Share News

అంగనవేడి..!

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:49 AM

అంగనవాడీల సమ్మె సెగలు మరింత వేడెక్కాయి. జిల్లా వ్యాప్తంగా 40 రోజుల నుంచి అనేక రూపాల్లో నిరసన తెలుపుతున్న అంగనవాడీలు.. శనివారం దూకుడు పెంచారు. జిల్లా ఇనచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌ని ఉరవకొండలో అడ్డుకున్నారు. పోలీసుల రక్షణ కంచెను ఛేదించుకుని మంత్రి కాన్వాయ్‌ను తాకారు. అనంతపురంలో జాతీయ రహదారిపై బైఠాయించారు.

అంగనవేడి..!
ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ని ముట్ట డించిన అంగనవాడీలు

మంత్రి పెద్దిరెడ్డిని తాకిన సెగ

ఉరవకొండలో కాన్వాయ్‌ అడ్డగింత

అనంతలో జాతీయ రహదారిపై బైఠాయింపు

షోకాజ్‌ నోటీసులకు ముగిసిన గడువు

విధుల్లో చేరకుంటే ఉద్యోగాలు ఊడుతాయ్‌..!

పీడీ కార్యాలయం, సీడీపీఓల నుంచి వార్నింగ్‌ కాల్స్‌

23న సీఎం జగన పర్యటన.. అంగనవాడీలకు నోటీసులు

అనంతపురం విద్య, జనవరి 20: అంగనవాడీల సమ్మె సెగలు మరింత వేడెక్కాయి. జిల్లా వ్యాప్తంగా 40 రోజుల నుంచి అనేక రూపాల్లో నిరసన తెలుపుతున్న అంగనవాడీలు.. శనివారం దూకుడు పెంచారు. జిల్లా ఇనచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌ని ఉరవకొండలో అడ్డుకున్నారు. పోలీసుల రక్షణ కంచెను ఛేదించుకుని మంత్రి కాన్వాయ్‌ను తాకారు. అనంతపురంలో జాతీయ రహదారిపై బైఠాయించారు. మరోవైపు షోకాజ్‌ నోటీసులకు ఇచ్చిన 10 రోజుల గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయ అధికారులు, ప్రాజెక్టు సీడీపీఓల నుంచి కార్యకర్తలు, ఆయాలకు ఫోన కాల్స్‌ వెళ్లాయి. ‘విధులలో చేరకుంటే మీ ఇష్టం..’ అనే బెదిరింపులు పెరిగాయి. దీంతో కొందరు విధుల్లో చేరారు. వేలాది మంది ఇంకా సమ్మెలోనే ఉన్నారు. అధికారుల బెదిరింపులపై యూనియన నేతలు మండిపడ్డారు.

దడ పుట్టించిన అంగనవాడీలు

జిల్లా వ్యాప్తంగా మెరుపు నిరసనలతో అంగనవాడీలు దడ పుట్టించారు. ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. వందలాది మంది పోలీసులు రక్షణగా నిలబడినా.. మంత్రి వాహనాలను ముందుకు పంపలేకపోయారు. సమస్యలను పరిష్కరించేదాకా కదలనిచ్చేది లేదని అంగనవాడీలు బైఠాయించడంతో పోలీసులు వారిని లాగిపడేశారు. బలవంతంగా తోసేశారు. వాహనంలోంచి మంత్రి కాలు కిందమోపలేదు. దీంతో అంగనవాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అనంతపురం తపోవనంలో హైవేపై సీఐటీయూ నాయకులు రాస్తారోకో చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి నాగేంద్ర ఆధ్వర్యంలో నాయకులు నాగమణి, రామిరెడ్డి, ఆర్వీనాయుడు, వెంకటనారాయణ, ముత్తుజ, గోపాల్‌, అరుణ, రుక్మిణి, ఏఐటీయూసీ నాయకులు రాజేష్‌ గౌడ్‌, కృష్ణుడు తదితరులు బెంగళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకోతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. కిలోమీటరు మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో పోలీసులు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో వాగ్వాదం, తోపులాట జరిగింది.

ముఖ్యమంత్రిని అడ్డగిస్తాం: నాగేంద్ర

అంగనవాడీల సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే సీఎం జగన జిల్లా పర్యటనను అడ్డుకుంటామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర హెచ్చరించారు. ఈ నెల 23న జిల్లాలో సీఎంను అడ్డగిస్తామని ఆయన అన్నారు. అంగనవాడీలు 40 రోజులుగా సమ్మె చేస్తున్నా స్పందించడం లేదని మండిపడ్డారు. ఆరుసార్లు చర్చలు జరిపిన మంత్రులు.. జీతాలు పెంచమని ఒకసారి, జూలైలో పెంచుతామని మరోసారి అంటున్నారని విమర్శించారు. జీతాలు ఎంతపెంచుతారో స్పష్టం చేయాలని, లేకుంటే సమ్మె విరమించబోమని అన్నారు.

