Share News

ఇంతేనయ.. తెలుసుకోవయ!

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:23 AM

రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డికి వైసీపీ అధినాయకత్వం టిక్కెట్‌ నిరాకరించింది. ఈ విషయాన్ని కాపు మొహం మీదే ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేశారు. దీన్ని కాపు తీవ్ర అవమానంగా భావించారు. జగనను నమ్మితే గొంతు కోశారని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఎదుటే మీడియా వద్ద తీవ్ర ఆవేదన చేశారు. మంత్రి పదవి ఇస్తానని రెండుమార్లు మోసం చేసిన జగన, చివరికి టిక్కెట్‌ లేదని గొంతు కోశారని నిప్పులు చెరిగారు.

ఇంతేనయ.. తెలుసుకోవయ!

వాడుకుని వదిలేస్తున్న వైసీపీ అధినేత

అన్నా.. నీకు టిక్కెట్‌ లేదు.. పో..!

కాపు ముఖం మీదే చెప్పేసిన సజ్జల

నమ్మించి గొంతు కోస్తివే.. గుడ్‌బై జగన..!

సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద కాక పుట్టించిన కాపు

రెండు దుర్గాల్లో బరిలోకి దిగుతామని ప్రకటన

తాజా పరిణామాలతో సిట్టింగ్‌లకు గుబులు

అనంతపురం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డికి వైసీపీ అధినాయకత్వం టిక్కెట్‌ నిరాకరించింది. ఈ విషయాన్ని కాపు మొహం మీదే ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేశారు. దీన్ని కాపు తీవ్ర అవమానంగా భావించారు. జగనను నమ్మితే గొంతు కోశారని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఎదుటే మీడియా వద్ద తీవ్ర ఆవేదన చేశారు. మంత్రి పదవి ఇస్తానని రెండుమార్లు మోసం చేసిన జగన, చివరికి టిక్కెట్‌ లేదని గొంతు కోశారని నిప్పులు చెరిగారు. సీఎం జగన తమ జీవితాలను సర్వనాశనం చేశారని అన్నారు. వైఎస్సార్‌ చిత్రపటాన్ని దేవుడి గదిలో పెట్టుకుని పూజించే తమపట్ల జగన ఇలా వ్యవహరిస్తారని ఊహించలేదని కాపు అన్నారు. తమ సత్తా ఏమిటో చూపుతామని హెచ్చరించారు. వైసీపీ తనకు టికెట్‌ ఇవ్వకపోయినా ఎన్నికల బరిలో ఉంటామని, స్వతంత్రంగా గాని, అవకాశం ఇచ్చే ఇతర పార్టీల తరఫునగాని పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తాను కళ్యాణదుర్గం నుంచి, తన భార్య లేదా కుమారుడు రాయదుర్గం నుంచి పోటీ చేస్తామని కుండ బద్ధలు కొట్టారు. అధికార వైసీపీలో కాపు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రెండు నియోజకవర్గాల్లో కాపు కుటుంబం పోటీకి సిద్ధపడుతున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

ఆ ఇద్దరిలో గుబులు..

అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇనచార్జిగా వైసీపీ ప్రకటించింది. అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి ఉష శ్రీచరణ్‌ను పెనుకొండ నియోజకవర్గ ఇనచార్జిగా పంపించారు. మంత్రిని కళ్యాణదుర్గం నుంచి తప్పించడం ఆమె వర్గీయులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఎంపీ తలారి రంగయ్య, మంత్రి ఉషశ్రీచరణ్‌ వర్గాల మధ్య ఆది నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కళ్యాణదుర్గానికి చెందిన పార్టీ బోయ సామాజికవర్గ నేతల్లో ముఖ్యుడైన తిప్పేస్వామి.. రంగయ్య మద్దతుదారుగా ఉన్నారు. తిప్పేస్వామి మంత్రి వ్యతిరేకవర్గంగా కొనసాగుతున్నారు. ఈ కారణంగా ఎంపీ తలారి రంగయ్యకు సహకరించే ప్రసక్తే లేదన్న సంకేతాలను ఉష శ్రీచరణ్‌ వర్గం పంపుతోంది. అధికార పార్టీలో ఇప్పటికే ఈ తలనొప్పి ఉండగా, కాపు రామచంద్రారెడ్డి కళ్యాణదుర్గం బరిలో దిగితే రంగయ్యకు దబిడి దిబిడే అంటున్నారు. మరోవైపు రాయదుర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కాపు రామచంద్రారెడ్డి తన భార్యను బరిలోకి దించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇక్కడా అధికార పార్టీ అభ్యర్థికి కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. రెండు దుర్గాల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులకు కాపు వ్యాఖ్యలు దడ పుట్టిస్తున్నాయని ఆ పార్టీవారే అంటున్నారు.

