదర్శులు రాపా ధనుంజయ, సంజీవరాయుడు, ఇండ్ల కిరణ్‌కుమార్‌, సిద్దూ, జయమ్మ, అవుకు విజయ్‌కుమార్‌, ముప్పూరి కృష్ణ, సదానందం, గ్రంధి దివాకర్‌, జక్కిరెడ్డి ఆదినారాయణ, మేదర వెంకటేష్‌ హుస్సేన, దరాజ్‌ బాష, లాల్‌స్వామి పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 12:02 AM