Share News

AP Water scarcity: గంగలకుంట చెరువుకు నీరేదీ...?

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:08 AM

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాప్తాడు మండలంలోని గంగలకుంట చెరువుకు ప్రతి ఏడాది నీరు సరఫరా చేస్తామని ప్రస్తుత ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక ఏడాది మాత్రమే నీరు సరఫరా చేసి తర్వాత వదిలేశారు.

AP Water scarcity: గంగలకుంట చెరువుకు నీరేదీ...?
A dried up Gangalakunta pond

ఒక ఏడాది సరఫరాతో సరిపెట్టారు

మిగతా నాలుగేళ్లు చుక్కనీరు లేదు

తుస్సుమన్న ‘తోపుదుర్తి’ ఎన్నికల హామీ

రాప్తాడు, ఏప్రిల్‌ 27: తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాప్తాడు మండలంలోని గంగలకుంట చెరువుకు ప్రతి ఏడాది నీరు సరఫరా చేస్తామని ప్రస్తుత ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక ఏడాది మాత్రమే నీరు సరఫరా చేసి తర్వాత వదిలేశారు. ప్రస్తుతం గంగలకుంట చెరువు చుక్క నీరు లేక వెలవెలబోతోంది. గత ఎన్నికల సమయంలో ఆర్భాటంగా హామీ ఇచ్చిన ప్రకా్‌షరెడ్డి అరకొరగా అమలు చేసి చేతులు దులుపుకున్నారని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. రాప్తాడు పంచాయతీ పరిధిలోని గంగలకుంట గ్రామం అనంతపురం నగరానికి కూత వేటు దూరంలో ఉంది.


ఈ గ్రామంలో ఎక్కువగా వ్యవసాయం, పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ గ్రామ చెరువుకు నీరు సరఫరా అయ్యే సౌకర్యాలు చాలా తక్కువ. 2014లో రాప్తాడు ఎమ్మెల్యేగా పరిటాల సునీత గెలుపొందారు. 2014 నుంచి 2019 వరకూ మంత్రిగా కూడా పని చేశారు. ఈ సమయంలో గంగలకుంట చెరువుకు నీరు ఎలాగైనా సరఫరా చేయాలని భావించారు. గొందిరెడ్డిపల్లి సమీపంలో వెళ్లిన పీఏబీఆర్‌ కుడి కాలువ ద్వారా గుట్టల్లో నుంచి కాలువ తవ్వి నీరు సరఫరా చేయాలని అప్పటి ఇరిగేషన అధికారులతో సర్వే చేయించారు. గుట్టల్లో నుంచి పిల్ల కాలువ తవ్వడం వలన ఆ కాలువ పూడి పోయి నీరు సరఫరాకు అంతరాయం కలుగుతుందని, ఆ మార్గంలో నీరు సరఫరా కష్టమని అధికారులు చెప్పారు. పీఏబీఆర్‌ కుడి కాలువ నీరు బొమ్మేపర్తి చెరువుకు అక్కడి నుంచి లింగనపల్లి చెరువుకు సరఫరా అవుతాయి. లింగనపల్లి నుంచి రోడ్డు పక్కన పిల్ల కాలువ తవ్వి గంగలకుంట చెరువుకు నీరు సరఫరా చేయాలనుకున్నారు.


లింగనపల్లి చెరువు నుంచి జాతీయ రహదారి వరకూ భూములన్నీ వైసీపీ మద్దతుదారులవే ఉన్నాయి. పిల్ల కాలువ తవ్వేందుకు అప్పట్లో ఆ రైతులు నిరాకరించారు. దీంతో నీటి సరఫరా చేయలేకపోయారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పిల్ల కాలువ తవ్వే భూములు వైసీపీ మద్దతుదారు రైతులవే కావడంతో ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డికి అడ్డు చెప్పలేదు. లింగనపల్లి నుంచి జాతీయరహదారి వరకూ రోడ్డు పక్కనే కాలువ తవ్వించారు. జాతీయ రహదారి నుంచి గంగలకుంట చెరువు వరకూ వంక మార్గం ఉండడంతో కాలువ తవ్వకపోయినా వంక మార్గంలో నీరు సరఫరా అవుతాయి. ఒక ఏడాది పీఏబీఆర్‌ నీటిని గంగలకుంట చెరువుకు సరఫరా చేశారు. ఆ తరువాత నాలుగేళ్లు చెరువుకు నీరు సరఫరా చేయలేదు. ప్రతి ఏడాది చెరువుకు నీరు సరఫరా చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. చెరువులో నీరు లేకపోవడంతో బోర్లలో నీరు చాలా తగ్గాయని రైతుల జీవనాధారం కష్టమవుతోందన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 12:08 AM