Share News

ఓటరు ఎటువైపు?

ABN , First Publish Date - 2023-12-01T23:24:18+05:30 IST

ఓటరు తీర్పు ఈవీఎంల్లో ఉండగా గెలుపోటములు అభ్యర్థు లను దోబూచు లాడుతున్నాయి. ఎవరికి వారు పైకి గెలుపుపై ధీమాతో ఉండగా, లోపల మాత్రం వదిలిన చిలుమెంత.. వచ్చే ఓట్లెన్ని అనే లెక్కల్లో అభ్యర్థులు మునిగిపోయారు.

ఓటరు ఎటువైపు?

పోలింగ్‌ సరళిపై అభ్యర్థుల పోస్టుమార్టం

మండలాల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపారోనని లెక్కలు

ఓటింగ్‌ శాతం కాస్తంత తగ్గడం ఎవరికి ప్రతికూలమో అనే చర్చ

కార్మికుల ఓట్లు బీజేపీకి క్రాస్‌ కావడంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో ఆందోళన

అభ్యర్థుల్లో పైకి గెలుపుపై ధీమా.. లోపల ఓటరు తీర్పుపై టెన్షన్‌

భూపాలపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఓటరు తీర్పు ఈవీఎంల్లో ఉండగా గెలుపోటములు అభ్యర్థు లను దోబూచు లాడుతున్నాయి. ఎవరికి వారు పైకి గెలుపుపై ధీమాతో ఉండగా, లోపల మాత్రం వదిలిన చిలుమెంత.. వచ్చే ఓట్లెన్ని అనే లెక్కల్లో అభ్యర్థులు మునిగిపోయారు. ఏ మండలంలో ఎంత శాతం పో లింగ్‌ జరిగింది.. ఏ వర్గం నుంచి ఎవరికి మద్దతు ఇచ్చింది.. భారీగా జరిగిన క్రాస్‌ ఓటింగ్‌ ఎవరికి నష్టం.. మరెవరికి లాభం అనే కోణంలో అభ్యర్థులు పోలింగ్‌ సరళిపై పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈసారి బీజేపీ కొంత ఓటు శాతాన్ని పెంచుకునే అవ కాశం ఉండటంతో పాటు సింగరేణి కార్మికుల నుంచి కాస్తంత బీజేపీకి ఓట్లు క్రాస్‌ కావడం కూడా బీఆర్‌ ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులను కలవరానికి గురి చేస్తోంది.

భారీగా పోలింగ్‌ నమోదు..

భూపాలపల్లి నియోజకవర్గంపై అన్ని ప్రధాన పార్టీ లు దృష్టి సారించాయి. తొలుత ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గాలి బలంగా వీచినప్పటికి క్రమక్రమంగా బీఆర్‌ఎస్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది. మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతం కావడంతో పోలింగ్‌ కూడా ఓ గంట ముందుగా సాయంత్రం 4 గంటలకే ముగించారు. సాయంత్రం 5గంటల వరకు కేవలం 76.10 శాతం పోలింగ్‌ నమోదైంది. బూత్‌ల్లో భారీగా ఓటర్లు ఉండ టంతో రాత్రి 9గం టల వరకు పోలింగ్‌ నిర్వహించారు. దీంతో పోలింగ్‌ పూర్తిగా ముగిసే సరికి 82.02 శాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లండిచారు. కాగా, 2014లో భూపాలపల్లి నియోజకవ ర్గంలో 79.8 శాతం నమో దు కాగా, 2018లో 82.16 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రస్తుతం 82.02 శాతం పోలింగ్‌ నమోదు అయింది. మొత్తం 2,73,633 మంది ఓటర్లు ఉండగా 2,24,432 మంది ఓటు హక్కును వినియోగించుకు న్నారు. వీరిలో అత్యధికంగా మహిళలు 1,12,690 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, పురుషులు 1,11,739 మంది మాత్రమే ఓటేశారు. మరో ముగ్గురు ఇతరులు కూడా ఓటేశారు. ఈసారి మహిళలు అత్యధికంగా ఓటేయడంతో ఎవరికి లాభమో అనే కోణంలో చర్చ జరుగుతోంది.

భారీగా ఖర్చు.. ఓటరు ఎటు వైపో...

ఎన్నికలు పూర్తి కావడంతో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారో అనే లెక్కల్లో అభ్యర్థులు నిమగ్నమ య్యారు. ఏ మండలం ఎటు వైపు మొగ్గు చూపిందో నని ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. భూపా లపల్లి నియోజకవర్గం నుంచి 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ప్రధానంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు, బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డిల మధ్య త్రిముఖ పోరు నడిచింది. పోటాపోటీగా ప్రచారం నిర్వహించడంతో పాటు అదే స్థాయిలో తాయిలాలు పంపిణీ చేశారు. ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు మనీతో పాటు మందు, మద్యం విచ్చలవిడిగా పంచారు. మంగళవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల రూ.100 కోట్లకు పైగా తాయిలాల రూపం లో ఖర్చు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల పేరుతో భూపాలపల్లి నియోజకవర్గంలో ఈ రెండు మూడు నెలల్లో రూ.500 కోట్లకు పైగా ఖర్చులు జరిగి ఉంటాయ నే చర్చ వినిపిస్తోంది.

