‘ధరణి’ దారికి వచ్చేనా..?
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:54 PM
‘ధరణి’ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పదిరోజుల్లో నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ధరణి వెబ్ పోర్టల్ దారికి వచ్చి భూముల సమస్యకు దారి చూపుతుందా అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
సమస్యలపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం
రెవెన్యూ కార్యాలయాల్లో పేరుకుపోయిన దరఖాస్తులు
సర్కారు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న పట్టాదారులు
దేవరుప్పుల, డిసెంబరు 18: ‘ధరణి’ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పదిరోజుల్లో నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ధరణి వెబ్ పోర్టల్ దారికి వచ్చి భూముల సమస్యకు దారి చూపుతుందా అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ధరణి వెబ్‌పోర్టల్ అమలులోకి వచ్చిన తర్వాత భూముల సమస్యలను పరిష్కరించడానికి అప్షన్లు ఇవ్వకపోవటంతో అనేక సమస్యలు పెండింగులో ఉన్నాయి. భూముల రికార్డులలో తప్పులు దొర్లాయని అనేకమంది రెవెన్యూ కార్యాలయాల్లో దరఖాస్తులు అందించారు. పట్టా భూముల సమస్యలను పరిష్కరించాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గత ప్రభుత్వం ఆర్జీదారుల విన్నపాలను పట్టించుకోకపోవటంతో జిల్లాలో వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. 2018లో డిజిటల్ పట్టా పుస్తకాలు జారీ చేయకముందు ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల్లో భూమి యజమాని వివరాలు సరిగానే ఉన్నప్పటకీ ఆన్‌లైన్ చేసిన సందర్భంలో ఒకరి భూమి మరొకరి పేరుమీదికి మారిపోయింది. ఈ తప్పిదాలను సరిదిద్దడానికి ఆప్షన్లను ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే ఒకరి సర్వేనంబర్ మరొకరి పేరుపై రావడం, మాన్యువల్ రికార్డుల్లో పట్టాభూమి అని ఉంటే ఆన్‌లైన్‌లో అసైన్‌మెంట్ అని నమోదు కావటం, యజమానులు, వారి తండ్రి, భర్త పేర్లు తప్పుగా నమోదు కావటం, భూవిస్తీర్ణంలో తేడాలు రావడం ఇలా ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ధరణి వెబ్‌పోర్టల్‌లో ఆప్షన్లు ఇవ్వకపోవటంతో భూముల సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోయాయి. కొందరు రైతులకైతే తాము సాగుచేస్తున్న భూమి తమ ఆధీనంలో ఉన్నా పట్టా మాత్రం వేరేవారి పేరుపై ఉంది. దీంతో అసలు రైతులకు రైతుబంధు, రైతుబీమా ప్రయోజనాలు దక్కడంలేదు. దశల వారీగా ఆప్షన్లను గత ప్రభుత్వం ఇస్తామని చెప్పినా ఆచరణలో అమలు చేయలేదు. తాము అధికారంలోకి వస్తే ధరణిలో సంస్కరణలు తీసుకురావటం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తామని కాంగ్రెస్‌పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంటూ వచ్చింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్దిరోజల్లోనే ధరణిపై సమీక్ష నిర్వహించడంతో తమ భూసమస్యలు పరిష్కారం అవుతాయని దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ధరణిని దారికి తీసుకువచ్చి వీలైనంత తొందరగానే భూముల సమస్యలకు పరిష్కారం చూపాలని పలువురు రైతులు కోరుతున్నారు.
ధరణిలో సవరణలు చేయాలి..
- పడమటింటి నర్సింహ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు, దేవరుప్పుల
ధరణి వెబ్‌పోర్టల్ అమలులోకి వచ్చిన తర్వాత భూముల సమస్యలను పరిష్కరించడానికి అప్షన్లు ఇవ్వకపోవటంతో అనేక సమస్యలు పెండింగులోనే ఉన్నాయి. భూముల రికార్డులలో తప్పులు దొర్లాయని అనేకమంది రెవెన్యూ కార్యాలయాల్లో దరఖాస్తులు పెట్టుకున్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ధరణిలో సవరణలు చేసి సమస్యలను పరిష్కరించాలి.
ధరణితోనే అనేక సమస్యలు..
- సింగారపు రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చింది. అయితే అందులో అనేక తప్పులు దొర్లాయి. అప్పటి ప్రభుత్వం వాటిని సరిదిద్దలేదు. దీంతో అనేకమంది మంది రైతులు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిజిటల్ పాసుపుస్తకాలు జారీ అయిన్పటినుంచి రైతుబంధు, రైతు బీమా పథకాలను చాలామంది కోల్పోయారు. రెవెన్యూ శాఖ చేసిన తప్పిదాల వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులపాలయ్యారు.