Share News

కాంగ్రెస్‌ కంచుకోటల్లో పునర్‌వైభవం

ABN , First Publish Date - 2023-12-05T00:02:18+05:30 IST

కాంగ్రెస్‌ కంచుకోటల్లో పునర్‌వైభవం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించ డంతో శ్రేణుల్లో జోష్‌ కనిపిస్తోంది. జిల్లాలోని పూర్తి స్థాయి నియోజకవ ర్గాలైన మహబూబాబాద్‌, డోర్నకల్‌తో పాటు రెండేసి మండలాల ప్రాతినిధ్య ములుగు, ఇల్లందు, పాలకుర్తి నియోజకవర్గాల్లో సైతం కాంగ్రెస్‌ గెలిచిన నేపథ్యంలో ఆ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది.

కాంగ్రెస్‌ కంచుకోటల్లో పునర్‌వైభవం

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఈ జోష్‌ కొనసాగేనా..?

గ్రామాల నుంచి మండలాల వరకు ఆశావహులు

మునిసిపాలిటీల కైవసానికి అర్బన్‌ నేతల కసరత్తు

మహబూబాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ కంచుకోటల్లో పునర్‌వైభవం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించ డంతో శ్రేణుల్లో జోష్‌ కనిపిస్తోంది. జిల్లాలోని పూర్తి స్థాయి నియోజకవ ర్గాలైన మహబూబాబాద్‌, డోర్నకల్‌తో పాటు రెండేసి మండలాల ప్రాతినిధ్య ములుగు, ఇల్లందు, పాలకుర్తి నియోజకవర్గాల్లో సైతం కాంగ్రెస్‌ గెలిచిన నేపథ్యంలో ఆ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారం చేపట్టాలని గ్రామ స్థాయి నాయకుల నుంచి మండల స్థాయి నాయకులు, అర్బన్‌ ప్రాంతాల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు ఉవ్విల్లూ రుతున్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మహబూబాబాద్‌, డోర్నకల్‌ అసెం బ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్‌కు పట్టుగొమ్మలుగా కొనసాగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి, దివంగత వైఎస్‌.రాజశేఖరరెడ్డి సొంత నియో జకవర్గమైన పులివెందుల తరహాలోనే మహబూబాబాద్‌, డోర్నకల్‌ కాంగ్రెస్‌ కు కంచుకోటలుగా కొనసాగాయి.

ఆధిపత్య పోరుతో కోటలకు బీటలు..

కాంగ్రెస్‌లో ఆధిపత్య రాజకీయాలు, వర్గపోరు వెరసి మానుకోట, డోర్నకల్‌ కాంగ్రెస్‌ కంచుకోటలు బీటలువారడం ఆరంభమైంది. మూకుమ్మడిగా ప్రతిపక్షాలు కాంగ్రెస్‌పై మిత్రపక్షాలుగా మారి పోటీ చేయడం ఆరంభించాయి. 1994లో సీపీఐ నుంచి బండి పుల్లయ్య, 1999లో తెలుగుదేశం నుంచి శ్రీరాం భద్రయ్య, 2004లో తిరిగి టీడీపీ నుంచి వేం నరేందర్‌రెడ్డి గెలిచారు. 2009లో ఎస్టీకి రిజర్వు అయిన ఈ నియోజకవర్గం నుంచి మాలోతు కవిత కాంగ్రెస్‌ తరుపున ప్రాతినిధ్యంలోకి వచ్చి కాంగ్రెస్‌ సింబల్‌ ఓటింగ్‌ తగ్గని కంచుకోట పేరును నిలిపారు. ఆపై తెలంగాణ ఆవిర్భావంతో ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్‌కు ఈ నియోజకవర్గ ప్రజలు గులాబీ కార్పెట్‌ పరిచారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు బానోత్‌ శంకర్‌నాయక్‌ బీఆర్‌ఎస్‌ నుంచి విజయం సాధించారు. డోర్నకల్‌ కాంగ్రెస్‌ కంచుకోటలో మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే 2009 ఎన్నికలు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీని అందలం ఎక్కించాయి. ఆపై తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తొలి ఎన్నికల్లో ఉద్యమ పార్టీ గాలి పనిచేయలేదు. యథా కాంగ్రెస్‌ అభ్యర్థి డీఎస్‌.రెడ్యానాయక్‌కు అక్కడి ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల్లో అక్కడ కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఆయన బీఆర్‌ఎస్‌లో చేరి తిరిగి 2018లో ఆ పార్టీ నుంచే విజయం సాధించారు.