ఓట్ల లెక్కల్లో అభ్యర్థులు..

ఖర్చులు అంచనాలు మించిపోయి నప్పటికి ఓటరు ఎవరిని కరుణించారో అనే ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది. గుర వారం రాత్రి 10గంటల వరకు అన్ని పోలింగ్‌ కేంద్రాల నుంచి ఈవీఎంలను స్ర్టాంగ్‌ రూమ్‌లకు తరలించి అభ్య ర్థుల భవిత్యాన్ని అధికారులు భద్ర పరిచారు. ఆదివారం ఉదయం 7గంట ల నుంచి మొదలయ్యే ఓట్ల లెక్కల్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో తేలనుం ది. అయితే అప్పటి వరకు అధికారు లకు పోలింగ్‌ సరళి, ఓటరు తీర్పుపై కంటిమీద కునుకు లేకుండా టెన్షన్‌ పెడుతుంది. దీంతో శుక్రవారం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి తన ముఖ్య అనుచరులతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. చిట్యాల, టేకుమట్ల, శాయంపేట, గణపురం, మొగుళ్లపల్లి, భూపాలపల్లి మండలాల్లో పోలింగ్‌ సరళిపై చర్చించారు. ఏ గ్రామంలో ఏ వర్గం నేతలు తనకు అనుకూలంగా పనిచేశారు.. ఎవరెవరు ప్రతికూలంగా వ్యవహరించారో ఆరా తీశారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు సైతం గురువారం రాత్రి నుంచి అన్ని మండలాల నేతలతో తన క్యాంపు కార్యాలయంలో అర్థరాత్రి వరకు చర్చలు జరిపారు. ఎక్కడెక్కడ తనకు అనుకూలంగా ఓటింగ్‌ జరిగింది, బీఆర్‌ఎస్‌ నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందా.. అనే కోణంలో ఆరా తీసినట్లుగా సమచారం. అన్ని మండలాల్లో కాంగ్రెస్‌ పార్టీకే ఓటర్లు జై కొట్టినట్లుగా ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా బీఆర్‌ఎస్‌లోని ఓ వర్గం నేతలు కూడా హస్తంతో కలిసి వచ్చారని, భారీ మెజారిటీతో గెలుస్తామని సత్యనారాయణరావు ధీమాతో ఉన్నారు. అలాగే బీజేపీ నేతలు సైతం తమకు ఏఏ మండలాల్లో భారీగా ఓటింగ్‌ పడుతుందో అనే అంశంపై బీజేపీ అభ్యర్థి కీర్తిరెడ్డి ముఖ్య నేతలతో చర్చించారు. ఇలా అభ్యర్థులు ఓటింగ్‌ సరళిపై రోజంతా చర్చలు జరుపుతున్నారు. పైకి ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లోపల మాత్రం ఎక్కడ తేడా కొట్టినా ఓటమి తప్పదనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది.

అభ్యర్థులకు క్రాస్‌ ఓటింగ్‌ టెన్షన్‌..?

ప్రధాన పార్టీల అభ్యర్థులకు క్రాస్‌ ఓటింగ్‌ టెన్షన్‌ పట్టుకుంది. అన్ని గ్రామాల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందనే టాక్‌ వినబడుతోంది. బీఆర్‌ఎస్‌లోనే ఓ వర్గం నేతలు గులాబీ అభ్యర్థికి హ్యాండిచ్చారనే చర్చ జరుగుతోంది. కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ఆ వర్గం నేతల్లో కొంతమంది మాత్రం ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సహకరించారనే టాక్‌ ఉంది. దీంతో చిట్యాల, టేకుమట్ల, శాయంపేట మండలాల్లో భారీగా బీఆర్‌ఎస్‌ ఓటింగ్‌కు గండి పడిందనే చర్చ జరుగుతోంది. అలాగే బీఆర్‌ఎస్‌ నుంచి ఓటర్లకు భారీగా తాయిలాలు అందటంతో కాంగ్రెస్‌, బీజేపీల నుంచి కొంత క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందనే చర్చ వినిపిస్తోంది. మరోవైపు సింగరేణి కార్మికుల్లో చాలా వరకు బీజేపీ వైపు మొగ్గు చూపటం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గాల్లో అందోళనకు గురిచేస్తుంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల అదాయ పన్నును తిరిగి చెల్లిస్తామని బీజేపీ హామీ ఇవ్వడంతో కార్మికుల ఓట్లు క్రాస్‌ అయినట్లుగా చర్చ జరుగుతోంది. మొత్తానికి అభ్యర్థుల టెన్షన్‌కు ఫుల్‌స్టాప్‌ పడాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-12-01T23:24:23+05:30 IST