Share News

Ap minister: ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:44 PM

నిద్ర మాని అయినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. మంత్రి హోదాలో మొదటిసారి నియోజకవర్గానికి రావడంతో నాయకులు, కార్య కర్తలు సోమవారం ఆయనకు ఘనస్వాగతం పలికారు. బైపాస్‌ సర్కిల్‌ నుంచి క్లాక్‌టవర్‌ కూడలి వరకూ అశేషజనసంద్రం మధ్య విజయోత్సవ ర్యాలీ ముందుకు కదిలింది.

Ap minister: ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా
Minister Payyavula Keshav speaking at the victory rally

ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌

ఉరవకొండ, జూన 17: నిద్ర మాని అయినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. మంత్రి హోదాలో మొదటిసారి నియోజకవర్గానికి రావడంతో నాయకులు, కార్య కర్తలు సోమవారం ఆయనకు ఘనస్వాగతం పలికారు. బైపాస్‌ సర్కిల్‌ నుంచి క్లాక్‌టవర్‌ కూడలి వరకూ అశేషజనసంద్రం మధ్య విజయోత్సవ ర్యాలీ ముందుకు కదిలింది. జాతీయ రహదారి వెంబడి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు మంత్రి కేశవ్‌కు బ్రహ్మరథం పట్టారు. అనంతరం క్లాక్‌టవర్‌ కూడలిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తన పట్ల ప్రజలు చూపిన ఆదరాభిమానాలను మరువలేనన్నారు. భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. 30ఏళ్లుగా తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము కానివ్వనన్నారు. తనకు మంత్రి పిలుపు కొత్తగా ఉందన్నారు.


మీరు ఎప్పటి లాగే కేశవన్న అని పిలవాలని ప్రజలను కోరారు. సాగు, తాగు నీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. 30ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు చూశానన్నారు. మీ అభిమానం ముందు అవన్నీ తుడుచుపెట్టుపోయాయన్నారు. అసెంబ్లీలో ఉరవకొండ అంటే గుర్తింపు వచ్చేలా నియోజకవర్గ ప్రజలు చేశారని, మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, మాజీ ఏఎంసీ చైర్మెన్లు దేవినేని పురుషోత్తం, రేగాటి నాగరాజు, మండల కన్వీనర్లు నూతేటి వెంకటేశులు, బీడీ మారయ్య, వ్యాసాపురం సర్పంచ సీతారాములు, నాయకులు భీమలింగ, ప్యారం కేశావనంద, నర్రాకేశన్న, అల్లాబకాష్‌, యర్రగుంట్ల వెంకటేశులు, రహంతుల్లా, పాల్గొన్నారు.

11గంటల పాటు సాగిన విజయోత్సవ ర్యాలీ

జిల్లా సరిహద్దు గుత్తి మండలం బాట సుంకులమ్మ వద్ద ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ 11గంటల పాటు అశేష జనసంద్రం నడుమ సాగింది.


ఉదయం 10:30కి బాట సుంకులమ్మ వద్ద ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ రాత్రి 9గంటలకు ఉరవకొండకు చేరుకుంది. గుత్తి, పామిడి, గార్లదిన్నె, అనంతపురం, కూడేరు, మీదుగా ఉరవకొండ వరకూ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. భారీ గజమాలలతో సత్కరించారు. ఉరవకొండ కవితా హోటల్‌ కూడలిలో బహిరంగసభతో ర్యాలీ ముగిసింది. అనంతరం స్వగ్రామమైన కౌకుంట్లకు మంత్రి కేశవ్‌ వెళ్లారు.

Updated Date - Jun 17 , 2024 | 11:44 PM