Share News

వడ్ల కొనుగోళ్లు అంతంతే.!

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:40 PM

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా కొనసాగుతున్నాయి. కోతలు జోరందుకు న్నా.. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ధాన్యానికి బయటి మార్కెట్లలో అత్యధిక ధరలు పలకడంతో వాతావరణ మార్పుల వల్ల వర్షాలు కురియడంతో.. ఆశించినంతగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోవడమే కాక... ఖరీదులు కూడా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి.

వడ్ల కొనుగోళ్లు అంతంతే.!
మహబూబాబాద్‌ మండలం ముడుపుగల్‌ కొనుగోలు కేంద్రంలో ఖరీదు చేసిన ధాన్యాన్ని లారీలోకి ఎగుమతి చేస్తున్న దృశ్యం

వానాకాలం టార్గెట్‌ 2.50 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఇప్పటి వరకు సేకరించింది 7,430...

జిల్లాలో 216 కేంద్రాలకు 192 ప్రారంభం

ఖరీదులు చేపట్టింది 61 చోట్లనే..

వానలతో పూర్తిగా ప్రారంభ కాని సెంటర్లు

సన్న రకం ధాన్యానికి డిమాండ్‌.. ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయిస్తున్న రైతులు

మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, డిసెంబరు 17 : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా కొనసాగుతున్నాయి. కోతలు జోరందుకు న్నా.. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ధాన్యానికి బయటి మార్కెట్లలో అత్యధిక ధరలు పలకడంతో వాతావరణ మార్పుల వల్ల వర్షాలు కురియడంతో.. ఆశించినంతగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోవడమే కాక... ఖరీదులు కూడా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి.

మహబూబాబాద్‌ జిల్లాలో 216 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా, ధరల పెరుగుదలతో 192 సెంటర్‌లను ప్రారంభించారు. అందులో 61 కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఈ వానాకాలం 2023-24లో 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు 7,430.820 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి.

2.16 లక్షల ఎకరాల్లో వరిపంట..

ఈ వానాకాల సీజన్‌లో జిల్లాలో 2.16 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంటను సాగు చేశారు. అందుకు గాను దిగుబడి 3.37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేయడంతో అందులో 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని సివిల్‌ సప్లయీస్‌ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దిగుబడికి అనుగుణంగా జిల్లాలో 216 కొనుగోలు కేంద్రాలకు గాను 192 కేంద్రాలను ప్రారంభించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 55, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 128, మెప్మా ఆధ్వర్యంలో 1, డీహెచ్‌ఎ్‌సవో ఆధ్వర్యం లో 1 వెరసి 192 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఇందులో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 42 కేంద్రాల్లో కొనుగోళ్లు చేపట్టగా ఐకేపీ ఆధ్వర్యంలో 17 కేంద్రాల్లోనూ, డీహెచ్‌ఎ్‌సవో, మెప్మా ఆధ్వర్యంలోని ఒక్కొక్క కేంద్రాల్లో వెరసి 61 కొనుగోలు కేంద్రాల్లో ఖరీదులు చేపట్టారు. జిల్లాలోని 61 కొనుగోలు కేంద్రాల్లో ఖరీదులు చేపట్టగా వరి ఏ-గ్రేడ్‌కు రూ.2203, కామన్‌ రకం రూ.2040 ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోళ్లు చేశారు. గతేడాది కంటే క్వింటాపై రూ.143లు వరకు మద్దతు ధర పెరగింది. గ్రేడ్‌-ఏ రకం ధాన్యం 3204.240 మెట్రిక్‌ టన్నులు, కామన్‌ రకం 4226.580 మెట్రిక్‌ టన్నులు వెరసి 7430 .820 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఖరీదులు చేపట్టారు. మిల్లులకు 6,333.640 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తరలించగా ఇంకా 1097.180 మెట్రిక్‌ టన్నులు జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్నాయి.

బయటి ధరల పెరుగుదల..

బయటి మార్కెట్లలో సన్నధాన్యానికి విపరీతంగా డిమాండ్‌ ఏర్పడింది. ఈసారి రైతులు అధికంగా సన్నరకం ధాన్యం పండించారు. ఆర్‌ఎన్‌ఆర్‌ రకానికి అధిక డిమాండ్‌ ఉంది. జైశ్రీరాం రకం ధాన్యం రూ.3140 నుంచి రూ.3409 వరకు, ఆర్‌ఎన్‌ఆర్‌ రూ.3130 నుంచి రూ.3359 వరకు, బీబీటీ రూ.2389 నుంచి రూ.3189 వరకు, హెచ్‌ఎంటీ రూ.2300 నుంచి రూ.3289 వరకు ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా ధరలు పలుకుతుండడం, వెంటనే నగదు చేతికి వస్తుండడంతో రైతులు ప్రైవేట్‌ వ్యాపారుల వైపు మొగ్గుచూపుతున్నారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు గత కొద్దిరోజుల నుంచి 38 వేల బస్తాల వరకు ధాన్యం రాబడులు వస్తుండగా మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు 10 వేలకు పైగా బస్తాలు వస్తున్నాయి. మార్కెట్‌లో ధాన్యం పెరుగుదలతో పొరుగు జిల్లాల నుంచి కూడ ఈ మార్కెట్లకు ధాన్యం తీసుకువస్తున్నారు.

బయటి ధరలు పెరగడంతోనే..

- కృష్ణవేణి, జిల్లా సివిల్‌ సప్లయీస్‌ మేనేజర్‌

ఈ సారి మార్కెట్లలో ఽధాన్యానికి అధిక ధరలు పలుకుతుండడంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అమ్మకానికి రావడం లేదు. దీంతోనే 216 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధం కాగా, 192 కేంద్రాలను మాత్రమే ప్రారంభించాం. అయినప్పటికి కేవలం 61 కేంద్రాల్లోనే అంతంతమాత్రంగానే ఖరీదులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 7,430.820 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఖరీదు చేశాం. ఇంకా పూర్తిస్థాయిలో వరి కోతలు కొయ్యలేదు.

Updated Date - Dec 17 , 2023 | 11:40 PM