Share News

ఎన్నెన్నో ప్రత్యేకతల అనంత

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:30 AM

అనంత ఎన్నెన్నో ప్రత్యేకతల నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలో ప్రధాని పర్యటించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, శిల్పకళా నిలయమైన లేపాక్షి దుర్గావీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు.

ఎన్నెన్నో ప్రత్యేకతల అనంత

హిందూపురం, జనవరి 16: అనంత ఎన్నెన్నో ప్రత్యేకతల నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలో ప్రధాని పర్యటించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, శిల్పకళా నిలయమైన లేపాక్షి దుర్గావీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామ సమీపాన 44వ జాతీయ రహదారి పక్కనే ఏర్పాటైన నాసిన (కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల నియంత్రణ జాతీయ అకాడమీ)ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ ప్రాంతం ఆధ్యాత్మికత, దేశ నిర్మాణం, సుపరిపాలనతో ముడిపడి ఉందన్నారు. దేశ వారసత్వ సంపదకు ప్రాతినిథ్యం వహిస్తోందన్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబా ఈ ప్రాంతంలోనే జన్మించారన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు ఈ ప్రాంతంవారేనన్నారు. ప్రఖ్యాత తోలుబొమ్మల కళాకారుడు దళవాయి చలపతిరావు ఈ ప్రాంతంవారేనన్నారు. విజయనగర రాజుల సుపరిపాలనకు ఈ ప్రాంతం వేదికైందని కొనియాడారు. ఇవన్నీ ఈ ప్రాంత స్ఫూర్తిదాయక విశేషాలన్నారు. నాసిన కూడా సుపరిపాలనకు కేంద్రబిందువు అవుతుందని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో వాణిజ్యం, పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు.

ఆలయ సందర్శన

జిల్లా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ తొలుత లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ చరిత్ర, శిల్పసంపద గురించి గైడ్‌లు, అధికారులు.. ప్రధానికి వివరించారు. దుర్గాదేవి, వీరభద్రస్వాములను ప్రధాని దర్శించుకున్నారు. స్వయంగా హారతి ఇచ్చారు. అక్కడే ధ్యానం చేసి, శ్లోకాలు పఠించారు. భక్తులతో కలిసి భజన చేశారు. తోలుబొమ్మలాటలను తిలకించారు. ఆలయ అర్చకులు, తోలుబొమ్మల కళాకారులను ప్రధాని సత్కరించారు. అక్కడి నుంచి బయల్దేరి ప్రత్యేక హెలికాప్టర్‌లో నాసినకు చేరుకున్నారు. నాసిన క్యాంప్‌సను ప్రారంభించారు. ప్రజలనుద్దేశించి మాట్లాడారు. క్యాంప్‌సలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషనను తిలకించారు. శిక్షణ పొందుతున్న ఐఆర్‌ఎస్‌ అధికారులతో ఫొటోలు దిగారు. తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. ప్రధాని పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధానిలేపాక్షి, జనవరి 16: చిత్ర, శిల్ప కళల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న లేపాక్షి దుర్గా, వీరభద్రస్వామి ఆలయాన్ని మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ సందర్శించి లేపాక్షిని సందర్శిచిన తొలి ప్రధానిగా నిలిచారు. ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 1.30గంటలకు లేపాక్షికి వచ్చిన ఆయన కాన్వాయ్‌లో నేరుగా ఆలయానికి చేరుకున్నారు. పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో దుర్గా, వీరభద్రస్వాములకు ఆయన ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం గర్భగుడిలో ఏర్పాటు చేసిన రామకీర్తనల కచేరి, తోలుబొమ్మలాటను వీక్షించి, పదినిమిషాలు ధ్యానంలో కూర్చున్నారు. అనంతరం ఆలయ అర్చకులు, కచేరి నిర్వాహకులను స్వయం గా ప్రధాని అభినందించారు. అక్కడి నుంచి నేరుగా పాలసముద్రం వద్ద ఏర్పాటు చేసిన నాసిన సభకు తరలి వెళ్లారు.

ఫ ఆలయ చరిత్రను వివరించిన అధికారులు

లేపాక్షి సందర్శనకు వచ్చిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ. అయితే ఆయనకు ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించడంలో అధికారులు విఫలమయ్యారు. వేలాడే స్థంభం, సీతాదేవి పాదం, అర్ధాంతరంగా ఆగిన కల్యాణమండపం, ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాల్సిన అధికారులు ఇవేవి చూపించలేకపోయారు. అధికారులు ఏ ఉద్దేశంతో ఆయనకు చరిత్రను వివరించలేదోనని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యునెస్కో గుర్తింపుకు చేరువలో ఉన్న లేపాక్షి విశిష్టతను ఆయనకు చూపించకపోవడంతో మండిపడుతున్నారు. లేపాక్షికి ప్రధాని రావడం ఆనందకరమని, అయితే చరిత్రను వివరించడంలో విఫలమయ్యారని వాపోతున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:30 AM