Share News

పడిలేచిన కెరటం

ABN , First Publish Date - 2023-12-05T00:10:19+05:30 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ విజయ కేతనం ఎగుర వేయడంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. 2014లో రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలై నిరాశలో ఉన్న పార్టీకి తాజా విజయం ఊపిరులూదిం ది. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీయే ఏర్పాటు చేసినప్పటికీ పదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది.

పడిలేచిన కెరటం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సత్తా చాటిన కాంగ్రెస్‌ పార్టీ

2014లో జీరో.. 2018లో రెండు స్థానాలే...

వరుస ఓటములతో పార్టీని వీడిన నాయకులు

భట్టి, రేవంత్‌ల చొరవతో పార్టీకి కొత్త ఊపు

అండగా నిలిచిన అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంక

ఆకట్టుకున్న వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ సభ

జోష్‌ పెంచిన అక్కంపేట ‘రచ్చబండ’

తాజా ఎన్నికల్లో సమష్టి కృషితో సక్సెస్‌

10 స్థానాలు కైవసం చేసుకోవడంతో పూర్వ వైభవం

హనుమకొండ సిటీ, డిసెంబరు 4 : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ విజయ కేతనం ఎగుర వేయడంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. 2014లో రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలై నిరాశలో ఉన్న పార్టీకి తాజా విజయం ఊపిరులూదిం ది. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీయే ఏర్పాటు చేసినప్పటికీ పదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ ఒడిదుడుకులకు లోనైంది. శ్రేణులకు దిక్కులేని పరిస్థితి ఏర్ప డింది. పార్టీని కింది స్థాయి నుంచి పటిష్ఠ పరిచేందుకు నాయకత్వమే కొరవడింది. పార్టీ నుంచి గెలిచిన ఒకరిద్దరు కూడా బీఆర్‌ ఎస్‌లోకి జంప్‌ కావడం, అధికారంలో ఉన్న సమయంలో కీలక పదవులు అనుభవించిన నాయకులు పెద్ద దిక్కుగా ఉండకుండా చెయ్యి ఇవ్వడం వంటి పరిణామాలు పార్టీ శ్రేణులను కుదేలు చేశాయి. ఇంతటి నిస్సహాయ స్థితి నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యలో డబుల్‌ డిజిట్‌ సాధించిన శక్తిగా ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీ మారింది.

2014లో జీరో....

2014లో తెలంగాణ రాష్ట్ర ప్రకటనతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు ఎదురు లేదనే అంచనాలు తలకిందులయ్యాయి. ఆ ఎన్నిక ల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్‌ అకౌంట్‌ జీరో కావడం గమనార్హం. టిక్కెట్‌ కేటాయింపు రగడ పరిణామాల క్రమంలో నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్‌ను వీడి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. ఆ తదుపరి ఆయన పార్టీకి ఆసోసియేట్‌ ఎమ్మెల్యేగా కొనసాగారు.

2018లో రెండు స్థానాలే

2014 ఎన్నికల్లో కంటే 2018లో పరిస్థితి మెరుగుపడుద్ది అని కాంగ్రెస్‌ శ్రేణులు భా వించాయి. కానీ నిరాశే ఎదురైంది. టీఆర్‌ఎస్‌ ప్రభంజనంతో మళ్లీ చేతికి గాయాలు అయా యి. టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన సీతక్క ములుగు నుంచి పోటీ చేసి గెలిచారు. భూ పాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచారు. మిగిలిన 10 స్థానాలను కాంగ్రెస్‌ కోల్పొయింది. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన గండ్ర వెంకటరమణారెడ్డి చెయ్యి ఇచ్చి టీఆర్‌ఎస్‌ కండువా కప్పేసుకున్నారు. సీతక్క ఒక్కరే కాంగ్రెస్‌లో మిగిలారు.

వీడిన నాయకులు..

ఉమ్మడి జిల్లాలో ఇక కాంగ్రెస్‌ కోలుకోలేదనే పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పర్యాయాల్లో రెండు ఎమ్మెల్యే స్థానాలకు మించి పార్టీ లేకపోవడం ఒకటైతే ఉన్నత పదవులు అనుభవించిన జిల్లా అగ్ర నాయకత్వం కాంగ్రెస్‌ను వీడడం పార్టీని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. కాంగ్రెస్‌లో మంత్రి పదవులు అనుభవించిన బస్వరాజు సారయ్య, రెడ్యానాయక్‌, కొండా సురేఖలతో పాటు పదేళ్లు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యేలుగా పదవులు అనుభవించిన డాక్టర్‌ టి.రాజయ్య వంటి మరెందరో నాయకులు, కార్పొరేషన్‌ పదవులు అనుభవించిన నాయకులు కాంగ్రెస్‌ను వీడడంతో పార్టీ కుంగిపోయింది. ముఖ్యంగా శ్రేణులు నాయకత్వం లేక ఒంటరిగా మిగిలారు. విచిత్రమేమిటంటే 2014లో తెలంగాణ ప్రకటించిన కాంగ్రెస్‌కు టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పొన్నాల లక్ష్మయ్య కూడా 2023 ఎన్నికలకు ముందు గుడ్‌ బై చెప్పి బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఊపిరి పోసిన రేవంత్‌..

