Share News

Ap Housing: జగనన్నా ..! ఇల్లు ఏదన్నా ?

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:19 AM

నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పేరుతో వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన గృహ నిర్మాణపథకం ఏమాత్రం ముందుకు సాగడం లేదు. పథకం ప్రారంభించి రెండేళ్లయినా ఇంత వరకు ఇళ్లు మంజూరు కాలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. సొంతిల్లు లేకపోవడంంతో నిరుపేదలు కొంత మంది పూరి గుడిసెలోను, అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు.

Ap Housing: జగనన్నా ..! ఇల్లు ఏదన్నా ?
jagananna layout

పట్టాలు ఇచ్చారు.. ఇళ్లు మరిచారు... జగనన్న కాలనీలు లేఅవుట్లకే పరిమితం

పేదలకు తప్పని సొంతింటి నిరీక్షణ

మడకశిర, ఏప్రిల్‌ 26: నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పేరుతో వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన గృహ నిర్మాణపథకం ఏమాత్రం ముందుకు సాగడం లేదు. పథకం ప్రారంభించి రెండేళ్లయినా ఇంత వరకు ఇళ్లు మంజూరు కాలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. సొంతిల్లు లేకపోవడంంతో నిరుపేదలు కొంత మంది పూరి గుడిసెలోను, అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. అహుడా పరిధిలోకి వచ్చిన ప్రాంతాల్లో మాత్రం ఇళ్లు మంజూరు చేశారు. మిగతా మండలాలకు ఇళ్లు మంజూరు కాలేదు. శ్రీ సత్యసాయి జిల్లాలో 32 మండలాల్లో 25 మండలాలను అహుడా పరిధిలోకి తెచ్చారు.


తాడిమర్రి, ముదిగుబ్బ, మడకశిర, అగళి, రొళ్ల, గుడిబండ, అమరాపురం మండలాలు అహుడా పరిధిలోకి రాకపోవడంతో ఇళ్లు మంజూరు కాలేదు. ఈ ప్రాంతాల్లో లేఅవుట్లు వేసి పట్టాలు ఇచ్చినా నేటికి ఇళ్లు మాత్రం మంజూరు చేయలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగళి మండలంలో 21 లేఅవుట్లలో 613 మందికి, అమరాపురం మండంలో 21 లేఅవుట్లలో 724 మందికి, గుడిబండలో 16 లేఅవుట్లలో 290 మందికి, మడకశిర మండంలో 23 లేఅవుట్లలో 332 మందికి, మడకశిర అర్బన ఒక లేఅవుట్‌లో 326 మందికి, రొళ్ల మండలంలో 24 లేఅవుట్లలో 261 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు.


మడకశిర అర్బనలో మాత్రమే జగనన్న కాలనీలో వేసిన లేఅవుట్లలో లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశారు. అందులో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అవి వివిధ దశలలో ఉన్నాయి.

పట్టా ఇచ్చి రెండేళ్లవుతోంది: సరస్వతి, అగళి

రెండేళ్ల కిందట పట్టా ఇచ్చారు. కానీ ఇంత వరకూ ఇల్లు మంజూరు చేయలేదు. గతంలో ఉన్న పాత ఇంటిలోనే నివాసం ఉంటున్నాం. అగళి సమీపంలో లేఅవుట్‌ వేసి 500 మందికి పట్టాలు ఇచ్చారు. అందులో ఎవరికీ ఇళ్లు మంజూరు కాలేదు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 27 , 2024 | 12:19 AM