Share News

పనులు చేసి ఏడాదైనా బిల్లులు ఏవీ?

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:53 PM

‘ఎస్సీలంటే చులకనగా చూడకండి... మేము చేసిన అభివృద్ధి పనులకు ఏడాది కావస్తున్నా నిధులు మంజూరు చేయట్లేదు. నేను మండల వైస్‌ ఎంపీపీగా ఉన్నా కనీస గౌరవం లేదు.’ అంటూ మండల వైస్‌ ఎంపీపీ అంజలీ దేవి ఎంపీపీ పురుషోత్తం రెడ్డిని సర్వసభ్య సమావేశంలో నిలదీశారు.

పనులు చేసి ఏడాదైనా బిల్లులు ఏవీ?
ఎంపీపీని ప్రశ్నిస్తున్న వైస్‌ ఎంపీపీ అంజలీదేవి

సర్వసభ్య సమావేశంలో ఎంపీపీని నిలదీసిన వైస్‌ ఎంపీపీ

చిలమత్తూరు, ఫిబ్రవరి 2: ‘ఎస్సీలంటే చులకనగా చూడకండి... మేము చేసిన అభివృద్ధి పనులకు ఏడాది కావస్తున్నా నిధులు మంజూరు చేయట్లేదు. నేను మండల వైస్‌ ఎంపీపీగా ఉన్నా కనీస గౌరవం లేదు.’ అంటూ మండల వైస్‌ ఎంపీపీ అంజలీ దేవి ఎంపీపీ పురుషోత్తం రెడ్డిని సర్వసభ్య సమావేశంలో నిలదీశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన వైస్‌ ఎంపీపీ, ఎంపీపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక దశలో కోడూరు-1 ఎంపీటీసీ, వైస్‌ ఎంపీపీగా ఉన్న అంజిలీదేవి తీవ్ర ఆగ్రహానికి గురై తమకు అందాల్సిన నిధుల గురించి ఎంపీపీని నిలదీశారు. మధురేపల్లికి రోడ్డు అధ్వానంగా ఉండటంతో ఆ గ్రామస్థులు అప్పట్లో ఆందోళన చేశారు. దీంతో సుమారు రూ.4 లక్షల నిధులతో రోడ్డు పనులు చేపట్టేందుకు సభలో తీర్మానం చేసి పనులు ప్రారం భించారు. ఆ సభకు ఎంపీపీ పురుషోత్తంరెడ్డి రాకవడంతో ఒకటో వైస్‌ ఎంపీపీ బయప్ప ఆధ్యక్షతన సభ నిర్వహించి తీర్మానం చేశారు. రోడ్డు పనులు పూర్తి అయి సంవత్సరం గడిచినా నిధులు మంజూరు చేయకపోవడంపై వైస్‌ ఎంపీపీ అంజలీదేవి ఎంపీపీని నిలదీశారు. సభ్యులపై వివక్ష తగదన్నారు. దీనికి ఎంపీపీ బదిలిస్తూ తీర్మానం చేసిన సభలో తాను లేనని, ఆ పనులకు సంబంధించి ఇప్పటివరకు తనకు సమాచారం లేదన్నారు. అయితే వైస్‌ ఎంపీపీ అంజలీదేవి మాట్లాడుతూ కావాలనే తాము చేసిన పనులకు నిధులు మంజూరు చేయట్లేదన్నారు. వైస్‌ఎంపీపీగా ఉన్నా ఒక్క పని కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నామని సభలో ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Feb 02 , 2024 | 11:54 PM