Share News

యుద్ధభూమి తాడిపత్రి

ABN , Publish Date - May 15 , 2024 | 12:39 AM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ హింస కొనసాగుతోంది. పోలింగ్‌ రోజున సోమవారం వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వీరంగం సృష్టించారు.

యుద్ధభూమి తాడిపత్రి
throwing stornes each other

టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపై దాడి

టీడీపీ శ్రేణుల ఎదురుదాడితో రణరంగం

పట్టణ సీఐకి గాయాలు..

పోలీసు వాహనాలు ధ్వంసం

జేసీ ప్రభాకర్‌.. పెద్దారెడ్డి

ఇళ్ల వద్ద మరోమారు దాడులు

గంటలు గడిచినా అదుపులోకి రాని పరిస్థితి

చేతులెత్తేసి.. చోద్యం చూసిన పోలీసులు

ఆందోళనకు దిగిన జేసీ ప్రభాకర్‌..

అడ్డుకున్న పోలీసులు

ఫిర్యాదు తీసుకోకుండా..

పట్టణ పోలీస్‌ స్టేషనకు తాళం

తాడిపత్రి టౌన, మే 14: అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ హింస కొనసాగుతోంది. పోలింగ్‌ రోజున సోమవారం వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వీరంగం సృష్టించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన అనుచరవర్గం దాడులకు పాల్పడింది. తాడిపత్రిలో ఏకంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆయన తనయులు, అనుచరులు టీడీపీ కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి, మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి వాహనాలను ధ్వంసం చేశారు. రెండో రోజు మంగళవారం మంగళవారం మధ్యాహ్నం 3గంటల నుంచి మరింత రెచ్చిపోయారు. రాత్రి 9 గంటల వరకు యథేచ్ఛగా దాడులు కొనసాగించారు. దీంతో తాడిపత్రి రణరంగంగా మారింది.


సూర్యముని ఇంటిపై దాడి..

తాడిపత్రి పట్టణంలోని గానుగవీధిలో టీడీపీ సీనియర్‌ నాయకుడు సూర్యముని ఇంటిపై వైసీపీ అల్లరి మూకలు మంగళవారం మధ్యాహ్నం రాళ్ల వర్షం కురిపించాయి. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నాయి. అక్కడ ఇరువర్గాలు పెద్దఎత్తున రాళ్లు రువ్వుకోవడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణ, డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలను చెల్లాచెదురు చేయడానికి ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. వైసీపీ వర్గీయుల రాళ్లదాడిలో పట్టణ సీఐ మురళీకృష్ణ తలకు గాయమైంది. సీఐ, ఎస్‌ఐ వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భాష్పవాయువును ప్రయోగించారు. దీంతో పరిస్థితి కొద్దిసేపు అదుపులోకి వచ్చింది. సూర్యముని ఇంటిపై దాడి గురించి తెలుసుకున్న మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పెద్దఎత్తున అనుచరులతో కలిసి ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు. ఆయన వస్తే పరిస్థితి చేయి దాటుతుందని గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. తమ పార్టీ నాయకుడిని పరామర్శించేందుకు వెళుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతిభద్రతల దృష్ట్యా వెనుదిరగాలని అడిషనల్‌ ఎస్పీ సూచించారు.


పోలీసుల అభ్యర్థనతో..

శాంతిభద్రతల దృష్టా పోలీసుల అభ్యర్థన మేరకు సూర్యముని ఇంటివద్ద నుంచి చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులతో కలిసి వెనుదిరిగారు. అక్కడి నుంచి ఆయన పట్టణ పోలీ్‌సస్టేషనలో వైసీపీ అల్లరిమూకలపై ఫిర్యాదు చేయడానికి బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు పోలీ్‌సస్టేషనకు తాళం వేశారు. గేటు తీయాలని, ఫిర్యాదు చేసి వెళతానని జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. ఎంతసేపటికి తాళాలు తీయకపోవడంతో ఆయన శాంతియుతంగా ధర్నా చేసేందుకు అనుచరవర్గంతో కలిసి గాంధీసర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడ చైర్‌ వేసుకొని కూర్చొని నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు కాకర్ల రంగనాథ్‌, జగదీశ్వరరెడ్డి అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పెద్దఎత్తున గాంధీసర్కిల్‌కు చేరుకొని ధర్నాలో పాల్గొన్నారు. అడిషనల్‌ ఎస్పీతోపాటు డీఎస్పీ గంగయ్య, సిబ్బంది గాంధీసర్కిల్‌కు చేరుకుని ధర్నా విరమించి వెళ్లిపోవాలని జేసీ ప్రభాకర్‌ రెడ్డిని హెచ్చరించారు. దీంతో శాంతియుతంగా ధర్నా చేసే హక్కు కూడా లేదా అంటూ ఆయన పోలీసులపై మండిపడ్డారు. శాంతిభద్రతలకు ఇబ్బంది కలుగుతుందని, వెంటనే ఖాళీ చేయాలని సూచించడంతో ఆయన అనుచరులతో కలిసి సీబీ రోడ్డు మీదుగా నడుచుకుంటూ ఇంటికి బయలుదేరారు. కానీ వైఎస్సార్‌ సర్కిల్‌ దాటగానే మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. కోడ్‌ అమలులో ఉందని, భారీ జనాలతో వెళ్లరాదని, వాహనంలో వెళ్లిపోవాలని అడిషనల్‌ ఎస్పీ సూచించారు. చేసేదేమిలేక ఆయన వాహనం ఎక్కి వైఎస్‌ సర్కిల్‌, గాంధీసర్కిల్‌, పుట్లూరురోడ్డు, సంజీవనగర్‌ మీదుగా తన నివాసానికి చేరుకున్నారు. పరిసర మండలాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.


టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకుల దాడి

కళ్యాణదుర్గం రూరల్‌, మే 14: మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు మంగళవారం దాడి చేశారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం టీడీపీ, వైసీపీ నాయకులు దాడులు, ప్రతి దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో గాయపడ్డ టీడీపీ కార్యకర్తలు కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతటితో ఆగని వైసీపీ రౌడీ మూకలు కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రిలో చొరబడి చికిత్స పొందుతున్న మహిళలపై దాడులకు తెగబడ్డారు. చెప్పులతో కొట్టి, తాళిబొట్లు తెంచినట్లు బాధిత మహిళలు ఆరోపించారు. దాడిలో గాయపడ్డ అనసూయమ్మను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు కార్యకర్తలు నరసింహులు, జ్యోతి, లలితమ్మ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువర్గాలు పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 15 , 2024 | 12:39 AM