Share News

సింగరేణిలో ‘సమరం’

ABN , Publish Date - Dec 14 , 2023 | 12:04 AM

సింగ రేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందడి హోరెత్తు తోంది. ఆయా సంఘాల నేతలు ప్రచారంలో నిమగ్న మయ్యారు. బొగ్గు బావుల్లో విస్తృతంగా పర్యటి స్తూ కార్మికుల ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

సింగరేణిలో ‘సమరం’

27న కోల్‌బెల్ట్‌లో ఎన్నికలు

ఆరేళ్ల తర్వాత ‘గుర్తింపు’ పోరు

పోటీ పడుతున్న 13 కార్మిక సంఘాలు

11 ఏరియాల్లో 39,832 మంది కార్మికులు

హామీలతో ఆకట్టుకునేందుకు నేతల ప్రయత్నాలు

భూపాలపల్లి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సింగ రేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందడి హోరెత్తు తోంది. ఆయా సంఘాల నేతలు ప్రచారంలో నిమగ్న మయ్యారు. బొగ్గు బావుల్లో విస్తృతంగా పర్యటి స్తూ కార్మికుల ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జాతీయ కార్మిక సంఘాలు ప్రచారం చేస్తుండగా, మరో అవకాశం ఇస్తే కార్మికు లకు అండగా ఉంటామని టీబీజీకేఎస్‌ కోరుతోంది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ప్రధా న సంఘాల నేతలు తమదైన హామీలతో కార్మికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈనెల 27న సింగరేణి ఎన్నికలు జరగనుండా అన్ని ప్రధాన పార్టీ లకు ఇవి సవాల్‌గా మారాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో కోల్‌బెల్ట్‌ ఏరియాలో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. 12 స్థానాల్లో 11 చోట్లా ఆ పార్టీయే గెలిచింది. దీంతో కోల్‌బెల్ట్‌లో గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనుబంధ ఐఎన్‌టీయూసీ విజ యం కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే వరుసగా 2012, 2017లో రెండుసార్లు గెలిచిన బీఆర్‌ ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ హ్యట్రిక్‌ సాధించి రికార్డు సృష్టించాలని ప్రయత్నిస్తోంది. ఐఎన్‌టీయూసీ, టీబీజీ కేఎ్‌స్‌, ఏఐటీయూసీ, బీఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌తోపాటు 13 సంఘాలు సింగరేణి ఎన్నికల బరిలో ఉన్నాయి.

కసరత్తు ఇలా...

బీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘం టీబీజీకేఎస్‌ 2017 అక్టోబరు 5న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. రెండేళ్ల కాలపరిమితితో కేంద్ర కార్మిక శాఖ టీబీజీకేఎస్‌ గుర్తింపునిచ్చింది. కాలపరిమితి ముగిసినా ఎన్నికల నిర్వహించకపోవటంతో ఏఐటీయూసీ కోర్టును ఆశ్ర యించింది. ఈ క్రమంలో ఎట్టకేలకు హైకోర్టు ఆదేశా లతో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ అక్టోబరు 27న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అక్టోబ రు 15 వరకు నామినేషన్లు కూడా స్వీకరించారు. అయితే.. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు రావటంతో సింగరేణి ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదని ఆ సంస్థ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల అనంతరం డిసెంబరు 27న ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 4న హైదరాబాద్‌లోని డిప్యూటీ లెబర్‌ అధికారి కార్యాలయంలో అన్ని కార్మిక సంఘాల నేతలతో డీఎల్‌వో శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. డిసెంబరు 27 ఎన్నికలు నిర్వహించేందుకు తీర్మానించారు. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ముగియటంతో ఆయా కార్మిక సంఘాలకు గుర్తులు కూడా కేటాయించారు.

మొత్తం 11 ఏరియాల్లో 39,832 మంది కార్మికులు ఉన్నట్టు సింగరేణి యాజమాన్యం జాబితా అందించింది. దీన్ని అనుసరించి 11 ఏరియాల్లో 84 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 27వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు రాత్రి 7 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. బ్యాలెట్‌ పద్ధతినే ఎన్నికలు జరగనున్నాయి. రాత్రి 11.30 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