పదేళ్ల పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న కాంగ్రెస్‌ పడిలేచిన కెరటంలా దూసుకొచ్చింది. 2014లో జీరో స్థానాలు, 2018లో ఒక్క ఎమ్మెల్యే స్థానానికి పరిమితమైన కాంగ్రెస్‌ 2023 ఎన్నికల మజిలీలో ఉమ్మడి జిల్లా నుంచి ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రం లో కాంగ్రెస్‌కు వచ్చిన 64 స్థానాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా 10 స్థానాలను ఇచ్చి ఘనతను చాటింది. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టాక ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో జోష్‌ ఏర్పడింది. క్రమ క్రమంగా శ్రేణుల్లో నాయకత్వ భరోసా పెరిగింది. రేవంత్‌రెడ్డి పదునైనా డైలాగులు, జిల్లాకు ఆయన పలుమార్లు రావడం, పార్టీ పటిష్ఠతకు దిశా, నిర్దేశం చేయడంతో పార్టీలో క్రమ క్రమంగా నిస్తేజం దూరమై ఉత్సాహం బలపడుతూ వచ్చింది.

రైతు సంఘర్షణ సభ..

వరంగల్‌ ఉమ్మడి జిల్లా వేదికగా హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో 2022 మే 6న జరిగిన రైతు సంఘర్షణ సభ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ బలపడేందుకు బీజాలను నాటింది. వరంగల్‌ జిల్లాలోనే కాదు ఉత్తర తెలంగాణలోనే పార్టీకి ఈ సభ ఊపునిచ్చింది. రైతు డిక్లరేషన్‌ కాంగ్రెస్‌ ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ రైతు వ్యతిరేక చర్యలు, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు జరిపే ప్రయోజనాలను రాహుల్‌గాంధీ ఈ సభ ద్వారా స్పష్టంగా తెలియచేశారు.

రేవంత్‌ రచ్చబండ

పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని ఆచార్య జయశంకర్‌ స్వస్థలమైన అక్కంపేటలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పాల్గొన్న ’రచ్చబండ’ కార్యక్రమం కూడా పార్టీకి బలాన్ని పెంచింది. ఈ కార్యక్రమంతో రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో మరింత నమ్మకాన్ని పెంచారు. కాంగ్రెస్‌ బలపడుతుందనే భావన శ్రేణుల్లో బలపడుతూ వచ్చింది. ఆచార్య జయశంకర్‌ గుర్తుగా ఆయన స్వస్థలమైన ’అక్కంపేట’ను దత్తత తీసుకుంటున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ తరువాత కూడా అనేక పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో రేవంత్‌రెడ్డి పాల్గొన్ని పార్టీలో ఉత్సాహాన్ని నింపడంతో ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్‌ పటిష్ఠపడింది.

పాదయాత్రలు

వరంగల్‌ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్కలు జరిపిన పాదయాత్రలు కూడా పార్టీకి ఊపునిచ్చాయి. పాదయాత్రలో పాల్గొన్న అగ్రనేతలు పార్టీ పటిష్ఠతకు దిశా, నిర్దేశం చేస్తూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.

రాహుల్‌, ప్రియాంక..

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పది స్థానాలను కైవసం చేసుకోవడంలో అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీల పర్యటనలు, ప్రచార కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయి. సంవత్సరం క్రితమే రైతు సంఘర్షణ సభతో వరంగల్‌కు వచ్చిన రాహుల్‌గాంధీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి ప్రజలకు కాంగ్రెస్‌ను చేరువ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, వరంగల్‌ తూర్పు పర్యటించి వరంగల్‌ ప్రజలను ఆకర్షించారు. ఇక ప్రియాంకగాంధీ ఎన్నికలను పురస్కరించుకొని తొలిసారిగా వరంగల్‌లో అడుగిడారు. ముఖ్యంగా మహిళలు, ఇందిరాగాంధీ తరం నాటి వారిని ప్రియాంకగాంధీ ఆకర్షించారు. పాలకుర్తి సభలో ప్రియాంకగాంధీ పాల్గొనడమే కాంగ్రెస్‌కు మైలేజ్‌గా మారింది. మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావుపై యశస్వినిరెడ్డి అద్భుత విజయం సాధించడానికి ప్రియాంకగాంధీ పాల్గొన్న సభే టర్నింగ్‌ పాయింట్‌ అయిందని చెబుతున్నారు.

Updated Date - 2023-12-05T00:10:20+05:30 IST