ఓటెత్తారు..
ABN , First Publish Date - 2023-11-30T23:40:32+05:30 IST
జిల్లాలో అసెంబ్లీ పోరు గురువారం ముగిసింది. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో మందకొడిగా ఆరంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంది. జిల్లాలోని 539 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం పలుచగా ఓటర్లు కన్పించినప్పటికి.. సాయంత్రం పోలింగ్ ముగింపు నిర్ణీత కాలానికి జోరు పెరిగింది. 5 గంటలకు పలు పోలింగ్ కేంద్రాల ఆవరణలో ఉన్న ఓటర్లు రాత్రి పొద్దుపోయే వరకు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో ఓటింగ్ శాతం కొంత పెరిగే అవకాశం ఉంది.
జిల్లాలో 77.50 శాతం పోలింగ్
పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు
కొన్నిచోట్ల వాగ్వావాదాలు, స్వల్ప ఘర్షణలు
అడుగడుగునా పోలీస్ బృందాల భద్రత
పోలింగ్ కేంద్రాల్లో కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ
మహబూబాబాద్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అసెంబ్లీ పోరు గురువారం ముగిసింది. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో మందకొడిగా ఆరంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంది. జిల్లాలోని 539 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం పలుచగా ఓటర్లు కన్పించినప్పటికి.. సాయంత్రం పోలింగ్ ముగింపు నిర్ణీత కాలానికి జోరు పెరిగింది. 5 గంటలకు పలు పోలింగ్ కేంద్రాల ఆవరణలో ఉన్న ఓటర్లు రాత్రి పొద్దుపోయే వరకు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో ఓటింగ్ శాతం కొంత పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా 80 ఏళ్లు దాటి, పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు వారివారి ఇంటి వద్దనే ఓటుహక్కును సద్వి నియోగం చేసుకునే అవకాశం కల్పించారు. అధికారులు, పోలీసులు కలిసి ఈనెల 23,24 తేదీల్లో హోం ఓటింగ్ ద్వారా 972 మందికి ఓటు వేసుకునే సదుపాయం కల్పించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం పరిధిలో 12 మోడల్ పోలింగ్ కేంద్రాల చొప్పున 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఆయా కేంద్రాల్లో ఓటు సద్వినియోగం చేసుకున్న వారు ఆసక్తిగా తిలకించడం కన్పించింది.
ఈవీఎంల మొరాయింపు..
జిల్లాలోని గూడూరు మండలం అయోధ్యపురం, గుండెంగలో ఈవీఎంలు మధ్యాహ్నం గంటసేపు మొరాయించాయి. జిల్లా కేంద్రంలోని ఎంఈవో కార్యా లయంలోని మోడల్ పోలింగ్ కేంద్రం, రామాస్ ఉర్దూ మీడియం పాఠశాలలోని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఉదయం అరగంట పాటు ఈవీఎంలు ఇబ్బంది పెట్టడతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. బయ్యారం మండలం కొత్తపేట, నారాయణపురం, బయ్యారం మండల కేంద్రంలో పోలింగ్ ప్రక్రియ మధ్యలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది.
వాగ్వావాదాలు, స్వల్ప ఘర్షణలు...
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంవద్ద బీఆర్‌ఎస్ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వావాదం జరిగింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నేతలు పోలీసులకు మధ్య వాదోపవాదాలు, తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు బీఆర్‌ఎస్ శ్రేణులను చెదరగొట్టారు. మరిపెడ 229 పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఓటు వేసేందుకు పోలిం గ్ బూత్‌లోకి వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో వారి మధ్య స్వల్ప వాగ్వావాదం చోటు చేసుకుంది. కేసముద్రం మండలం ఉప్పరపల్లి జడ్పీ హైస్కూల్లో పోలింగ్ బూత్‌లోకి బీఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్ అనుచరులు వెళ్లగా అదే సమయంలో వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్య మురళీనాయక్ అనుచరుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది.
డోర్నకల్ మండలం మల్లాయికుంటతండా పోలింగ్ కేంద్రం సమీపంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. డోర్నకల్ మునిసిపల్ కేంద్రంలో సోమ్లతండా వద్ద మునిసిపల్ చైర్మన్ వాంకుడోతు వీరన్నకు.. తండాకు చెందిన యవకులకు మధ్య స్వల్పఘర్షణ చోటు చేసుకొంది. గంగారం మండలం కోమట్లగూడెం పోలింగ్ బూత్‌లో ఈవీఎం మిషన్‌పై గుర్తుతెలియని ఓటరు హస్తం గుర్తు వద్ద వేలి ముద్ర ఉండటంతో ఈ గుర్తు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా ఉందని బీఆర్‌ఎస్ ఏజెంట్ అభ్యంతరం తెలిపారు. దీంతో దాదాపు ఆరగంట పాటు పోలింగ్ నిలిచి పోయింది.
