హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర రోడ్‌మ్యాప్‌ ఖరారు

ABN , First Publish Date - 2023-02-05T00:32:17+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న హాత్‌సేహాత్‌ జోడో యాత్ర రోడ్‌మ్యాప్‌ ఖరారైంది.

హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర రోడ్‌మ్యాప్‌ ఖరారు
కాంగ్రెస్‌నేత గండ్ర సత్యనారాయణరావుతో కలిసి పాదయాత్ర వివరాలను వెల్లడిస్తున్న ఎమ్మెల్యే సీతక్క

రెండు రోజులపాటు ములుగు నియోజకవర్గంలో కొనసాగింపు

ములుగు, ఫిబ్రవరి 4: టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న హాత్‌సేహాత్‌ జోడో యాత్ర రోడ్‌మ్యాప్‌ ఖరారైంది. ఈనెల 6న ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధానం నుంచి ఈపాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈమేరకు ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క శనివారం వివరాలను వెల్లడించారు. 6వ తేదీ ఉదయం 11 గంటలకు సమ్మక్క-సారలమ్మల గద్దెలను రేవంత్‌రెడ్డి దర్శించుకోనున్నారు. 12 గంటలకు పాదయాత్రను మొదలుపెట్టి సాయంత్రం 4.30 గంటలకు గోవిందరావుపేట మండలం పస్రాకు చేరుకుంటారు. అక్కడ జరిగే కార్నర్‌ మీటింగ్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. జంగాలపల్లి క్రాస్‌రోడ్డు మీదుగా వెంకటాపూర్‌(రామప్ప) మండలం పాలంపేటకు రాత్రి 8 గంటల వరకు చేరుకుంటారు. రాత్రి అక్కడ బస చేస్తారు. 7వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని సందర్శించి రుద్రేశ్వరుడికి పూజలు చేస్తారు. వెంకటాపూర్‌ మండలం రామాంజాపురం, భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం మీదుగా సాయంత్రం 6 గంటలకు ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ఇక్కడి గాంధీపార్కు కూడలిలో జరిగే కార్నర్‌ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడి రాత్రి ఇక్కడే బస చేయనున్నారు. ఈమేరకు యాత్రకు అనుమతితోపాటు భద్రత కల్పించాలని ఎస్పీ గౌస్‌ఆలంను సీతక్క కోరారు. స్వయంగా కార్యాలయానికి వెళ్లి పాదయాత్ర వివరాలను అందజేశారు. ఇదేక్రమంలో మండలాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ పాదయాత్ర విజయవంతం కోసం శ్రేణులను సమీకరిస్తున్నారు. కాంగ్రెస్‌ భూపాలపల్లి ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు.

Updated Date - 2023-02-05T00:32:19+05:30 IST