కంచుకోటల్లో 2023 పునర్‌వైభవం..

జిల్లాలో సింబల్‌ ఓటింగ్‌ తగ్గని కాంగ్రెస్‌ కంచుకోటలైన మహబూబాబాద్‌, డోర్నకల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి 2023 అసెంబ్లీ ఎన్నికలు పునర్‌వైభవం దక్కించాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రజలు హస్తం గుర్తు అభ్యర్థులైన డాక్టర్‌ భూక్య మురళీనాయక్‌, డాక్టర్‌ జాటోతు రాంచంద్రునాయక్‌లకు తిరుగులేని మెజారిటీ ఇచ్చి గెలిపించారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు జనం జేజేలు పలికారు. అధికార పక్షం బీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగిన మహబూబాబాద్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, డోర్నకల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే డీఎస్‌.రెడ్యానాయక్‌లను తిరస్కరించిన జనం.. కాంగ్రెస్‌ నుంచి రంగంలో దిగిన యువ డాక్టర్లకు పట్టం కట్టి మార్పు వైపు మొగ్గు చూపారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు సెగ్మెంట్‌లలోనూ ఏ పార్టీకి దక్కని మెజారిటీ ఈసారి మహబూబాబాద్‌ నుంచి పోటీ చేసిన డాక్టర్‌ భూక్య మురళీనాయక్‌కు 50,171 ఓట్ల మెజారిటీ లభించింది. డోర్నకల్‌లో డాక్టర్‌ జాటోతు రాంచంద్రునాయక్‌కు 53,131 ఓట్ల మెజారిటీ లభించింది. కాంగ్రెస్‌ గాలి సునామిలా దూసుకురావడంతో ఈ రెండు సెగ్మెంట్‌లలో ఉద్యమ పార్టీ కారు పల్టీ కొట్టింది.

ఇదే జోష్‌ స్థానిక సంస్థలపై..

పదేళ్ల తర్వాత మానుకోటలో... ఐదేళ్ల తర్వాత డోర్నకల్‌లో తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ భారీ మెజారిటీ ఈ రెండు నియోజక వర్గాల పార్టీ శ్రేణుల్లో పూర్తి స్థాయి జోష్‌ నింపింది. ప్రతిపక్షాల్లోని చోట... మోట ఆశావహులను సైతం ఆలోచింప జేస్తోంది. ఈ ఏడాది మొత్తం వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలు కూడా ఉండడంతో పార్టీ శ్రేణులను చేజారకుండా చూసుకునేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలను రచించే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం 18 మండలాలు, 461 గ్రామ పంచాయతీలకు తోడు నాలుగు అర్బన్‌ మునిసిపాలిటీలు ఉండ డంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డుమెంబర్‌ మొదలుకుని సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్‌ లాంటి పదవుల్లో ప్రాతినిధ్యం కోసం ఆశావహులు ఉవ్విల్లూరు తున్నారు. ఇక మహబూబాబాద్‌, డోర్నకల్‌, మరిపెడ, తొర్రూరు మునిసిపాలిటీల్లో అర్బన్‌ నాయకులు వార్డు కౌన్సిలర్‌ నుంచి చైర్మన్‌, నామినేటెడ్‌ కోఆప్షన్‌ పదవుల కోసం దస్తీలు వేసుకుంటున్నారు. తాము గెలిపించిన కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్‌లో ఏదైనా కుర్చీపై కూర్చోపెడుతుందని ఆశ పడుతున్నారు. ఆ కోణంలోనే గ్రామాలు, మండలాల్లో ఇప్పటి నుంచే సందడి ఆరంభమైంది. ఈ జోష్‌ స్థానిక సంస్థల్లో కొనసాగుతుందా...? లేక అనూహ్యంగా ఓటమి చవిచూసిన గులాబీ పార్టీ తిరిగి నిలదొక్కుకునేందుకు సకల శక్తులు ఒడ్డుతుందా..? అనేది వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-12-05T00:02:19+05:30 IST