చదువుల ఖిల్లా.. మరిపెడ బంగ్లా..

ABN , First Publish Date - 2023-03-19T00:07:21+05:30 IST

చదువుల ఖిల్లాగా మరిపెడబంగ్లా విలసిల్లుతోంది. నిరుపేద విద్యార్థులకు ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారింది. ప్రతీ ఏటా నాలుగు వేల మందికి పైగా విద్యార్థులు విద్యార్జన చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే ఏ మునిసిపల్‌ కేంద్రంలో లేని విధంగా మరిపెడ మునిసిపాలిటీలో ఐదు గురుకుల కళాశాలలు, మినీ గురుకులం, ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలు, రెండు హైస్కూల్స్‌, పీఎస్‌ స్కూల్స్‌ ఉన్నాయి. వీటిలో నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాల, బాలికలకు ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు కలిపిస్తున్నారు.

చదువుల ఖిల్లా.. మరిపెడ బంగ్లా..
మరిపెడలోని ఎస్సీ గురుకుల పాఠశాల, కళాశాల

ప్రతీ ఏటా 4వేల మంది విద్యార్జన

మారుమూల ప్రాంత విద్యార్థులకు ఉచిత విద్య, వసతి

స్థానికులకే 50శాతం రిజర్వేషన్‌

చదువుల ఖిల్లాగా మరిపెడబంగ్లా విలసిల్లుతోంది. నిరుపేద విద్యార్థులకు ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారింది. ప్రతీ ఏటా నాలుగు వేల మందికి పైగా విద్యార్థులు విద్యార్జన చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే ఏ మునిసిపల్‌ కేంద్రంలో లేని విధంగా మరిపెడ మునిసిపాలిటీలో ఐదు గురుకుల కళాశాలలు, మినీ గురుకులం, ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలు, రెండు హైస్కూల్స్‌, పీఎస్‌ స్కూల్స్‌ ఉన్నాయి. వీటిలో నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాల, బాలికలకు ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు కలిపిస్తున్నారు.

మరిపెడ, మార్చి 18: మరిపెడ–వరంగల్‌ రూట్లో ఎన్‌హెచ్‌ఏ 563 పక్కనే మరిపెడకు 5కిలో మీటర్ల దూరంలో యూనివర్సిటీ క్యాంపస్‌ను తలపించేలా ఎస్సీ, ఎస్టీ గురుకుల కళాశాలలు, పాఠశాలలకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే అప్పటి ప్రభుత్వాలు పక్కా భవనాలను నిర్మించాయి. ఎస్సీ బాలికల గురుకుల కళాశాలలను అప్పట్లో నిర్మించిన మరిపెడ–కూన్యా తండా రహదారిలోని ఇంటిగ్రేటేడ్‌ హాస్టల్స్‌ సముదాయ భవన్‌లో నిర్వహిస్తున్నారు. బీసీ బాలికల కళాశాలను మరిపెడ–సూర్యపేట రహదారిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ను అద్దెకు తీసుకొని దాంట్లో కొనసా గిస్తున్నారు. ఎస్సీ ఆశ్రమ పాఠశాలకు సొంత భవనం పాతదే ఉన్నది. వీటికి తోడు కస్తూర్బా స్కూల్‌, కాలేజీ, మోడల్‌ స్కూల్‌, కాలేజీ ఉంది. దీంతో పాటు ప్రభుత్వ స్కూల్స్‌, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కాలేజీలలో చదివే పేద విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ బాల, బాలికలకు వేర్వేరుగా ప్రత్యేక సంక్షేమ హాస్టల్స్‌ను నిర్మించారు.

4వేల మందికి పైగా విద్యార్జన

మరిపెడలోని వివిధ గురుకుల కళాశాలలు, పాఠశాలల్లో ప్రతీ ఏటా 3వేల మందికిపైగా నిరుపేద విద్యార్థులు విద్యార్జన చేస్తున్నారు. వారందరికి ఉచిత విద్యా, వసతి, భోజన సౌకర్యాలను ప్రభుత్వం కలిపించింది. సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ స్కూల్‌, కాలేజీలో 640 మంది, ట్రైబల్‌ వెల్పేర్‌ రెసిడెన్సియల్స్‌లో 540 మందికి, ఎస్టీ బాలికల మినీ గురుకులంలో 240 మందికి, ఎస్టీ డిగ్రీ గురుకులంలో 240 మందికి ప్రవేశాలు కలిపించారు. అదేవిధంగా బీసీ బాలికల రెసిడెన్సియల్‌, ఎస్టీ బాలికల రెసిడెన్సియల్‌లో 540మంది చొప్పున విద్యార్జన చేస్తున్నారు. కస్తూర్బా స్కూల్‌, కాలేజీలో 540 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో 200 మందికి అడ్మిషన్లు ఇచ్చారు. వివిధ ప్రభుత్వ స్కూల్స్‌, కళాశాలలో చదివే మరో 540 మంది విద్యార్థులు సంక్షేమ హాస్టళ్లలో వసతి, భోజన సౌకర్యాలు పొందుతున్నారు.

50శాతం సీట్లు స్థానిక విద్యార్థులకే..

మరిపెడ బంగ్లాలోని వివిధ గురుకుల పాఠశాలలు, కళాశాలల ప్రవేశాల కోసం నియోజకవర్గ పరిధిలోని స్థానిక విద్యార్థులకు గురుకుల ప్రవేశ పరీక్షలో 50శాతం సీట్లను కేటాయిస్తున్నారు. మిగిలిన 50శాతం సీట్ల భర్తీకి ఉమ్మడి జిల్లాలోని పేద విద్యార్థులకు కేటాయిస్తున్నారు. ఇక్కడి గురుకుల స్కూల్స్‌, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లను ఈ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రులు ఓ వరంగా భావిస్తున్నారు. ప్రభుత్వం కలిపిస్తున్న అవకా శాలను ఎందరో విద్యార్థులు అందిపుచ్చుకుంటున్నారు. ఇక్కడ చదువుకున్న అనేక మంది విద్యార్థులు ఇంజినీర్లు, డాక్టర్లు, వివిధ హోదాల్లో ఇప్పటికే స్థిరపడి పోయారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పతకాలు సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు.

ఎంబీబీఎస్‌ సీటు సాధించా..

– కె.ప్రవీణ్‌, పెద్దవంగర

మరిపెడ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ కళాశా లలో చదివి ఎంబీబీఎస్‌ సీటు సాధించా. గత సంవత్సరం నిర్వహించిన నీట్‌ పరీక్ష రాయగా 457 ర్యాంక్‌ వచ్చింది. సంగారెడ్డి ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాను. ప్రోత్సహించిన గురుకుల స్కూల్‌ టీచర్లు, తల్లిదండ్రులకు ఎళ్లవేళల కృతజ్ఞునుడిగా ఉంటాను.

Updated Date - 2023-03-19T00:07:21+05:30 IST