ఉరవకొండకు వెళ్లొద్దు..

సీఎం జగన పర్యటనను అడ్డుకుంటామని అంగనవాడీలు ప్రకటించడంతో పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. సీఎం పర్యటన ముట్టడికి అనుమతి లేదని, అక్కడికి వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ.. పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు.

ఈ ప్రభుత్వం కూలిపోతుంది: కేశవ్‌

ఉరవకొండ: రాబోవు 80 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఉరవకొండలో పోలీసులు తోసెయ్యడంతో గాయపడిన అంగనవాడీ కార్యకర్తలను దీక్ష శిబిరంలో ఆయన పరామర్శించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులకు గోడు వినిపించే హక్కు కూడా అంగనవాడీలకు లేదా అని ప్రశ్నించారు. పోలీసుల తీరు దుర్మార్గమని అన్నారు. పోలీసులతో పాటు బయటి వ్యక్తులు కూడా అంగనవాడీ కార్యకర్తలను నెట్టేశారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎవరి చేతిలో ఉన్నాయో అర్థం కావడం లేదని అన్నారు. అంగనవాడీల సమస్యలను వినకుండా మంత్రి వెళ్లిపోవడం దారుణమని అన్నారు.

హక్కుల సాధనలో తగ్గొద్దు: రాంభూపాల్‌

పామిడి: ‘హక్కుల సాధనలో తగ్గొద్దు.. విధుల్లో చేరొద్దు’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ పిలుపునిచ్చారు. పామిడిలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగనవాడీల దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పంతానికిపోయి అంగనవాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టించిందని, వాటిని నిర్వహించే సామర్థ్యం లేనప్పుడు తాళాలను ఎందుకు పగులగొట్టారని ప్రశ్నించారు. అంగనవాడీ కేంద్రాల నిర్వహణ సచివాలయ సిబ్బందికి తలకు మించిన భారంగా మారిందని అన్నారు. రాష్ట్రంలో చిట్ట చివరి ఉద్యోగికి రూ.24,750 నెల జీతం వస్తుందని, అంగనవాడీలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేల జీతం పెంచడంమీద ఉన్న శ్రద్ధ అంగనవాడీల జీతాలు పెంచడంపై ఎందుకు లేదని నిలదీశారు. ఎస్మా ప్రయోగించినా 5 శాతం అంగనవాడీలు కూడా విధుల్లో చేరలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అంగనవాడీల సమ్మెపై హర్షం వ్యక్తంచేస్తున్నారని, అంగనవాడీలను తొలగించే ధైర్యం ప్రభుత్వానికి లేదని అన్నారు. అనంతరం అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకూ ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్‌ నాయకుడు అనిమిరెడ్డి, మండల కార్యదర్శి మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫోన్లలో బెదిరింపులు

అంగనవాడీ వర్కర్లు, ఆయాలకు ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయం నుంచి, 11 ప్రాజెక్టుల సీడీపీఓల నుంచి ఫోనకాల్స్‌ వెళుతున్నాయి. డిసెంబరు 12 నుంచి అంగనవాడీలు సమ్మెలోకి వెళ్లారు. అప్పటి నుంచి జనవరి 9వ తేదీ వరకూ విధులకు ఎందుకు హాజరు కాలేదో చెప్పాని ఈ నెల 10, 11 తేదీల్లో అంగనవాడీలకు నోటీసులు ఇచ్చారు. ఉద్యోగాల్లోంచి ఎందుకు తొలగించకూడదో పది రోజుల్లో చెప్పాలని గడువు విధించారు. ఆ గడువు శనివారం ముగియడంతో బెదిరింపులకు దిగారు. విధుల్లో చేరకుంటే ఉద్యోగాలు ఊడిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వర్కర్లు, ఆయాలు విధుల్లో చేరినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అంగనవాడీల చేరికపై సమాచారం సేకరించి, ఆర్డీఓలకు నివేదిస్తున్నారు. వేలాది మంది వర్కర్లు, ఆయాలు ఇంకా సమ్మెలోనే ఉన్నారు. మరో 48 గంటల్లో జిల్లాలో సీఎం పర్యటన ఉంది. ఆయనను అడ్డుకుంటామని అంగనవాడీలు, నాయకులు ప్రకటించారు. దీంతో హీట్‌ పెరిగింది.

Updated Date - Jan 21 , 2024 | 12:49 AM