బాలికలకు భరోసా
ABN , First Publish Date - 2023-12-05T23:35:00+05:30 IST
ఉదయం ఇంటి నుంచి బడికి వెళ్లిన చిన్నారులు, ఉద్యోగాలకు వెళ్లిన మహిళ లు సాయంత్రం ఇంటికి క్షేమంగా చేరే వరకు తల్లిదం డ్రులకు నిత్యం నిరీక్షణే. సమాజంలో నానాటికి వయ సుతో సంబంధం లేకుండా బాలికలు, యువతులు, మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలు, దాడులే వారిలోని ఆందోళనకు కారణాలు.
ఆత్మస్థైర్యం నింపేందుకు కరాటేలో శిక్షణ
పాఠశాలల్లో అమలుకు నిధులు మంజూరు
మూడు నెలల పాటు తర్ఫీధునిస్తున్న శిక్షకులు
జిల్లాలో 77 విద్యాలయాల్లో కొనసాగుతున్న శిక్షణ
జఫర్‌గడ్, డిసెంబరు 5: ఉదయం ఇంటి నుంచి బడికి వెళ్లిన చిన్నారులు, ఉద్యోగాలకు వెళ్లిన మహిళ లు సాయంత్రం ఇంటికి క్షేమంగా చేరే వరకు తల్లిదం డ్రులకు నిత్యం నిరీక్షణే. సమాజంలో నానాటికి వయ సుతో సంబంధం లేకుండా బాలికలు, యువతులు, మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలు, దాడులే వారిలోని ఆందోళనకు కారణాలు. అయితే ఇలాంటి ఆకతాయిల ఆగడాలు, వేధింపులు, దాడులు వంటి ఘటల నుంచి తప్పించుకోవాలంటే ఆత్మరక్షణ విద్య తప్పనిసరి. దీనిని గుర్తించిన ప్రభుత్వం పాఠశాలల్లో బాలికల స్థాయి నుంచే స్వీయ రక్షణ, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఈ ఏడాది నుంచి శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరిలో నెల రోజుల పాటు జిల్లాలోని 110 విద్యాలయాల్లో బాలికలకు కరాటేలో శిక్షణ ఇచ్చారు. తిరిగి రెండో విడత నవంబర్ నుంచి ‘రాణి ఝాన్సిలక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్’ పేరుతో ఎంపిక చేసిన పాఠశాలల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. శిక్షణలో భాగంగా బాలికలకు కరాటే, కుంగుఫూ, జూడో తదితర అంశాలపై పట్టు సాధించేలా తర్ఫీదునిస్తున్నారు.
జిల్లాలో 77 పాఠశాలల్లో కరాటే శిక్షణ...
జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశా లలు, కస్తూర్బా బాలికల విద్యాలయాలకు సంబంధిం చి మొత్తం 77 విద్యాలయాలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలోని 12 కస్తూర్బా విద్యాలయాల్లోని 2,900 మంది బాలికలతో పాటు మిగతా 65 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన మొత్తం సుమారు 10 వేల మంది బాలికలకు ఆత్మరక్షణ కోసం కరాటే శిక్షణ ఇస్తు న్నారు. 6 నుంచి 10 తరగతులు చదివే బాలికల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టగా, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్ వరకు ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అక్టోబర్ నెల నుంచే ఈ కరాటే శిక్షణను ప్రారంభించాల్సి ఉండగా పరీక్షలు, దసరా సెలవులు, ఎన్నికల సందడి నేపథ్యంలో నవంబర్ చివరి వారం నుంచి ఆయా విద్యాలయాల్లో బాలికలకు శిక్షణ కొన సాగుతోంది. మూడు నెలల్లో 36 శిక్షణ తరగతుల చొప్పున జనవరి చివరి వరకు నిర్వహించేలా ప్రణాళిక లను సిద్ధం చేశారు. వారంలో మూడు రోజుల పాటు నెలకు 12 తరగతులు చొప్పున ఆయా విద్యాలయాల్లో వివిధ అకాడమీలకు చెందిన సుమారు 50 మంది నిపుణులైన కరాటే శిక్షకులచే తర్పీదు ఇప్పిస్తున్నారు.
ఆత్మస్థైర్యం నింపేందుకు...
బాలికలకు పాఠశాల స్థాయి నుంచే కరాటేలో శిక్షణ ఇవ్వడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు మానసిక దృఢత్వం పెంపొందనుంది. విద్యార్థినులు, యువతుల రక్షణ కోసం షీ టీంలు, తదితర వాటితో వివిధ రకాలుగా తోడ్పాటునందిస్తున్నాయి. అదే కోవ లో వారికి స్వీయరక్షణ కల్పిస్తూ భరోసా నింపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర విద్యా శాఖ ప్రభుత్వ విద్యాలయాల్లో ఆత్మరక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. బాలికల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తోంది. అను చిత పరిస్థితులు ఎదురైనపుడు బాలికలే స్వయంగా ప్రతిఽఘటిం చడంతో పాటు ప్రమాదం నుంచి బయటపడే మెళుకువలను ఈ శిక్షణలో నేర్పిస్తున్నారు. శిక్షకులకు నెలకు రూ.5 వేల చొప్పున మూడు నెలలకు ఒక్కొక్కరికి రూ.15 వేలు పారితోషికం చెల్లించనున్నారు.
ఆత్మస్థైర్యానికి శిక్షణ ఎంతో ఉపయోగం..: ఎస్.అఖిల, కస్తూర్బా బాలికల విద్యాలయం, జఫర్‌గడ్
కరాటే శిక్షణ ఆత్మస్థైర్యం నింపేందుకు దోహదపడుతోంది. కరాటే, కుంగుఫూ, జూడో వంటి అంశాల్లో మాస్టారు శిక్షణతో పాటు స్వీయరక్షణకు మెళుకువులను నేర్పిస్తున్నారు. ప్రతీ రోజు సాయంత్రం వేళల్లో సాధన చేస్తున్నాం. శిక్షణ ద్వారా భయం పోయి మనోఽధైర్యం పెరుగుతోంది. ఎలాంటి అనుచిత పరిస్థితులు ఎదురైనా ప్రతిఘటించి తమను తాము రక్షించుకునేందుకు ఇస్తున్న శిక్షణ ద్వారా ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతోంది. ఎంతో ఉత్సాహంగా ఆసక్తితో నేర్చుకుంటున్నాం. ఈ కరాటే శిక్షణలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తున్నా.
మానసిక దృఢత్వం పెంపొందుతుంది..: గౌసియా బేగం, సెక్టోరియల్ అధికారిణి, జనగామ
కరాటే శిక్షణ బాలికల్లో మానసిక ధృడత్వాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది. జిల్లాలో గత నెల నుంచి ఎంపిక చేయబడిన మొత్తం 77 ప్రభుత్వ విద్యాలయాల్లో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కొనసాగుతోంది. మూడు నెలల పాటు కరాటే, జూడో, కుంగుఫూ, వంటి ఆత్మరక్షణ విద్యలతో పాటు స్వీయరక్షణకై మెళకువల గురించి శిక్షణ ఇస్తున్నారు. సుమారు 10 వేల మంది బాలికలకు కరాటేలో నిష్ణాతులైన సుమారు 50 మంది శిక్షకులచే తర్ఫీదు ఇప్పిస్తున్నాం. బోధనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వారి సమయాన్ని వృథా చేయకుండా బాలికలకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాం. బాలికల శిక్షణ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పీడీ/పీఈటీ లేదా ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో కొనసాగుతోంది.