‘వీర’ విహారం

ABN , First Publish Date - 2023-01-29T00:55:25+05:30 IST

హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్‌ ప్రేక్షకులతో నిండిపోయింది. మైత్రీ మూవీమేకర్స్‌ బ్యానర్‌పై మెగాస్టార్‌ హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభ ఆదివారం సుమారు నాలుగుగంటల పాటు ఏకధాటిగా నేత్రపర్వంగా కొనసాగింది. కమనీయ వ్యాఖ్యానాల మధ్య కళాకారుల నృత్యాలు విశేషంగా తరలివచ్చిన ప్రేక్షకుల ఈలలు, చప్పట్లు, కేరింతల మధ్య ఆద్యంతం కొనసాగింది. నగర చరిత్రలో అత్యధిక సినీ ప్రేక్షకులు హాజరైన సభగా నిలిచింది.

‘వీర’ విహారం
విజయోత్సవ సభలో మాట్లాడుతున్న చిరంజీవి

వెల్లువలా తరలివచ్చిన సినీ అభిమానులు

కిక్కిరిసిన హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానం

వరంగల్‌ అభిమానానికి ఫిదా : మెగాస్టార్‌ చిరంజీవి

ప్రత్యేకాకర్షణగా మెగా పవర్‌స్టార్‌ హీరో రామ్‌చరణ్‌

హనుమకొండ కల్చరల్‌, జనవరి 28: హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్‌ ప్రేక్షకులతో నిండిపోయింది. మైత్రీ మూవీమేకర్స్‌ బ్యానర్‌పై మెగాస్టార్‌ హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభ ఆదివారం సుమారు నాలుగుగంటల పాటు ఏకధాటిగా నేత్రపర్వంగా కొనసాగింది. కమనీయ వ్యాఖ్యానాల మధ్య కళాకారుల నృత్యాలు విశేషంగా తరలివచ్చిన ప్రేక్షకుల ఈలలు, చప్పట్లు, కేరింతల మధ్య ఆద్యంతం కొనసాగింది. నగర చరిత్రలో అత్యధిక సినీ ప్రేక్షకులు హాజరైన సభగా నిలిచింది.

తరలివచ్చిన వీఐపీలు

మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, దర్శకుడు బాబీ, నిర్మాతలు ఎలమంచలి రవిశంకర్‌, ఎర్నేని నవీన్‌, సినిమాలో నటించిన సప్తగిరి సాయి, రచ్చరవి, ప్రవీణ్‌, శకలక శంకర్‌, శ్రీనివాస్‌రెడ్డితో పాటు సమస్త టెక్నీషియన్స్‌, రెండు తెలుగు రాష్ర్టాల నుంచి వచ్చిన డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, అరూరి రమేష్‌, శంకర్‌నాయక్‌లతో పాటు వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో చిరంజీవి మాట్లాడుతూ.. వరంగల్‌.. ఓరుగల్లు గడ్డ ఎన్ని రోజులైంది. ఎన్నిసార్లు వచ్చినా నాకు ఆనందమే. ఈ ఓరుగల్లు ప్రేక్షక ఆభిమానానికి నేను ఫిదా... అని అన్నారు. ఇక్కడి మనుషుల ప్రేమ స్వచ్ఛత, అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అభిమానమే నాలో స్ఫూర్తిగా నిలిచింది. అందుకే 1983లో ఖైదీని ఏవిధంగా ఆదరించారో 2023లో వాల్తేరు వీరయ్యను ఆశీర్వదించారు. ప్రేక్షకులే నాకు దేవుళ్లు. వారి ఆదరణతోనే ఎన్ని సినిమాల్లోనైనా నటించే సత్తా నాకుంది. గతంలో గ్యాంగ్‌లీడర్‌, ఘరానామొగుడు, రౌడీ అల్లుడు వంటి సినిమాల్లో ఎలా నటించాలో ఆ సినిమాల కలగొలుపుగా దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్యను తీర్చిదిద్దాడని కొనియాడారు. ప్రత్యేకంగా దర్శకుడు తన అభిమాని అయినందుకే ఇంతటి చిత్రాన్ని ఆవిష్కరింపచేశారని అన్నారు. దర్శకుడు, నిర్మాతల్ని చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.

