Share News

స్మగ్లర్ల వేటలో వీరమరణం

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:41 PM

ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని గుట్టకిందపల్లి ప్రాంతానికి చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ గణేశ (30) వీరమరణం పొందారు.

స్మగ్లర్ల వేటలో వీరమరణం

అన్నమయ్య జిల్లాలో ధర్మవరం కానిస్టేబుల్‌ మృతి

ఎర్రచందనం కారుకు అడ్డుగా వెళ్లిన వైనం

వాహనం మీదికే వస్తున్నా.. వెనక్కి తగ్గని ధీరత్వం

ఢీకొట్టి.. మీదుగా కారును తోలిన దుండగులు..

అక్కడికక్కడే మృతి... కన్నీరుమున్నీరైన కుటుంబికులు

పీలేరు/ధర్మవరం, ఫిబ్రవరి 6: ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని గుట్టకిందపల్లి ప్రాంతానికి చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ గణేశ (30) వీరమరణం పొందారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం ఎంవీపల్లె పంచాయతీ చెరువుముందర గుండ్రేవారిపల్లె గ్రామ స మీపంలోని గొల్లపల్లె చెరువు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఎర్రచం దనం స్మగ్లింగ్‌ను అడ్డుకోబోయి వారి చేతిలో బలయ్యాడు. టాస్క్‌ఫోర్స్‌ బృందం సభ్యుడైన గణేశ.. స్మగ్లర్ల కారుకు అడ్డంగా వెళ్లారు. కుడి వైపు నుంచి న లుగురు సిబ్బంది రాగా.. ఎడమ వైపు నుంచి గణేశ ఒక్కరే కారుకు అడ్డుగా వచ్చా రు. బరితెగించిన స్మగ్లర్లు కారును ఆపినట్లే ఆపి.. వేగంగా గణేశ ఉన్న వైపు పోని చ్చారు. ఏమాత్రం భయపడకుండా గణేశ అలానే కారుకు అడ్డంగా వచ్చారు. కాని స్టేబుల్‌ను గుద్దేసి.. ఆయన మీదుగా కారు పోనిచ్చారు. దీంతో గణేశ తీవ్రంగా గాయపడ్డారు. పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు వదిలారు.

మేమంతా వచ్చాం.. లే గణేశ..

గణేశ మృతి విషయం తెలియగానే కుటుంబికులు, బంధువులు పీలేరు ఆస్పత్రికెళ్లారు. వారి ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ‘నాకేమీ కాదు, నేను బాగానే ఉన్నాను, తెల్లారగానే ఇంటికి వచ్చేస్తానని చెబితివి కదా, మేమంతా వచ్చాం, లే గణేశ’ అంటూ ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతదేహంపై పడి అతడి భార్య అనూష పెట్టిన ఆర్తనాదాలు అక్కడున్న వారందరి కళ్లల్లో నీళ్లు తెప్పించాయి. గణేశకు ఇద్దరు కుమారులు రాజ్‌కిశోర్‌ (6), వేదాన్ష (2) ఉన్నారు. నిస్తేజంగా పడుకుని ఉన్న తండ్రిని, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిని అమాయకంగా ఆ ఇద్దరు చూడడం అందరినీ కలచి వేసింది. బిల్లే శ్రీరాములు, అలివేళమ్మ దంపతులకు ఏకైక కుమారుడు గణేశ కాగా.. ముగ్గురు కుమార్తెలున్నారు. 8 ఏళ్ల క్రితం తండ్రి మృతిచెందారు. గణేశకు రామగిరి మండలం పెనుబోలు గ్రామానికి చెందిన అనూషతో వివాహమైంది. గణేశ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. బంధువులందరిలోనూ మంచి వ్యక్తిగా మెలిగేవారని స్థానికులు చెబుతున్నారు. గణేశ మృతదేహాన్ని మంగళవారం రాత్రికి స్వగ్రామానికి తేనున్నట్లు బంధువులు తెలిపారు. బుధవారం గుట్టకిందపల్లి వద్ద పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 11:41 PM