పెట్టుబడికి పైసలొచ్చె..
ABN , First Publish Date - 2023-06-26T01:00:37+05:30 IST
జిల్లాలో ‘రైతుబంధు’ పంపిణీకి రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని వేసేందుకు వ్యవసాయ శాఖ కసర త్తు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి రైతుబంధు కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లా లో ఎంతమంది రైతులకు లబ్ధి జరగనుందనే వివరాలను ప్రభుత్వం ఆయా జిల్లాల వ్యవసాయాధికారులకు పంపించింది.
‘రైతుబంధు’ నిధులు విడుదల చేసిన సర్కారు
జిల్లాలో 1,85,937 మందికి రూ.206.69 కోట్లు మంజూరు
యాసంగితో పోలిస్తే రూ. 39.48 లక్షలు పెరిగిన సాయం
నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ
జూన్ 18 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారందరికీ లబ్ధి
కొత్త వారికి జూలై 3లోగా దరఖాస్తుకు అవకాశం
జనగామ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ‘రైతుబంధు’ పంపిణీకి రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని వేసేందుకు వ్యవసాయ శాఖ కసర త్తు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి రైతుబంధు కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లా లో ఎంతమంది రైతులకు లబ్ధి జరగనుందనే వివరాలను ప్రభుత్వం ఆయా జిల్లాల వ్యవసాయాధికారులకు పంపించింది. జూన్ 18లోపు రి జిస్ట్రేషన్లు చేసుకున్న వారు పెట్టుబడి సాయాని కి అర్హులుగా పేర్కొంది. ఈ లెక్కన జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 1,85,937మంది రైతుల కు గానూ రూ.206.69 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. మొదటగా ఎకరం భూమి ఉన్న రైతుల డబ్బులు ఖాతాల్లో జమకానున్నాయి. ఆ తర్వాత విడతల వారీగా 10 రోజుల్లోగా మిగతా అందరి రైతులకు పడనున్నాయి. జూన్1 నుంచి వానాకాలం సీజన్ ప్రారంభం కాగా జిల్లాలో వ్యవసాయ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
జిల్లాలో 1,85,937 మంది రైతులకు లబ్ధి
పెట్టుబడి సాయం కింద ఈ వానాకాలం సీజన్‌కు జిల్లాలో 1,85,937 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. వీరికి మొత్తం రూ.206,69,46,069 కోట్లు ఖాతాల్లో జమకానున్నాయి. గత ఏడాది యాసంగి సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 1,82,021 మంది రైతులకు గానూ రూ.206.29 కోట్లు మంజూరు కాగా ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లావ్యాప్తంగా 1,85,937 మందికి రూ.206.69 కోట్లు మంజూరు కానున్నాయి. కాగా.. యాసంగి సీజన్‌తో పోలిస్తే జిల్లాలో 3916 మంది రైతులు పెరిగారు. వీరికి గానూ రూ. 39.48 లక్షల పెట్టుబడి సాయంగా అందనుంది.
జూన్ 18 తేదీ కటాఫ్‌గా..
రైతుబంధు పొందేందుకు జూన్ 18 తేదీని ప్రభుత్వం కటాఫ్‌గా నిర్ణయిం చింది. యాసంగి సీజన్‌లో డిసెంబరు 20 వరకు కటాఫ్ తేదీ విధించింది. కాగా.. డిసెంబరు 21 నుంచి ఇప్పటివరకు 3916 రిజిస్ట్రేషన్లు కొత్తగా అయ్యా యి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు జూలై 3 లోగా దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిం ది. స్థానిక ఏఈవోలకు గానీ, ఏవో గానీ దరఖాస్తులు అందిం చాలని అధికారులు సూచిస్తున్నారు. రిజిస్ట్రేషన్ అయి ఉండి ధరణి రికార్డుల్లో చూపించిన రైతులు మాత్రమే రైతుబంధుకు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఏవైనా సాంకేతిక కారణాల వల్ల ఆన్‌లైన్‌లో చూపించని వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. కాగా.. డిసెంబరు 21 నుంచి జూన్ 18 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారి వివరా లు ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ అయ్యాయి. ఆ వివరాల ఆధారంగానే కొత్త వారికి రైతుబంధు రానుంది. కాగా.. కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలను స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో అందిస్తే రైతుబంధు వెబ్‌సైట్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాత రైతులకు రైతుబంధు ఓ వైపు జమ అవుతూనే కొత్త దరఖాస్తులను సైతం జూలై 3 వరకు స్వకరిస్తారు. పాత వారికి ఖాతాల్లో జమ కావడం పూర్తి అయిన తర్వాత కొత్త వారికి కూడా జమ చేస్తారు.
త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలి : వినోద్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి, జనగామ
రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని పొందేందుకు గానూ జూన్ 18 లోగా కటాఫ్ తేదీగా ప్రభుత్వం విధించింది. కొత్త రైతులు జూలై 3 లోగా దరఖాస్తు చేసుకోవాలి. త్వరగా దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి పంపిస్తాం. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లావ్యాప్తంగా 1.85,937 మంది రైతులకు గానూ రూ. 206.69 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ పెట్టుబడిసాయం సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ఎప్పటి లాగే మొదటగా ఎకరం నుంచి ప్రారంభమై దశలవారీగా అందరికీ అందిస్తారు.