‘ఆరెంజ్’ అలర్ట్
ABN , First Publish Date - 2023-12-05T23:55:26+05:30 IST
జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు వర్షాలు కురుస్తు న్నాయి. మీచౌంగ్ తుపాన్ ప్రభావంతో వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మహబూబాబాద్ జిల్లాను ఆరెంజ్ అలర్ట్‌గా ప్రకటింటింది. వర్షంతోపాటు బలమైన ఈదురుగాలులు వీస్తోండడంతో జనం చలికి గజగజ వణుకుతున్నారు. ప్రజలు రెయిన్ కోట్‌లు, స్వేటర్‌లు వేసుకుని యథావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
‘మీ చౌంగ్’ తుపాన్‌తో రైతుల ఇబ్బందులు
ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పిన కర్షకులు
చలికి గజగజ వణుకుతున్నజనం
నేడు కేసముద్రం, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లకు సెలవు
కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
మహబూబాబాద్ అగ్రికల్చర్, డిసెంబరు5 : జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు వర్షాలు కురుస్తు న్నాయి. మీచౌంగ్ తుపాన్ ప్రభావంతో వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మహబూబాబాద్ జిల్లాను ఆరెంజ్ అలర్ట్‌గా ప్రకటింటింది. వర్షంతోపాటు బలమైన ఈదురుగాలులు వీస్తోండడంతో జనం చలికి గజగజ వణుకుతున్నారు. ప్రజలు రెయిన్ కోట్‌లు, స్వేటర్‌లు వేసుకుని యథావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తోండడంతో జిల్లాలోని కొన్ని మండలాల్లో వరి పొలాలు నేలవాలాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ వ్యవసాయ మార్కెట్ ఓపెన్ యార్డులలో ధాన్యం కుప్పలకు టార్పాలిన్‌లు కప్పుకుని వాటిని కాపాడుకుంటున్నారు. అడుగుభాగంలో కొంతభాగం కొట్టుకుపోయి కొంత నష్టం జరిగింది.
జిల్లాలో మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో కేసముద్రం, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లకు బుధవారం సెలవు ప్రకటించారు. మిచౌం గ్ తుఫాన్ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు తక్షణ సాయం కోసం జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మం గళవారం ఉదయం 8 గంటల వరకు 56.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.
జిల్లాలో ఇలా..
కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం ధాన్యం భారీగా రావడంతో ఓపెన్‌యార్డులో ఉన్న రాశులపై టార్పాలిన్‌లు కప్పుకున్నప్పటికి అడుగుభాగంలో ఉన్న వడ్లు తడిసిపోయాయి. కాంటాలు అయి తరలించేందుకు సిద్ధంగా ఉన్న వ్యాపారులకు చెందిన పలు బస్తాలు తడిసిపోయాయి. దీంతో బుధవారం తుఫాన్ కారణంగా వ్యవసాయ మార్కెట్ బంద్ చేస్తున్నట్లు చైర్‌పర్సన్ నీలం సుహసిని తెలిపారు.
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం ఆరు వేలబస్తాల ధాన్యం రాగా, కాంటాలు మాత్రం 4 వేల బస్తాలకు మాత్రమే అయ్యాయి. ఇంకా 2 వేల బస్తాలు మిగిలిపోగా, మంగళవారం ఆ బస్తాలతో పాటు వచ్చిన బస్తాలతో మార్కెట్ కిక్కిరిసిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. షెడ్లలో చివరిలో ఉన్న ధాన్యం రాశులు కొంతమేర తడిసిపోవడంతో కొంతమంది రైతులు మార్కెట్ కార్యాలయంకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. కాగా, తుఫాన్ కారణంగా మహబూబాబాద్ మార్కెట్‌కు బుధవారం సెలవు ప్రకటించినట్లు చైర్మన్ కత్తెరసాల విద్యాసాగర్ తెలిపారు. మండలంలో కూడా అక్కడక్కడ కోసిన వరికుప్పలు తడిసిపోయాయి.
జిల్లాలోని కొత్తగూడ మండలంలో తుఫాన్‌తో మం గళవారం సాయంత్రం ఓ మోస్తారు వర్షం కురిసింది. పోగళ్లపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంకు భారీగా రాశులు వచ్చినప్పటికి రైతులు టార్పాలిన్‌లు కప్పుకుని తమ రాశులను కాపాడుకున్నారు. కురిసిన వర్షానికి టార్పాలిన్‌లపై నిలిచిననీరు తొలగించారు. కురవి, మరిపెడ, రూరల్ గ్రామాలు, పెద్దవంగర, నెల్లికుదురు, తొర్రూరు, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, గూడూరు, ఇనుగుర్తి, సీరోలు మండలాల్లో వరి పొలా ల్లో కోసిన మెదళ్లు తడిసిపోయాయి. డోర్నకల్‌లో పత్తి చేలలో కాయపగిలి దూది బయటకు రావడంతో కురిసిన వర్షానికి పత్తి తడిసి రంగు మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
56.8 మిల్లిమీటర్ల వర్షం..
మహబూబాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు 56.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైందని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (రసీపీవో) సుబ్బారావు తెలిపారు. కొత్తగూడలో 1.2 మిల్లిమీటర్లు, బయ్యారంలో 0.6, గార్లలో 7.6, డోర్నకల్‌లో 6.4, కురవిలో 4.8, మహబూబాబాద్‌లో 1.8, కేసముద్రంలో 2.2, నెల్లికుదురులో 4.8, నర్సింహులపేటలో 5.6, చిన్నగూడూరులో 6.4, మరిపెడలో 1.4, దంతాలపల్లిలో 6.6, తొర్రూరులో 6.2, పెద్దవంగరలో 1.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా వ్యాప్తంగా 56.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 3.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ శశాంక
తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక సూచించారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం నెంబర్ -7995074803 ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 24 గంటల పాటు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.