వినూత్న హామీలతో ముమ్మర ప్రచారం

సింగరేణి గుర్తింపు ఎన్నికలు 1998 నుంచి 2017 వరకు ఆరు పర్యాయాలు జరిగాయి. 1998, 2001, 2007లో సీపీఐ అనుబంధ ఏఐయూటీసీ, 2012, 2017లో బీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ విజ యం సాధించాయి. 2003లో మాత్రమే కాంగ్రెస్‌ అనుబంధ ఐఏన్‌టీయూసీ గెలి చింది. 2017 ఎన్నికల్లో పోటీ చేయకుం డా ఏఐటీయూసీకి ఐఎన్‌టీయూసీ మద్దతు ఇచ్చింది. అయితే.. ఆ ఎన్నికల్లో ఏఐటీయూసీ భూపాలపల్లి, మందమర్రి ఏరియాలో మాత్రమే ప్రాతినిధ్య సం ఘంగా గెలిచింది. మిగతా తొమ్మిది చోట్లా టీబీజీకేఎస్‌ విజయం సాధించి సింగరేణి గుర్తిం పు సంఘంగా నిలిచింది. దీంతో ఈసారి ఒంటరిగానే బరిలో దిగి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఐఎన్‌టీయూసీ ఉంది. దీనికి తోడు కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో కార్మికులను తమవైపు తిప్పుకునేందుకు ఐఎన్‌టీయూసీ వ్యూహాలకు పదను పెడుతోంది. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చినట్టుగానే సింగరేణి ఎన్నికల్లోనూ ఐఎన్‌టీయూసీ కార్మికులకు ఆరు గ్యారెంటీలను ఇస్తూ ప్రచారం చేస్తోంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసిన సీపీఐ సింగరేణి ఎన్నికల్లో ఒంటరి పోరుకే మొగ్గు చూపు తోంది. సీఐటీయూసీ, బీఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌ తదితర సంఘాలు కూడా బరిలో నిలుస్తున్నాయి. అన్ని సంఘాలు హామీలను ఇస్తున్నాయి. తాము గెలిస్తే ఆదాయ పన్ను మాఫీకి కృషి చేస్తామని అన్ని సంఘాలూ చెబుతూ కార్మికుల ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాగే నూతనంగా భూగర్భ గనులను ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తా మని హామీలు కూడా ఇస్తున్నాయి. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, కార్మికు లందరికీ సొంతింటి పథకం కింద 250 గజాల స్థలం తోపాటు రూ.20లక్షల వడ్డీలేని రుణం ఇస్తామని అంటున్నాయి. కార్మికులు చెల్లించే ఆదాయ పన్నును సింగరేణి యాజమాన్యంతో కట్టిస్తామని, ఏరియా అస్పత్రులను ఆధునీకరించి సూపర్‌ స్పెషాలిటీ ఆస్ప త్రులుగా మారుస్తామని, మహిళా కార్మికులకు మౌలి క సౌకర్యాలు కలిస్తామని, వారికి సర్‌ఫేస్‌ ఉద్యోగం ఇప్పిస్తామని, కేడర్‌ స్కీంలు అమలు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి ఉన్న రూ.29వేల కోట్లు వసూలు చేస్తామని, మారు పేర్ల సమస్య పరిష్క రిస్తామని.. ఇలా అనేక హామీలతో కార్మిక సంఘాల నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

పార్టీలకు పెను సవాల్‌

సింగరేణిలో ఈ నెల 27న జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు తలపడుతున్నాయి. ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలకు అనుబంధంగా అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి. సింగరేణి ఎన్నికల్లో గెలుపొటములను అన్ని పార్టీలూ చాలెంజ్‌గా తీసుకుంటున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. 2017లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ పోటీ చేయకుండా ఏఐటీయూసీకి మద్దతు ఇవ్వడంతో టీబీజీకేఎస్‌, ఏఐటీయూసీ సంఘాల మధ్య ద్విముఖ పోటీ జరిగింది. ఈసారి సింగరేణి ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఏర్పడనుంది. టీబీజీకేఎస్‌, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీల మఽధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. బీఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూసీ లాంటి జాతీయ సంఘాలు కొన్ని ఏరియాల్లో పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా 11 ఏరియాల్లో మాత్రం టీబీజీకేఎస్‌, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ మధ్యే పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కార్మిక సంఘం నేతలతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి, గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు దిశ నిర్దేశం చేశారు. అలాగే ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతరామయ్య నేతృత్వంలో కార్మిక నేతలు సమావేశమయ్యారు. గుర్తింపు సాధించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఐఎన్‌టీయూసీ ఆరు గ్యారెంటీల కార్డును విడుదల చేసి సింగరేణి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కొత్త ప్రభుత్వంలో కోల్‌బెల్ట్‌ ఏరియాలోని మంథని నుంచి గెలిచిన శ్రీధర్‌బాబు ఒక్కరే మంత్రిగా ఉన్నారు. అలాగే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సైతం సింగరేణి కార్మికులను ప్రభావితం చేయకలిగే అవకాశం ఉంది. దీంతో మంత్రులు, కోల్‌బెల్ట్‌ ఏరియా ఎమ్మెల్యేలు ఈసారి ఐఎన్‌టీయూసీ కోల్‌బెల్ట్‌లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Updated Date - Dec 14 , 2023 | 12:04 AM