Share News

AP politics: గుంతకల్లులో వలసదారులదే హవా !

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:17 AM

నియోజవకర్గంలో టీడీపీలో స్థానికుల కంటే పక్క జిల్లా వారిదే హవా నడుస్తూ వస్తోంది. వలస వచ్చి గెలిచినవారిలో అత్యధికులు కర్నూలు జిల్లావారే కావడం గమనార్హం. గుంతకల్లు/గుత్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలైనవారి స్థానికతను ఒకసారి పరిశీలిస్తే విషయం విశదమౌతుంది. టీడీపీ తొలి ఎమ్మెల్యే అయిన పత్తి రాజగోపాల్‌ది కర్నూలు జిల్లా, పత్తికొండ తాలూకాలోని తుగ్గలి గ్రామం.

AP politics: గుంతకల్లులో వలసదారులదే హవా !

సత్తా చాటుతున్న పక్క జిల్లా అభ్యర్థులు

గుంతకల్లు, ఏప్రిల్‌ 27: నియోజవకర్గంలో టీడీపీలో స్థానికుల కంటే పక్క జిల్లా వారిదే హవా నడుస్తూ వస్తోంది. వలస వచ్చి గెలిచినవారిలో అత్యధికులు కర్నూలు జిల్లావారే కావడం గమనార్హం. గుంతకల్లు/గుత్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలైనవారి స్థానికతను ఒకసారి పరిశీలిస్తే విషయం విశదమౌతుంది. టీడీపీ తొలి ఎమ్మెల్యే అయిన పత్తి రాజగోపాల్‌ది కర్నూలు జిల్లా, పత్తికొండ తాలూకాలోని తుగ్గలి గ్రామం. రెండో ఎమ్మెల్యే అయిన ఎన గాదిలింగప్పది కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాలోని బెల్డోణ గ్రామం. ఈయన కుమార్తె నీలావతి కూడా గుత్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారు. మాజీ ఎమ్మెల్యే దివంగత అరికెరి జగదీశ కర్నూలు జిల్లా అరికెరకు చెందినవారు. మాజీ ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన గుప్తా కూడా కర్నూలు జిల్లా డోనకు చెందినవారు.


ప్రస్తుత ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి కూడా ఉరవకొండ నియోజకవర్గంలోని కొనకొండ్లకు చెందినవారు. ఆయన 2003లోనే గుంతకల్లుకు చేరి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. గుత్తి నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే ఎం రాజారాం కూడా కొనకొండ్లకు చెందినవారే అయినా ఆయన స్థానికుడనే చెప్పాలి. 1955లో ఉరవకొండ తాలూకా గుంతకల్లు నియోజకవర్గంలో ఉండేది. కనుక కొనకొండ్ల గ్రామం గుత్తి నియోజకవర్గంలోనే ఉండటంతో రాజారాంను స్థానికుడిగానే భావించాలి. కాగా వలస వచ్చిన వీరిలో పత్తిరాజగోపాల్‌, గాదిలింగప్ప, నీలావతి, కొట్రికే మధుసూదన తొలి ప్రయత్నంలోనే గెలుపు సాధించగా, ప్రస్తుతం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి (వైసీపీ), అరికెరి జగదీశ (కాంగ్రెస్‌) రెండో ప్రయత్నంలో గెలుపు సాధించారు. ఈ ఎన్నికల్లో బరిలో టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన గుమ్మనూరు జయరాం కూడా కర్నూలు జిల్లాకు చెందినవాడు కావడం గమనార్హం. ఇప్పటిదాకా టీడీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన కర్నూలు జిల్లా అభ్యర్థులందరూ తొలి యత్నంలోనే గెలుపు సాధించి ఉండటం విశేషం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 12:17 AM