Share News

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:26 PM

ఊరూవాడా అంతటా బక్రీద్‌ పండుగను సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈద్గాలు, మస్జిద్‌ల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌
కక్కలపల్లి కాలనీలో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌: ఊరూవాడా అంతటా బక్రీద్‌ పండుగను సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈద్గాలు, మస్జిద్‌ల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతపురంలోని డ్రైవర్స్‌ కాలనీలోని ఈద్గా మైదానం వద్ద జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ గౌస్‌మోద్దీన్‌, రామ్‌నగర్‌ మస్జిద్‌లో ముతవల్లిల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేయం షకిల్‌షఫి, ముస్లీంలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇందులో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌ పాల్గొన్నారు.


ఈద్గా మైదానంలో నిర్వహించిన ప్రార్థనల్లో ప్రీస్ట్‌ అబ్దుల్‌ మాజిద్‌ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. అనంతపురంలోని షాహి ఈద్గా మైదానం వద్ద మానవత రక్తదాతల సంస్థ కో-కన్వీనర్‌ సలీమ్‌ మాలిక్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 81 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడంతోపాటు శిబిరంలోనే సామూహిక ప్రార్థనలు చేశారు. ఇందులో మానవత రక్తదాతల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు తరిమెల అమరనాథరెడ్డి, టీడీపీ నాయకుడు డిస్కోబాబు, ప్రభుత్వ వైద్యకళాశాల బ్లడ్‌బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే అనంతపురంరూరల్‌, శింగనమల, నార్పల, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాల్లోనూ ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు.

Updated Date - Jun 17 , 2024 | 11:26 PM