Share News

కీలకం ‘ఆమె’నే..

ABN , First Publish Date - 2023-11-06T23:36:36+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల్లో మహిళాశక్తి కీలకం కానుంది. అభ్యర్థుల భవితవ్యం నారీమణుల చేతిలోనే ఉంది. గెలుపో టములు నిర్ణయించేది వీరే. రాజకీయాలను శాసించే సత్తా ఉన్నప్పటికీ మహిళలను దూరంగా ఉంచుతున్న పార్టీలు ఎన్నికల్లో మాత్రం వారి ఓట్లతో గట్టెక్కాలని భావిస్తున్నాయి.

కీలకం ‘ఆమె’నే..

మహిళా ఓటర్లే ప్రధానమంటున్న పార్టీలు

గెలుపోటములు నిర్ణయించేది నారీమణులే..

సంక్షేమ పథకాల హామీలే గట్టెక్కిస్తాయని నమ్మకం

ప్రసన్నం చేసుకొనే పనిలో అభ్యర్థులు

భూపాలపల్లిలో పురుషులకన్నా మహిళలే ఎక్కువ

భూపాలపల్లి కలెక్టరేట్‌, నవంబరు 6: అసెంబ్లీ ఎన్నికల్లో మహిళాశక్తి కీలకం కానుంది. అభ్యర్థుల భవితవ్యం నారీమణుల చేతిలోనే ఉంది. గెలుపో టములు నిర్ణయించేది వీరే. రాజకీయాలను శాసించే సత్తా ఉన్నప్పటికీ మహిళలను దూరంగా ఉంచుతున్న పార్టీలు ఎన్నికల్లో మాత్రం వారి ఓట్లతో గట్టెక్కాలని భావిస్తున్నాయి. మహిళల కోసం దాదాపు అన్ని పార్టీలూ ఆకర్షిణీయ పథకాలను ప్రకటించాయి. అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని హామీలు గుప్పిస్తున్నాయి. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నా యి. మహిళలను ప్రసన్నం చేసుకుంటే కుటుంబమంతా గంపగుత్తాగా ఓట్లు వేస్తుందని గంపెడాశలు పెట్టుకున్నాయి. మరోవైపు పురుష ఓటర్లకంటే మహిళా ఓటర్లే ఎక్కువ ఉండటం తమకు కలిసి వచ్చే అంశమని భూపాలపల్లి నియోజక వర్గంలోని ఆయా పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు.

భూపాలపల్లి నియోజకవర్గంలో పరిధి లో ఏడు మండలాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 2,68,028 మంది మొత్తం ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,33,461, మహిళలు 1,34,562 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. వీరిలో 1,526 మంది దివ్యాంగ మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో పురుషులకంటే మహిళలు 1,101 మంది ఎక్కువ ఉన్నారు. అత్యధికంగా భూపాలపల్లి మండలంలో 36,881 మంది, అత్యల్పంగా టేకుమట్ల మండలంలో 10,690 మంది ఉన్నారు.

ఆశీస్సులు ఉంటేనే..

భూపాలపల్లి నియోజకవర్గంలో మహిళా ఓటర్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. వారు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేదే ఆసక్తిగా మారింది. మహిళా సంక్షేమానిక పెద్ద పీట వేస్తామంటున్న బీఆర్‌ఎస్‌కు మరోసారి అవకాశం ఇస్తారో.. ఆరు గ్యారెంటీల్లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడతారో అనేది చర్చనీ యాంశమైంది. మరోవైపు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందిన బీజేపీకి అవకాశం ఇస్తారని ఆ పార్టీ ఆశలు పెట్టుకుం ది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకా లు కూడా తమకు ఉపకరిస్తాయని భావిస్తోంది. ఇలా మొత్తమ్మీద ప్రధాన పార్టీలన్నీ మహిళా ఓటర్లనే నమ్ముకున్నట్టు తెలుస్తోంది. వారు తీసుకొనే నిర్ణయమే ఈ ఎన్నికల్లో గెలుపోటములపై ప్రభావితం చేస్తుందని అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్ల ఆశీస్సులు తీసుకొనేందుకు ఇంటింటి ప్రచారంతో బారులు తీరుతున్నారు. ప్రధాన పార్టీల్లో నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణరావు పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా చందుపట్ల కీర్తిరెడ్డి నిల్చున్నారు.

Updated Date - 2023-11-06T23:36:41+05:30 IST