సిట్టింగ్‌లకు టెన్షన

వైసీపీ అధినేత, సీఎం జగన తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తున్నాయి. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా, ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్‌లకు జగన షాక్‌ ఇచ్చారు. దీంతో మిగిలిన ఆరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకు కరువైంది. అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంటోందనని అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతున్నారు. టికెట్‌ ఉంటుందా..? ఊడుతుందా...? అని పార్టీ పెద్దల ద్వారా ఆరా తీస్తున్నారు. గుడ్డిలో మెల్ల అన్న చందంగా కళ్యాణదుర్గం నుంచి మంత్రి ఉష శ్రీచరణ్‌ను పెనుకొండకు పంపించారు. పార్టీ ఆదేశాల మేరకు పెనుకొండ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ఆమె ప్రకటించారు. ఆమె ప్రకటనతో పెనుకొండ నియోజకవర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే శంకర్‌నారాయణ వర్గీయుల నుంచి నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ‘శంకరన్న ముద్దు.. ఉష శ్రీచరణ్‌ వద్దు’ అని అక్కడ ప్లకార్డులు ప్రదర్శించారు. కొత్త నియోజకవర్గంలో టిక్కెట్‌ దక్కినా.. అక్కడి అసమ్మతి రాగం మంత్రికి గుబులు పుట్టిస్తోంది.

నెక్ట్స్‌ ఎవరు..?

జగన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు..? ఎవరికి షాక్‌ ఇస్తారు..? నెక్ట్స్‌ ఎవరి వంతు..? అన్న చర్చ అధికార పార్టీలో తీవ్రంగా సాగుతోంది. ఎమ్మెల్యేల్లో గుబులు, దిగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుండటంతో ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. మంత్రి ఉష శ్రీచరణ్‌కన్నా పెనుకొండలో అవకాశమిచ్చారు. కాపు రామచంద్రారెడ్డికి టిక్కెట్టే లేదని మొహం మీదే చెప్పేశారు. కాపు పరిస్థితి చూశాక అధికార పార్టీ ఎమ్మెల్యేలు షాక్‌లోకి వెళ్లారు. అనంతపురం అర్బన, ఉరవకొండ, గుంతకల్లు, శింగనమల, రాప్తాడు, తాడిపత్రి నియోజకవర్గాల సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో కొందరికి టిక్కెట్లు దక్కకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆ పార్టీ వర్గాల్లోనూ ఇదే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.

రెడ్లకు కష్టమేనా..?

బీసీలకు కంచుకోటగా ఉన్న జిల్లాలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. అధికార పార్టీ సామాజికవర్గ ఎమ్మెల్యేల్లో అలజడి మొదలైంది. ఇప్పటికే ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన శింగనమలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేకి ఈసారి అవకాశం దక్కదనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. కొత్త వ్యక్తిని బరిలోకి దింపాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలే బాహాటంగా చెప్పుకుంటున్నాయి. బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అధికార పార్టీ సామాజికవర్గ ఎమ్మెల్యేలకు టిక్కెట్‌ ఇవ్వకూడదనే ఆలోచనలో వైసీపీ అధినాయకత్వం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