నేను నాన్నగా గర్వపడుతున్నా : రామ్‌చరణ్‌

వరంగల్‌ నమస్కారం.. అంటూ మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఉపన్యాసం మొదలు పెట్టారు. వాల్తేరు వీరయ్య సినిమాలో నాన్నగారిలా లేరు. నా బ్రదర్‌గా ఉన్నారు అని రామ్‌చరణ్‌ అన్నారు. నాన్నను చూసి గర్వంగా ఉందన్నారు. మెగాస్టార్‌, పవర్‌స్టార్‌ అభిమానులతో పాటు ముఖ్యంగా వరంగల్‌ అభిమానులకు స్పెషల్‌ థ్యాంక్స్‌ అన్నారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. తాను చిరంజీవి అభిమానినన్నారు. ఏ జన్మలో చేసుకు న్న అదృష్టమో గుంటూరు నుంచి హైదరాబాద్‌ చేరుకుని ఈ సినిమాకు దర్శకత్వం వహించాను. అది మెగా సకె ్సస్‌ కావడమే కాకుండా ఊహకందని కలెక్షన్లను వసూలు చేసిందన్నారు. అభిమానుల అంచనాలకు తగ్గకుండా సినిమాను రూపొందించినట్లు చెప్పారు. ఇంత పెద్ద సక్సెస్‌ మీట్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. హీరో చిరంజీవి, రామ్‌చరణ్‌లు కలిసి వరంగల్‌లో ఒక మెగా స్టూడియో ఏర్పాటు చేయాలని, దానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి ఎలాంటి సహకారం అయినా అందిస్తానని అన్నారు. నిర్మాతలు రవిశంకర్‌, నవీన్‌లు మాట్లాడుతూ.. హాలీవుడ్‌కు ధీటుగా చిరంజీవి ఇమేజ్‌ను తగ్గించకుండా సినిమాను నిర్మించామని, మెగా హిట్‌ ఇచ్చిన ప్రేక్షకులకు సదా రుణపడి ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా భద్రకాళి అమ్మవారి ఫొటో సహా గజమాలలతో హీరో చిరంజీవి, రామ్‌చరణ్‌లను అభిమానులు ఘనంగా సత్కరించారు.

శ్రుతిహాసన్‌కు చిరు గ్రీటింగ్స్‌

వాల్తేరు వీరయ్య సినిమాలో హీరోయిన్‌గా నటించిన శృతిహాసన్‌కు చిరంజీవి ప్రత్యేకంగా గ్రీటింగ్స్‌ చెప్పారు. ఈ రోజు వరంగల్‌లో ఉండాల్సిన ఆమె.. తన బర్త్‌డే సందర్భంగా రాలేకపోయిందని, ఆమె ఎక్కడ ఉన్నా ఇంతమంది వరంగల్‌ సినీప్రేక్షక అభిమానుల మధ్య గ్రీటింగ్స్‌ అని శృతిహాసన్‌కు ప్రత్యేక గ్రీటింగ్స్‌ చేశారు.

కిక్కిరిసిన రహదారులు

వాల్తేరు వీరయ్య విజయ విహారం పేరిట సినిమా విజయోత్సవ సభకు ఆర్ట్స్‌ కళాశాల మైదానానికి అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు. మధ్యాహ్నం 3గంటల నుంచే అన్ని రహదారులు ఆర్ట్స్‌ కళాశాల వైపునకు తరలి రావడంతో పోలీసులు పలుమార్లు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. నిర్వాహకులు పాసులు ఉన్నా ఎవరినీ సభకు అనుమతించకపోవడంతో అభిమానులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. కరాటే ప్రభాకర్‌, తోట నవీన్‌తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి అభిమానులు తరలివచ్చారు.

మంత్రి ఎర్రబెల్లి ఇంట్లో చిరంజీవికి విందు

హనుమకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో శనివారం రాత్రి జరిగిన వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో పాల్గొన్న మెగాస్టార్‌ చిరంజీవి, రాంచరణ్‌లతో పాటు సినిమా యూనిట్‌ సభ్యులందరికీ రాష్ట్ర పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హనుమకొండ రాంనగర్‌లోని తన నివాసంలో ప్రత్యేక విందు ఇచ్చారు. అనంతరం యూనిట్‌ సభ్యులందరూ ప్రత్యేక వాహనాల్లో సభకు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు చిత్ర దర్శకుడు బాబీతో పాటు యాంకర్‌ సుమ పలువురు చిత్ర యూనిట్‌ సభ్యులు భద్రకాళి అమ్మవారిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2023-01-29T00:55:27+05:30 IST