పరిశీలించిన అభ్యర్థులు..
మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు స్వయంగా సందర్శించి, పోలిం గ్ సరళీని పరిశీలించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా బీ ఆర్‌ఎస్ అభ్యర్థులు బానోత్ శంకర్‌నాయక్, డీఎస్ రెడ్యానాయక్‌లు, కాంగ్రెస్ అభ్యర్థులు డాక్టర్ భూక్య మురళీనాయక్, డాక్టర్ జా టోతు రాం చంద్రునాయక్, బీజేపీ అభ్య ర్థులు జాటోతు హుస్సేన్‌నాయక్, భూక్య సంగీతతోపాటు పాలకుర్తి పరిధిలోని తొర్రూరులో మంత్రి, బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు పోలింగ్ కేం ద్రాలను సందర్శించి పోలింగ్ సరళి అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణలో..
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శశాంక ఉద యం నుంచే రెండు నియోజక వర్గాల్లో విస్తృతం గా పర్యటిస్తూ పలు పోలింగ్ కేంద్రాలను సంద ర్శించారు. మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళీ సౌకర్యాలను పరిశీలించారు. ఓటరుకు ఇ బ్బంది కలుగకుండా చూడాలని సిబ్బందికి సూచ నలు, సలహాలు ఇచ్చారు. దివ్యాంగులకు అసౌక ర్యం కలుగకుండా వీల్‌చైర్స్‌లతో పోలింగ్ కేంద్రా నికి 100 మీటర్ల దూరంలోనే ఎన్నికల సిబ్బంది సిద్ధంగా ఉండి వివిధ వాహనాల్లో అక్క డికి చేరుకున్న వారిని నేరుగా పోలింగ్ కేంద్రానికి తీసకువెళ్లి ఓటు వేయించి నిర్ణీత స్థానాలకు చేర్చారు. వృద్ధులకు సైతం వీల్‌చైర్‌ల్లో తీసుకువెళ్లి ఓట్లు వేయిం చారు. ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీపాటిల్ స్వయంగా రెండు నియోజకవర్గాల్లోని సాధారణ పోలింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మ క కేంద్రాలను సందర్శించి పరిస్థితులు సమీక్షించారు. విధుల్లో ఉన్న పోలీస్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఆసాంఘీక శక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండ ప్రతి పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే ప్రత్యేక పోలీస్ బృందాలతో బం దోబస్తు ఏర్పాటు చేశారు. మహిళా పోలీసులను సైతం పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుకు ఏర్పాటు చేశారు.
నాటికి.. నేటికి తేడా...!
2018 అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,95,593 ఓట్లకు గాను 1,74,076 అంటే 88.96 శాతం ఓట్లు పోలయ్యాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,17,303 ఓట్లకు గాను 1,84,940 అంటే 85.06 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈసారి డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,19,264 ఓటర్లు ఉండగా పోలింగ్ నిర్ణీత సమయం 5 గంటల వరకు 79.32 శాతం ఓట్లు నమోదయ్యాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలో ఈసారి 2,53,342 ఓట్లు ఉండగా పోలింగ్ నిర్ణీత సమయం 5 గంటల వరకు 75.93 శాతం నమోద య్యాయి. ఉదయం పోలింగ్ ఆరంభమైన 7 గంటల నుంచి ప్రతీ రెండు గం టలకు నమోదైన ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. డోర్నకల్ నియోజకవర్గంలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 10.65 శాతం ఓట్లు నమోదయ్యాయి. 11 గంటలకు 29.37 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 49.29 శాతం, 3 గంటలకు 67.67 శాతం, 5 గంటలకు 79.32 శాతం ఓట్లు నమోదయ్యాయి. మహబూ బాబాద్ నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 11.16 శాతం, 11 గం టలకు 26.91 మధ్యాహ్నం ఒంటిగంటకు 44.81, 3 గంటలకు 62.78, 5 గంటలకు 75.93 శాతం ఓట్లు నమోదయ్యాయి. జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాల పోలింగ్ శాతం మొత్తం 77.50 కాగా, ఉదయం 9 గంటల వరకు 10.92 శాతం, 11 గంటలకు 28.05, ఒంటిగంటకు 46.89, 3 గంటలకు 65.05, సాయంత్రం 5 గంటల వరకు 77.50 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఇంకా పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల్లోగా ఓటు వేయడానికి వచ్చిన వారి పోలింగ్ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది.