యాత్రల జాతర

ABN , First Publish Date - 2023-02-21T00:36:32+05:30 IST

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ ‘యాత్రలు’ హోరెత్తుతున్నాయి. వివిధ పార్టీల ముఖ్య నేతలు పర్యటనలకు ముమ్మరం చేశారు. ప్రజల వద్ద క్యూ కడుతున్నారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి తహతహలాడుతున్నారు. ఆ పార్టీ.. ఈ పార్టీ అని లేదు.. ప్రతి ఒక్కరూ అదే బాటపట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌, కేంద్రంలో ఉన్న బీజేపీలతోపాటు కాంగ్రెస్‌ నేతలు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి.

యాత్రల జాతర

రేపు, ఎల్లుండి టీపీసీసీ అఽధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాక

ఆయనతోపాటు మరికొందరు కీలక నేతలు

23న మంత్రి కేటీఆర్‌ పర్యటన

పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

24న కాటారానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

సునీల్‌రెడ్డి పాదయాత్ర ముగింపు సభకు హాజరు

భూపాలపల్లి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చనే సాంకేతాలు రాజకీ యాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు భూపాలపల్లి జిల్లా బాట పడుతు న్నారు. యాత్రలు, పర్యటనల ద్వారా ప్రజల వద్దకు వస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. ఆయా పార్టీల ముఖ్య నేతలు వస్తుండటంతో కేడర్‌లో జోష్‌ పెరిగింది. హాత్‌సే హాత్‌ జోడో యాత్ర పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంగళ, బుధవారాల్లో పర్యటించనున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్‌) ఈనెల 23న రానున్నారు. జిల్లాలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే ఈనెల 24న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కాటారంలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే పార్టీ సభకు హాజరుకానున్నారు.

కాంగ్రెస్‌లో జోష్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన హాథ్‌సే హాథ్‌ జోడో యాత్ర భూపాలపల్లి జిల్లాలో రెండు రోజులపాటు కొనసాగనుండటంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో రేవంత్‌ యాత్ర కొనసాగనుంది. ఆయన తో పాటు కాంగ్రెస్‌ కీలక నేతలు ఈ యాత్రలో పాల్గొననున్నారు. మంగళవారం రాత్రి చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి రేవంత్‌రెడ్డి చేరుకోనున్నారు. రాత్రి ఇక్కడే బస చేసి బుధవారం ఉదయం చల్లగరిగె నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. చల్లగరిగె, జూకల్‌, తిరుమలాపూర్‌, చిట్యాల, ఏలేటి రామయ్యపల్లి, నవాబ్‌పేట గ్రామాల మీదుగా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చేరు కోనున్నారు. సాయంత్రం 6 గంటలకు మొగుళ్లపల్లి బస్టాండ్‌ సెంటర్‌లో కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. రేవంత్‌రెడ్డి చేపట్టిన హాథ్‌సే హాథ్‌ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు టీపీసీసీ సభ్యుడు, కాంగ్రెస్‌ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ మండలాల నుంచి భారీగా జన సమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో భూపాలపల్లి, గణపురం మండలాల్లో గండ్ర సత్యనారాయణరావు నేతృత్వంలో కాంగ్రెస్‌ శ్రేణులు హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రను నిర్వహించాయి. రేవంత్‌రెడ్డి కూడా తన యాత్రను చేపట్టనుండటంతో కాంగ్రెస్‌ కేడర్‌లో జోష్‌ నెలకొంది.

కేటీఆర్‌ రానుండగా...

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు భూపాలపల్లి జిల్లాలో ఈనెల 23న పర్యటించను న్నారు. హెలీక్యాప్టర్‌ ద్వారా భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి ఆయన చేరుకోనున్నారు. అక్కడ నిర్మించిన తహసీల్దార్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గాంధీనగర్‌లోని కస్తూర్బా పాఠశాలను ప్రారంభించ నున్నారు. అనంతరం భూపాల పల్లిలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌తోపాటు సింగరేణి క్వార్టర్స్‌ను ప్రారంభి స్తారు. అలాగే పేదల కోసం నిర్మించిన 994 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేస్తారు. రూ.4.50 కోట్లతో నిర్మించనున్న మినీ స్టేడియం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు మరి కొన్ని అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలు చేస్తారు. అనంతరం అంబేద్కర్‌ స్టేడి యంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వ ర్యంలో సుమారు 50వేల మందితో నిర్వహించ నున్న బహిరంగ సభకు హాజరవుతారు. కేటీఆర్‌ పర్యటనను విజయవంతం చేయడానికి బీఆర్‌ఎస్‌ నేతలు కసరత్తు చేస్తున్నారు. భూపాలపల్లి నియో జకవర్గంలోని ఆరు మండలాల నుంచి భారీగా జనాన్ని సమీకరించేందుకు సిద్ధమయ్యారు. భూపాలపల్లి జిల్లాకు తొలిసారిగా కేటీఆర్‌ వస్తుండటంతో పార్టీ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 7వ తేదీనే కేటీఆర్‌ జిల్లా పర్యటన ఖరారైనప్పటికీ చివరి నిమిషంలో రద్దు కావడంతో కార్యకర్తల్లో కొంత నిరాశ వ్యక్తమైంది. ఏడాది తర్వాత మళ్లీ కేటీఆర్‌ పర్యటన ఖరారు కావడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. భూపాలపల్లి పట్టణాన్ని మొత్తం గులాబీమయం చేసేందుకు భారీగా ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలు, కటౌట్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

- 24న కాటారంకు బండి సంజయ్‌ రాక

బీజేపీ నాయకుడు చందుపట్ల సునీల్‌రెడ్డి కొద్ది రోజులుగా కాటారం సబ్‌ డివిజన్‌లో ప్రజాచైతన్య యాత్రను చేపడుతున్నారు. నేరుగా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 24న కాటారంలో ఈ యాత్ర ముగియనుంది. చివరి రోజు అక్కడ బీజేపీ భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. మంథని నియోజకవర్గ పరిధిలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఇప్పటికే ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి పలుమార్లు పర్యటించారు. తాజాగా బండి సంజయ్‌ కాటారం వస్తుండటంతో కాషాయ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. బండి సంజయ్‌ పర్యటనకు విస్తృతంగా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు బలమైన కేడర్‌ ఉండగా.. దానికి దీటుగా కమలం పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టి సారించింది. దీంతో వారం, పది రోజులుగా చందుపట్ల సునీల్‌రెడ్డి కాటారం సబ్‌ డివిజన్‌ పరిధిలోని పలు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. తాజాగా బండి సంజయ్‌ వస్తుండటంతో బీజేపీ కేడర్‌లో నూతనోత్సాహం రానుంది.

- మూడు పార్టీలు.. ముగ్గురు నేతలు

టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ ముఖ్య న్యాయకత్వమంతా భూపాలపల్లి జిల్లా పర్యటనకు వస్తుండటంతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు పార్టీని బలోపేతం చేయడంతో పాటు తమ వ్యక్తిగత ఇమేజ్‌ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కీలక నేతలను జిల్లా పర్యటనకు తీసుకొచ్చి కేడర్‌లో జోష్‌ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో సిట్టింగ్‌లకే టికెట్‌ అని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రకటించినప్పటికీ మాజీ స్పీకర్‌, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడంతో పాటు తనకే టికెట్‌ వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత పర్యటన నేపథ్యంలో గండ్ర, సిరికొండ వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు బహిర్గత మైంది. పరస్పర ఆరోపణలు, నినాదాలతో రచ్చరచ్చ చేశారు. తాజాగా కేటీఆర్‌ పర్యటన ఉండటంతో మళ్లీ ఈ విభేదాలు తెరపైకి వస్తాయా..? అనే ఉత్కంఠత కేడర్‌లో నెలకొంది. మరోవైపు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వ్యూహాత్మకంగా కేటీఆర్‌ పర్యటనను ఏర్పాటు చేసినట్టు గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన గండ్ర సత్యనారాయణరావు సైతం ఈసారి హస్తం గుర్తుతో బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటింపజేసి కేడర్‌లో జోష్‌ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే కార్నర్‌ మీటింగ్‌లతో ఇప్పటికే బీజేపీ పల్లెల్లో వాడవాడలా సమావేశాలు నిర్వహిస్తోంది. తాజాగా బండి సంజయ్‌ను కాటారం బహిరంగ సభకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం నీళ్లు రైతులకు అందడంలేదని, ఈ ప్రాజెక్టులో అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు చేస్తున్న బీజేపీ బండి సంజయ్‌ పర్యటనతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోననే ఉత్కంఠ నెలకొంది. మూడు ప్రధాన పార్టీల ముఖ్య మూడు రోజులు వరుసగా పర్యటించనుండటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Updated Date - 2023-02-21T00:36:37+05:30 IST