నకిలీ విత్తనాలతో దళారుల దందా
ABN , First Publish Date - 2023-06-13T00:06:04+05:30 IST
వానాకాలం సాగు మొదలు కాకముందే రైతులకు నకిలీ విత్తనాల బెడద ఎదురవుతోంది. నాలుగు రాష్ట్రాల్లో నకిలీ వి త్తనాలను విక్రయించే రెండు ముఠాలకు చెందిన 15 మందిని పోలీసులు ఇటీవల అరెస్టు చేసి వారి నుంచి రూ.2కోట్ల విలువైన 120 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొన్న సంగతి తెలిసిందే.
ముఠాలుగా ఏర్పడి విక్రయాలు
పొరుగు రాష్ట్రాల నుంచి రాక
దొంగచాటుగా రవాణా
టాస్క్‌ఫోర్సు టీమ్‌లున్నా అమ్మకాలు
ఈ వానాకాలంలో 2.60 లక్షల ఎకరాల్లో సాగు
40వేల క్వింటాళ్ల సీడ్స్ అవసరం
హనుమకొండ, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : వానాకాలం సాగు మొదలు కాకముందే రైతులకు నకిలీ విత్తనాల బెడద ఎదురవుతోంది. నాలుగు రాష్ట్రాల్లో నకిలీ వి త్తనాలను విక్రయించే రెండు ముఠాలకు చెందిన 15 మందిని పోలీసులు ఇటీవల అరెస్టు చేసి వారి నుంచి రూ.2కోట్ల విలువైన 120 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొన్న సంగతి తెలిసిందే. జిల్లాలో పలు ఇతర చోట్ల గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాలను ఇలాంటి ముఠాలు విక్రయిస్తున్నట్టు సమాచారం.
సాగుతున్న దందా
నాసిరకం విత్తనాలకు అడ్డుకట్టకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏటా వీటి దందా కొనసాగుతూనే ఉంది. సరిహద్దు రాష్ట్రాల నుంచి యఽథేచ్ఛగా కాలం చెల్లిన, నాసిరకం విత్తనాలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మించి కొందరు వ్యాపారులు అన్నదాతల్ని మోసం చేస్తున్నారు. జిల్లాలో పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు ప్రధానంగా సాగవుతాయి. దీనిని ఆసరా చేసుకొని నకిలీ వ్యాపారులు ఈ పంటలకు సంబంధించిన నకిలీ విత్త నాలను విచ్చలవిడిగా అమ్ముతున్నారు. కొంత మంది వ్యాపారులు ఏజెంట్లను పెట్టుకొని నేరుగా గ్రామాల్లోకి విత్తనాలను పంపి అమ్ముతున్నారు. ప్రముఖ కంపెనీల బొమ్మలు చూపించి విక్రయిస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి..
నకిలీ విత్తనాలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, చత్తీ్‌సగఢ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాల నుంచి వస్తోన్న విత్తనాలను జిల్లాలోకి గట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి తరలించి రహస్య ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు.
దళారులు గ్రామాలకు వెళ్లి రైతులకు మాయమాటలు చెప్పి వీటిని విక్రయిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు ఎక్కువ శాతం రైళ్లద్వారా రవాణా అవుతున్నట్టు సమాచారం. జిన్నింగ్ మిల్లుల నుంచి అక్రమార్కులు భారీగా పత్తి విత్తనాలు కొంటున్నారు. మార్కెట్‌లో పేరున్న కంపెనీల ప్యాకెట్లు తయారు చేయించి, వాటిపై లేబుళ్లు, ధర, క్రమ సంఖ్య, గడవు తేదీతో పాటుగా క్యూఆర్ కోడ్ కూడా ముద్రిస్తున్నారు.
కొరత ఆసరాగా..
నైరుతి పలకరించగానే రైతాంగం ఒక్కసారిగా సాగులోకి దిగుతుంది. దాంతో సీజన్ ఆరంభంలో కొంత విత్తన కొరత ఏర్పడుతుంది. ఇదే అదనుగా దళారులు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టేందుకు రంగంలోకి దిగుతున్నారు. నకిలీ విత్తన తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఆచరణలో అది పెద్దగా కనిపించడం లేదు. వ్యవసాయ, పోలీసు శాఖ అడపాదడపా చర్యలు చేపడుతున్నా కట్టడి కావడం లేదు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభు త్వం ఆదేశించినా అది అమలు కావడం లేదు. ప్రతీ సం వత్సరం ఏప్రిల్, మే నెలల్లో అధికారులు డీలర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. రైతులకు మేలి రకం విత్తనాలు విక్రయించేలా ఆదేశాలు జారీ చేస్తారు. ఈ ఏడాది జూన్ గడుస్తున్నా సమావేశాలు నిర్వహించలేదు.
