బీసీలంతా ఏకమౌదాం!
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:15 AM
బీసీలంతా ఏకమై వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అనంతపురం అర్బన పరిధిలోని ఐదో రోడ్డులో టీడీపీ బీసీ సెల్ నగర అధ్యక్షుడు సిమెంట్ పోలన్న అధ్యక్షతన జయహో బీసీ సదస్సును బుధవారం సాయంత్రం నిర్వహించారు.
అరాచక పాలనకు చరమగీతం పాడుదాం
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు
కాలవ శ్రీనివాసులు
నగరంలో జయహో బీసీ సభ
అనంతపురం అర్బన, జనవరి 17: బీసీలంతా ఏకమై వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అనంతపురం అర్బన పరిధిలోని ఐదో రోడ్డులో టీడీపీ బీసీ సెల్ నగర అధ్యక్షుడు సిమెంట్ పోలన్న అధ్యక్షతన జయహో బీసీ సదస్సును బుధవారం సాయంత్రం నిర్వహించారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని స్థానిక నాయకులు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ... సీఎం జగన బీసీలను అడుగుఅడుగునా అణచివేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో 76 మంది బీసీలను పొట్టనపెట్టుకున్నారని అన్నారు. అనేక మంది బీసీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించి, రాజకీయ ప్రాధాన్యం కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందని అన్నారు. అధికారంలో బీసీలను భాగస్వాములను చేసి, ఆ వర్గాలకు అభ్యున్నతి కోసం ఎన్టీఆర్, చంద్రబాబు పాటుపడ్డారని గుర్తు చేశారు. రాబోవు ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం బీసీలంతా నడుం బిగించి ముందుకు కదలాలని కోరారు.
టీడీపీతోనే సామాజిక న్యాయం: ప్రభాకర్ చౌదరి
సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన ఘనత టీడీపీకే దక్కుతుందని అన్నారు. టీడీపీ పాలనలో బీసీలకు రాజకీయంగా పెద్ద పీట వేశామని, ఆ వర్గాలకు అన్ని విధాలా చేయూనిచ్చామని అన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనంతపురం అర్బనను అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. ఆహ్లాద వాతావరణం కోసం పార్కులు, ఓపెన జిమ్ములు ఏర్పాటు చేశామని అన్నారు. నగరంలోని పలు చోట్ల రోడ్లు వేయించామన్నారు. సుభాష్ రోడ్డు, గుత్తి రోడ్డు నిర్మాణాల కోసం తాను కేంద్ర మంత్రులను కలిసి నిధులు మంజూరు చేయించానని అన్నారు. ఎన్నికలు రావడంతో టెండర్లు పిలవలేకపోయామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అంతా ఆయనే చేసినట్లు పదే పదే అబద్ధాలు చెప్పడం సరికాదని అన్నారు. అనంత నగర అభివృద్ధిపై ఆయనకు కొద్ది పాటి చిత్తశుద్ధి కూడా లేదని అన్నారు. అసెంబ్లీలో తాను అనేకమార్లు ప్రజల తరఫున మాట్లాడానని, అనంత వెంకటరామిరెడ్డి ఏనాడూ అసెంబ్లీలో మాట్లాడిన పాపానపోలేదని అన్నారు. టీడీపీ హయాంలో ఆరు వేలకుపైగా టిడ్కో ఇళ్ల నిర్మాణం 80 శాతానికి పైగా పూర్తి చేశామని, వైసీపీ పాలనలో మిగతా పనులు చేయకుండా శిథిలావస్థకు చేర్చారని విమర్శించారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మండిపడ్డారు. ఆరు మాసాల్లో అండర్ డ్రైనేజీ నిర్మిస్తామని హామి ఇచ్చిన అనంత వెంకటరామిరెడ్డి, ఇప్పటి దాకా ఆ ఊసే ఎత్తకపోవడం దారుణమని అన్నారు. ఇసుక అక్రమ రవాణా, గంజాయి, కల్తీ మద్యం విక్రయాలు, అన్ని రకాల ధరలు పెంచేసి ప్రజలపై భారం మోపడం తప్ప వైసీపీ చేసిందేమీ లేదని అన్నారు. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబును సీఎం చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోవు ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పి, టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తలారి ఆదినారాయణ, దేవళ్ల మురళి, దళవాయి వెంకటనారాయణ, కుంచెపు వెంకటేష్, ఆవుల కృష్ణయ్య, గంజే నాగరాజు, సాలార్ బాషా, పోతుల లక్ష్మీనరసింహులు, నారాయణస్వామి యాదవ్, సుధాకర్ యాదవ్, మారుతీకుమార్ గౌడ్, డిష్ నాగరాజు, సరిపూటి రమణ, సైఫుద్దీన, వడ్డే మూర్తి, గోపాల్ గౌడ్, కురుబ నారాయణస్వామి, సుభాష్ చంద్రబోస్, నెట్‌కాన చంద్ర, పుల్లన్న, మల్లికార్జున, బంగి నాగ, శివబాల, వడ్డే సరళ, విశాలాక్షి, సంగా తేజశ్విని, విజయశ్రీ, దళవాయి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.