కాపును నమ్మని జగన

అధికారం రాగానే అక్రమాలు.. సొంతపార్టీ వారిలోనే వ్యతిరేకత

రాయదుర్గం: ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డికి వైసీపీ అధినాయకత్వం టిక్కెట్‌ నిరాకరించడానికి ఆయన అక్రమ వ్యవహారాలే కారణమని అధికార పార్టీవారే అంటున్నారు. చాపకింద నీరులా విస్తరించిన అసమ్మతి, వర్గపోరు ఆయనను దెబ్బకొట్టాయని అంటున్నారు. 2019 ఎన్నికల్లో కాలవ శ్రీనివాసులుపై విజయం సాధించిన కాపు, జగన విధేయుడిగా ఉంటూ ప్రభుత్వ విప్‌ హోదాను పొందారు. అప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డుదారులన్నీ తొక్కారు. పార్టీ కోసం కాకుండా, స్వలాభం కోసం పనిచేశారని అపకీర్తిని మూటగట్టుకున్నారు. కాపు, ఆయన భార్య భారతి, కొడుకు ప్రవీణ్‌రెడ్డి ధనార్జనే ధ్యేంగా పనిచేశారని ఆ పార్టీ నేతలు బాహాటంగా విమర్శిస్తున్నారు. వైసీపీ అధికారంలో వచ్చిన నెలకే ఇసుక దందా మొదలు పెట్టారు. కాపు ఇసుక టిప్పర్లు పోలీసులకు అడ్డంగా దొరికిన విషయాన్ని ప్రజలు నేటికి మరవలేదు. తన టిప్పర్లను వదిలేయాలని కణేకల్లు పోలీసుస్టేషన ఎదుట ఎమ్మెల్యే హోదా మరిచి కాపు ధర్నా కూడా చేశారు. దీంతో పార్టీ పెద్దలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన విశ్వాసం కోల్పోయి..

కాపు రామచంద్రారెడ్డికి టిక్కెట్‌ రాకపోవడానికి ప్రధాన కారణం జగన విశ్వాసం కోల్పోవడమేనని స్పష్టమవుతోంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాపు దందాలతో చెలరేగిపోయారని పార్టీ పెద్దల దృష్టికి వెళ్లింది. తనవాడైనా, పరాయి వాడైనా కప్పం కట్టాల్సిందే అన్నట్లు కాపు వ్యవహరించారని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక దందా, రియల్‌ ఎస్టేట్‌, విద్యుతశాఖలో అవుట్‌ సోర్స్‌ ఉద్యోగుల నియామకం, అంగనవాడీ వర్కర్ల నియామకం, క్వారీ.. ఇలా అన్నింటిలో అందినకాడికి దోచుకొన్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో 90 శాతం కార్యకర్తలు ఆయనను వ్యతిరేకించారని సమాచారం. కాపు బరిలో ఉంటే ఓడిపోవడం తథ్యమని ఐప్యాక్‌ సర్వే తేల్చిందని, గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్న జగన.. ఆయనకు చెక్‌ పెట్టారని అంటున్నారు.

పెద్దిరెడ్డికి ఫిర్యాదులు

అవినీతిపరుడైన కాపు రామచంద్రారెడ్డి నాయకత్వంలో తాము పనిచేయలేమని జిల్లా ఇనచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుట వైసీపీ నియోజకవర్గ నాయకులు పలువురు నిరసన గళం వినిపించారు. వైసీపీ తన సొంత పార్టీ అన్నట్లు కాపు వ్యవహరిస్తున్నారని, తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. దుర్గంలో కాపు కుటుంబ పాలన సాగుతోందని, ఏ అవసరం వచ్చినా కాపును కాదని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాల్సి వస్తోందని, ఇది తమకు ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ కాపు రామచంద్రారెడ్డి పట్ల వ్యతిరేకతను పెంచి.. చివరికి టిక్కెట్‌ దక్కకుండా చేశాయి. నమ్ముకున్న పార్టీ నుంచి బయటకు వచ్చేసే పరిస్థితులను కల్పించాయి.

Updated Date - Jan 06 , 2024 | 01:23 AM