Share News

AP Elections:‘కోట్లా’ట !

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:30 AM

ప్రస్తుత ఎన్నికల సీజనలో బెట్టింగ్‌లు మొదలయ్యాయి. ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలను మరపించే రీతిలో పందేలు జరుగుతున్నాయి. ఎన్నికలు వచ్చాయంటే అందరి చూపు తాడిపత్రి వైపు ఉంటుంది. రాష్ట్రంలో కొందరు తమ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను పట్టించుకోకుండా తాడిపత్రిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆరా తీస్తుంటారు.

AP Elections:‘కోట్లా’ట !

ఎన్నికల విజయంపై బెట్టింగుల జోరు

ఐపీఎల్‌ పందేలను మరిపిస్తున్న వైనం

తాడిపత్రి ఫలితంపై పక్క జిల్లాల నుంచి పందేలు

ఉచ్చులో సాఫ్ట్‌వేర్‌, ప్రభుత్వ ఉద్యోగులు

తాడిపత్రిటౌన, ఏప్రిల్‌ 25: ప్రస్తుత ఎన్నికల సీజనలో బెట్టింగ్‌లు మొదలయ్యాయి. ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలను మరపించే రీతిలో పందేలు జరుగుతున్నాయి. ఎన్నికలు వచ్చాయంటే అందరి చూపు తాడిపత్రి వైపు ఉంటుంది. రాష్ట్రంలో కొందరు తమ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను పట్టించుకోకుండా తాడిపత్రిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆరా తీస్తుంటారు. నియోజకవర్గానికి సమీపంలో ఉన్న కర్నూలు, కడప, నంద్యాల జిల్లావాసులు తాడిపత్రి ఫలితం గురించి రూ. కోట్లలో బెట్టింగ్‌లు కాస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికలు ఇంకా 17 రోజులు ఉండగానే నియోజకవర్గంలో బెట్టింగ్‌లు తారస్థాయికి చేరాయి.


కోట్ల రూపాయలు పెట్టి పందేలు కాస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని యాడికి, రాయలచెరువుకు చెందిన ఐదుగురు వ్యక్తులు సిండికేట్‌గా ఏర్పడి కోటి రూపాయల వరకు బెట్టింగ్‌ పెట్టినట్లు చర్చించుకుంటున్నారు. తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి 13500 ఓట్ల మెజార్టీతో గెలుపొందుతాడని కొందరు, వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి 13500 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని కొందరు రూ.30లక్షలు బెట్‌ వేసుకున్నట్లు సమాచారం. బెట్టింగ్‌ కోసం ఒక నాయకుడి వద్ద నగదు లేకపోవడంతో తన ఇంటి పత్రాలను పూచీకత్తుగా పెట్టి నట్లు చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయానికి మూలకారణమైన పెద్దవడుగూరు మండలంలో ఈ సారి ఆపార్టీ మెజార్టీ మరింత ఎక్కువగా ఉంటుందని పందేలు కాస్తున్నట్లు సమాచారం.

రెండింతలు, మూడింతలతో బెట్టింగ్‌

ఆరునూరైనా ఈసారి ఎన్నికల్లో తాడిపత్రిలో తమ జెండా ఎగురుతుందని ఎవరికి వారు ప్రధాన పార్టీల సానుభూతిపరులు బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. సాధారణంగా ఎంత మొత్తం బెట్‌ కడితే గెలిచిన వారికి అంతే మొత్తం ఇస్తుంటారు.


కానీ రెండు, మూడు రెట్లు ఎక్కువ ఇస్తామంటూ పందేలు కడుతున్నట్లు సమాచారం. దీనికి ఆశపడుతున్న కొందరు యువకులు అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. వంద నుంచి 120సీట్లు సాధించి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పలువురు లక్షకు రూ.2లక్షలు ఇస్తామని చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీ నాయకులు కలిసి మందు పార్టీలు ఏర్పాటు చేసుకొని మరీ బెట్టింగులకు దిగుతున్నారన్న చర్చ జరుగుతోంది.

మేము సైతం అంటూ ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

డబ్బుల మీద అత్యాశతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా ఈ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. వర్క్‌ఫ్రం హోం చేస్తున్న కొందరు సాఫ్ట్‌వేర్లు నేరుగా బెట్టింగ్‌కు పాల్పడితే తమ హోదాకు భంగం వాటిల్లుతుందన్న భయంతో మిత్రులు, నమ్మకస్తుల ద్వారా పందెం కాస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో పనిచేస్తున్న వారు నేరుగా ఏజెంట్లకు ఫోన్లు చేసి బెట్టింగ్‌ ఆడుతున్నారని సమాచారం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 26 , 2024 | 08:05 AM