టాస్క్‌ఫోర్సు టీమ్‌లు
జూన్ మొదటివారం విత్తనాలు నాటే సమయం కావడంతో రైతులు ముందుగానే విత్తనాలు కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో నకిలీల బారిన పడకుండా జిల్లా వ్యవసాయాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా స్థాయిలో రెండు టాస్క్‌ఫోర్సు టీమ్‌లను ఏర్పాటు చేశారు. పూర్తిగా వ్యవసాయాధికారులతోనే ఒక టీమ్ ను ఏర్పాటు చేయగా, వ్యవసాయశాఖ, పోలీసులు, రెవెన్యూశాఖల అధికారులతో మరో టీమ్‌ను నియమించారు. ఈ టీమ్‌లు ఇప్పటికే తమ పని మొదలు పెట్టాయని, గ్రామాల్లో నకిలీ విత్తన విక్రయాలపై నిఘా ఉంచాయని వ్యవసాయాధికారులు తెలిపారు. ప్రతీ ఏటా విత్తన ప్రమాణాలు పాటించని కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నామంటున్నారు.
విత్తన అవసరం
జిల్లాలో 2.62 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందుకు 38,973 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేసింది. ఈ వానాకాలంలో 1.50 లక్షల ఎకరాల్లో వరి, 4,012 ఎకరాల్లో మొక్కజొన్న, 85వేల ఎకరాల్లో పత్తి, 20వేల ఎకరాల్లో మిర్చి, 300 ఎకరాల్లో నూనె గింజలు, 700 ఎకరాల్లో తృణధాన్యాలు సాగు అంచనా. ఇందుకోసం 37,500 క్వింటాళ్ల వరి, 20 క్విం టాళ్ల మిర్చి, 480 క్వింటాళ్ల మొక్క జొన్న, 765 క్వింటాళ్ల పత్తి, 180 క్వింటాళ్ల నూనె గింజలు, 28 క్వింటాళ్ల తృణధాన్యాల విత్తనాలు అవసరమవుతాయని అంచనా.
నకిలీ విత్తనాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలంటే..
జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్టు తెలిస్తే ఆ సమారాన్ని పోలీసు కమిషనర్ (సీపీ)కు మెసేజ్ రూపంలో వాట్సాప్ చేయవచ్చు. లేదా పోలీసు కమిషనరేట్ కార్యాలయానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇలా సమాచారం ఇచ్చినవారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. లేదా సంబంధిత పోలీసు స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. లేదా సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారికి గానీ, జిల్లా వ్యవసాయాధికారి దృష్టికి గానీ తీసుకువెళ్లవచ్చు. సమాచారం అందగానే అధికారులు ఈ విషయాన్ని టాస్క్‌ఫోర్సుకు తెలియచేస్తారు. వారు వెంటనే రంగంలోకి దిగి నకిలీ విత్తనాలను విక్రయించే ముఠాల ఆటకట్టిస్తారు.
బిల్లు ఖచ్చితంగా తీసుకోవాలి
– దామోదర్ రెడ్డి, వ్యవసాయ సహాయ సంచాలకుడు, హనుమకొండ జిల్లా
నకిలీ విత్తనాలు విక్రయించకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. పత్తి, మిర్చి విత్తనాలు కొనే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రైతులు లైసెన్సు కలిగిన అధీకృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనాలి. విత్తనాలు కొనగానే తప్పనిసరిగా లాట్ నెంబర్, వెరైటీ, ఇతరత్రా పూర్తి వివరాలతో కూడిన బిల్లు తీసుకోవాలి. బిల్లుపై డీలర్‌తో పాటు రైతు కూడా సంతకం చేయాలి. పంట దిగుబడి పూర్తయ్యేంత వరకు విత్తనాల బిల్లును పారవేయకుండా ఉంచుకోవాలి. ఇందు వల్ల నకిలీ విత్తనాల వల్ల పంట నష్టం జరిగితే పరిహారం పొందడానికి వీలుంటుంది. లైసెన్సు లేకుండా ఎక్కడైనా గ్రామాల్లో విత్తనాలు అమ్ముతుంటే వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకురావాలి. ఎలాంటి అనుమానం కలిగినా మండలంలోని విత్తన అధికారులు లేదా, వ్యవసాయ విస్తరణాధికారులు, లేదా సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.