వరంగల్‌లో ఒకే నిమిషం హాల్టింగ్‌

ABN , First Publish Date - 2023-01-13T00:12:48+05:30 IST

దేశంలోనే హైస్పీడ్‌ రైలుగా పేరుగడించిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వరంగల్‌ ప్రజలకు ఆదివారం నుంచి అందుబాటులోకి రానుంది. కేంద్రం వందేభారత్‌ రైలును రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం విశాఖపట్నం- సికింద్రాబాద్‌ మార్గంలో ప్రవేశపెడుతోంది. ఆదివారం ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా సికింద్రాబాద్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే మంత్రితో కలిసి ప్రారంభించనున్నారు. విశాఖపట్నం- సికింద్రాబాద్‌ మధ్య ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు.

వరంగల్‌లో ఒకే నిమిషం హాల్టింగ్‌

ఆదివారం మినహా ఆరు రోజులు రాకపోకలు

కాజీపేటలో నో హాల్టింగ్‌

గిర్మాజిపేట(వరంగల్‌), జనవరి 12: దేశంలోనే హైస్పీడ్‌ రైలుగా పేరుగడించిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వరంగల్‌ ప్రజలకు ఆదివారం నుంచి అందుబాటులోకి రానుంది. కేంద్రం వందేభారత్‌ రైలును రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం విశాఖపట్నం- సికింద్రాబాద్‌ మార్గంలో ప్రవేశపెడుతోంది. ఆదివారం ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా సికింద్రాబాద్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే మంత్రితో కలిసి ప్రారంభించనున్నారు. విశాఖపట్నం- సికింద్రాబాద్‌ మధ్య ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. విశాఖపట్నంలో బయలుదేరి రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌లో మాత్రమే ఆగి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు, పూర్తిగా ఏసీ సౌకర్యంతో మొత్తం 18 కోచ్‌లతో ఉంటుంది. చైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ కోచ్‌లుంటాయి. రైలు రాకపోకల వేళలను గురువారం రాత్రి రైల్వేశాఖ ప్రకటించింది. అయితే టికెట్‌ చార్జీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. కాగా కాజీపేట జంక్షన్‌లో ఈ రైలుకు హాల్టింగ్‌ ఇవ్వలేదు.

సికిందరాబాద్‌ వైపు మధ్యాహ్నం12.05 గంటలకు..

విశాఖపట్నంలో వందేభారత్‌ ఉదయం 5.45 గంటలకు బయలుదేరి 7.55 గంటలకు రాజమండ్రికి చేరుకుంటుంది. తిరిగి రాజమండ్రిలో 7.57 గంటలకు బయలుదేరి 10 గంటలకు విజయవాడకు, అక్కడి నుంచి 10.05 బయలుదేరి 11గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. తిరిగి ఖమ్మం నుంచి 11.01 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.05 గంటలకు వరంగల్‌కు చేరుకుంటుంది. కేవలం ఒక నిమిషం మాత్రమే ఆగుతుంది. వరంగల్‌ నుంచి బయలుదేరి మఽధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌లో 45 నిమిషాలు ఆగి తిరిగి విశాఖపట్నం బయలు దేరుతుంది.

విశాఖపట్నం వైపు..

వందే భారత్‌ రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.35 గంటలకు వరంగల్‌కు చేరుకుంటుంది. వరంగల్‌లో ఒక నిమిషం మాత్రమే ఆగుతుంది. తిరిగి వరంగల్‌ నుంచి ఖమ్మంకు 5.45గంటలకు చేరుకుంటుంది. అక్కడకూడా ఒక నిమిషమే ఆగుతుంది. ఖమ్మం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటకు విజయవాడకు చేరుకుంటుంది. అక్కడ 5 నిమిషాలు ఆగుతుంది. రాత్రి 8.58 గంటలకు రాజమండ్రిలో 2 నిమిషాలు ఆగుతుంది. రాజమండ్రి నుంచి బయలుదేరి రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుటుంది. ఈ రైలు మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నం నుంచి సికిందరాబాద్‌కు బయలుదేరుతుంది.

ఇంకా ప్రకటించని టికెట్ల ధరలు

ఇదిలాఉండగా ఇప్పటి వరకు ఈ రైలు టికెట్‌ ధరలను రైల్వే అధికారులు ప్రకటించ లేదు. అలాగే, రిజర్వేషన్‌ తీసుకోవాలా.. లేక నేరుగా బుకింగ్‌ కౌంటర్‌లో టికెట్‌ తీసుకుంటే సరిపోతుందా అన్నదానిపై ఇంకా స్పష్ట రాలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెలువడే అవకాశముందని వెల్లడించారు.

Updated Date - 2023-01-13T00:12:49+05:30 IST