AP News: వరద నష్టం అంచనాకు 17 వేల ఎన్యుమరేషన్ బృందాలు..
ABN , Publish Date - Sep 09 , 2024 | 08:05 AM
ఎన్టీఆర్ జిల్లాలో వరదలు పోటెత్తిన విషయం తెలిసిందే. అయితే నేటి నుంచి వరద నష్టంపై అంచనా నమోదు చేయనున్నారు. 2.3 లక్షల నివాసాలలో సర్వే నిర్వహించనున్నారు. ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు తప్పనిసరి కానుంది.
అమరావతి: ఎన్టీఆర్ జిల్లాలో వరదలు పోటెత్తిన విషయం తెలిసిందే. అయితే నేటి నుంచి వరద నష్టంపై అంచనా నమోదు చేయనున్నారు. 2.3 లక్షల నివాసాలలో సర్వే నిర్వహించనున్నారు. ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు తప్పనిసరి కానుంది. వ్యాపార సంస్థల నష్టాన్ని సైతం అంచనా వేయనున్నారు. మొత్తం మూడు రోజుల్లో ఎన్యుమరేషన్ కార్యక్రమం పూర్తి కానుంది. ఎన్యుమరేషన్ సమయంలో ఇంట్లో ఎవరూ లేకుంటే తర్వాత అయినా నమోదు చేసుకునే అవకాశం ఉంది. నష్టం అంచనా వేయటానికి మొత్తం 17 వేల ఎన్యుమరేషన్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. నష్టం అంచనా నమోదుకు ప్రత్యేక యాప్‌ను అధికారులు రూపొందించారు.
కృష్ణానది, బుడమేరు వరద ఎన్‌టీఆర్ జిల్లా పరిధిలో అపార నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఎంతో మందికి నిలువ నీడ లేకుండా చేశాయి. ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం రూ.1,000 కోట్ల వరకూ ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు, సేవలు అందించే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.532.5 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇక కొన్ని శాఖలకు అయితే వర్షాలు దారుణ నష్టాన్ని మిగిల్చాయి. వ్యవసాయం, ఆర్‌అండ్‌బీ, పంచాయితీరాజ్ వంటి శాఖల్లో భారీ నష్టం సంభవించింది. పైగా రవాణా, పర్యాటక రంగాలకు విపరీతమైన నష్టం వాటిల్లింది. రూ.34.50 కోట్లు, పర్యాటక రంగానికి రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లు 950 కిలోమీటర్ల మేర ధ్వంసమయ్యాయి. ఇంకా విద్యుత్తు, రెవెన్యూ, పంచాయత్ శాఖలకు సంబంధించి ప్రాథమిక నష్ట అంచనాలు రావాల్సి ఉంది. వీఎంసీకి భారీ నష్టం సంభవించే అవకాశం ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో అంతులేని పంట నష్టం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనాలో పొందుపరిచారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి రూ.200 కోట్ల నష్టం సంభవించింది. జిల్లావ్యాప్తంగా 800 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతినగా రూ.200 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇక ప్రస్తుతం పూర్తి స్థాయిలోనష్టాన్ని అధికారులు అంచనా వేయనున్నారు. ఈ క్రమంలోనే 17 వేల ఎన్యుమరేషన్ బృందాలను ఏర్పాటు చేశారు.